Advertisement

Advertisement


Home > Movies - Movie News

వర్మ గారూ.. ప్లీజ్ రీడ్ దిస్!

వర్మ గారూ.. ప్లీజ్ రీడ్ దిస్!

గ్రాఫిక్స్ హడావుడి కాదు, కేవలం కథలోని బలం, లోతైన భావావేశాలు, భిన్నమైన మేకింగ్ తో తెలుగు సినిమాను ఎప్పుడో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన అసమాన దర్శకుడు రాంగోపాల్ వర్మ. సినిమా మేకింగ్ కు సంబంధించి పాఠాల్లా ప్రస్తావించదగిన సినిమాలు తీశారు. మేధావి. అద్భుతమైన చదువరి. ఇంగ్లిషు సాహిత్యాన్ని, తనకు ఇష్టమైన రచయితల్ని బాగా చదివిన వ్యక్తి. భిన్నమైన, సమకాలీన దర్శకుల్లో ఎవ్వరికీ ఉండనంత లోతైన ఆలోచన దృక్పథం ఉన్నవాడు. అలాంటి వాడు నాగార్జున యూనివర్సిటీ కార్యక్రమంలో మాట్లాడిన మాటలు కంపరం పుట్టిస్తున్నాయి.

తిని, తాగి ఎంజాయ్ చేయండి.. స్వర్గంలో రంభ ఊర్వశి ఉంటారో లేదో తెలియదు.. ఇక్కడే ఎంజాయ్ చేయండి.. నేనైతే ప్రపంచంలో మగాళ్లందరూ చచ్చిపోయి నేనొక్కడినే బతకాలని అనుకుంటా.. అప్పుడు ఆడజాతికి నేనే దిక్కవుతా లాంటి మాటలు రాంగోపాల్ వర్మ మాట్లాడారు. ఎదుటివారు ఏమనుకుంటారో అని బతికేవాడు చచ్చిపోయినట్టే లాంటి మాటలు కూడా చెప్పారు.

బహుశా ఇదే విషయాన్ని ఏదైనా ఆధ్యాత్మిక స్వామీజీలు ‘‘మీ మీ అంతరంగ చైతన్యం ఏమని ప్రబోధిస్తుందో అలాగే జీవించండి’’ అని చెబితే అందరూ సూపర్ అంటారు. కానీ ఆర్జీవీ చెప్పేసరికి అసహ్యించుకుంటున్నారు. ఆర్జీవీ చెప్పింది కూడా అదే. సేమ్ థింగ్. కానీ చెప్పే పద్ధతిలో ఆయనలోని పైత్యం మొత్తం బయటపడుతోంది. 

‘నాకు నచ్చినట్టే చెప్తా’ అనే ముసుగు ఆయన వేసుకోవచ్చు. అది ఆయనకు బాగా అలవాటు. కానీ అది కూడా ఆయన చేసుకుంటున్న అతి పెద్ద ఆత్మవంచన. 

నా మాటలు ఎవరైనా వింటున్నారంటే.. వాళ్లు నా దగ్గరినుంచి సెక్స్, అమ్మాయిలు, తాగుడులో విచ్చలవిడితనం గురించి ఆశిస్తారు.. నేను అదే చెప్పాలి అని ఆయన ఫిక్స్ అయిపోయారు. యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇచ్చీ ఇచ్చీ.. ఆయన బుద్ధి అలా తయారైపోయింది. యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో ఆర్జీవీ నుంచి ఆయనలోని మేథస్సును, జ్ఞానాన్ని బయటకు రాబట్టింది.. స్వప్న చేసిన రామూయిజం సిరీస్ మాత్రమే. 

ఆయన తన ప్రతి సినిమాకు ముందు దారిన పోయే ప్రతి ముష్టి యూట్యూబ్ చానెల్ ను కూడా పిలిచి ఇంటర్వ్యూ ఇస్తారు. ఈ చానెల్స్ వాళ్లు కూడా.. లేకిగా, వెకిలిగా మాట్లాడగల అమ్మాయిలకు అర్ధనగ్నంగా బట్టలేసి.. రాంగోపాల్ వర్మ తో వెకిలి సెక్స్ మాటలు మాట్లాడించడం ద్వారా.. తమ ప్రేక్షకుల్లో సెక్స్ , కామోద్రేకాలు కలిగించడమే లక్ష్యంగా ఆ ఇంటర్వ్యూలకు వెళ్తారు. 

రాంగోపాల్ వర్మకు తాను నిజం చెప్పాలనే ఆలోచన ఏ కోశానా ఉండదు. అడగిన వాళ్లు ఆశించే సెక్స్ ఉద్దీపన సమాధానాలు ఇచ్చి.. వారి ద్వారా తన సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో ఆయన ఉద్ధండుడు. ‘ఈ సమయంలో నాకు నీతో గడపాలని అనిపిస్తోంది’ లాంటి జవాబులు చెబుతూ.. వారి నుంచి వెకిలి బజారు నవ్వులను రాబట్టి.. ఆ యూట్యూబ్ వీడియోల వ్యూస్ పెరిగేలా బతకడానికి ఆయన అలవాటు పడ్డాడు. 

ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి అతిథిగా పిలిచినా.. అక్కడి కుర్రవాళ్లంతా తన సెక్స్ సందేశాన్ని ఆశిస్తారనే ఆయన అనుకోవడం భ్రమ. సినిమా మేకింగ్ కు సంబంధించి తెలుగులో మాస్టర్ క్రాఫ్ట్స్ మన్ అయిన వర్మ- టార్గెట్ ఆడియన్స్ ను బట్టి తీయడం అనే నీతి తెలియని వాడు కాదు. కానీ గాడి తప్పాడు. 

యూట్యూబ్ లో ఆయన ఎంత వంకర బూతులు మాట్లాడినా పర్లేదు. ఆయన బూతుల్ని, ఆయన నోటినుంచి వెల్లువెత్తే సెక్స్ ప్రవాహాన్ని జుర్రుకుని ఆస్వాదించే వాళ్లు మాత్రమే ఆ వీడియోలు చూస్తారు. కానీ.. ఒక విశ్వవిద్యాలయం కార్యక్రమానికి వెళ్లినప్పుడు.. అక్కడ అన్ని రకాల వాళ్లూ ఉంటారు. అందరికీ అదే ధోరణిలో చెప్పడం తప్పు. ఆయన చెప్పినది వేదాంతులు చెప్పే సంగతే. కానీ.. ‘ఎలా చెబుతున్నాం’ అనేది ఆయన మిస్సయ్యారు. 

ఆర్జీవీ తీరు అంతే అని సరిపెట్టుకోవచ్చు. క్రియేటివ్ జీనియస్ ను విద్యార్థులకు నేరుగా చూపించి స్ఫూర్తిని అందించడానికి యూనివర్సిటీ వర్గాలు ఆయనను పిలిపించి ఉండవచ్చు. కానీ.. ఆ మాటల తర్వాత కూడా ఆయనను వారు సమర్థించడం సిగ్గుచేటు. వర్మ అలా మాట్లాడినందుకు బాధపడడం ఒక పార్ట్ అయితే.. ఆయన మాటలను సమర్థించిన అధికారుల తీరుకు అందుకు వందరెట్లు సిగ్గుపడాలి. ఇలాంటి భావదారిద్ర్యం గల అధికారుల చేతిలో విద్యార్థుల భవిష్యత్తు ఉన్నందుకు భయపడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?