పేరుకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. చేసింది పచ్చి మోసం

ఓ పెద్ద సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్. పెద్ద పొజిషన్ లో కూడా ఉన్నాడు. కానీ హోదాకు తగ్గట్టు మాత్రం ప్రవర్తించలేదు ఆ ఉద్యోగి. తన సహ ఉద్యోగిని మోసం చేశాడు. శారీరకంగా ఆమెను…

ఓ పెద్ద సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్. పెద్ద పొజిషన్ లో కూడా ఉన్నాడు. కానీ హోదాకు తగ్గట్టు మాత్రం ప్రవర్తించలేదు ఆ ఉద్యోగి. తన సహ ఉద్యోగిని మోసం చేశాడు. శారీరకంగా ఆమెను వాడుకోవడంతో పాటు ఆర్థికంగా కూడా మోసం చేశాడు. హైదరాబాద్ లో జరిగింది ఈ ఘటన.

విప్రోలో టీమ్ లీడర్ గా పనిచేస్తున్నాడు జాయ్. ఇతడిది ఒరిస్సా రాష్ట్రం. అదే కంపెనీకి ఉద్యోగం కోసం వచ్చింది ఆల్వాల్ కు చెందిన ఓ యువతి. ఆమెను ఇతడే ఇంటర్వ్యూ చేశాడు. ఉద్యోగం కూడా ఇచ్చాడు. అలా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా కూడా మారింది.

తక్కువ రోజుల్లోనే ఇద్దరూ క్లోజ్ అయిపోయారు. అమ్మాయిని తన రూమ్ కు తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెను శారీరకంగా కూడా అనుభవించాడు జాయ్. ఆ తర్వాత అసలు మోసానికి తెరదీశాడు. కొత్త వ్యాపారం చేస్తున్నానని డబ్బులు కావాలని అడిగాడు. కాబోయే భర్త, పైగా ఆఫీస్ లో తన టీమ్ లీడర్. దీంతో అమ్మాయి నమ్మింది. దాచుకున్న 10 లక్షలు తెచ్చి ఇచ్చింది.

అక్కడితో జాయ్ ఆగలేదు. ఓవైపు అమ్మాయిని శారీరకంగా వాడుకుంటూనే, మరోవైపు మరింత డబ్బు కావాలని కోరాడు. దీంతో ఆ అమ్మాయి 3 బ్యాంకుల నుంచి 27 లక్షలు అప్పు చేసి మరీ అతడికి ఇచ్చింది. అమ్మాయి నుంచి మొత్తం పిండేశానని తెలుసుకున్న జాయ్ ఫోన్ స్విచాఫ్ చేశాడు. పరారయ్యాడు.

తను మోసపోయానని గ్రహించిన అమ్మాయి కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహారాష్ట్రలోని నాసిక్ లో జాయ్ ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు, వల పన్ని అతడ్ని అరెస్ట్ చేశారు. ట్విస్ట్ ఏంటంటే.. ఇతగాడికి ఇదివరకే పెళ్లయింది. భార్య పుట్టింటికి వెళ్లిన గ్యాప్ లో బాధితురాలితో సంసారం చేశాడు. జాయ్ ఎకౌంట్ లో ఉన్న 32 లక్షల రూపాయల్ని పోలీసులు సీజ్ చేశారు.