ఆర్జీవీ సినిమా వ్యూహం టీజర్ వచ్చేసింది. ఆంధ్ర సీఎం వైఎస్ మరణంతో మొదలైంది ఈ ట్రయిలర్. గమ్మత్తేమిటంటే వ్యూహం ఏమిటి అన్నది క్లారిటీ లేకుండానే ట్రయిలర్ ను కట్ చేయడం.
జగన్ ను సీఎం కాకుండా పన్నిన వ్యూహమా? సీఎం కావడానికి జగన్ చేసిన ప్రయత్నమా? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేసారు.. చంద్రబాబు అండ్ కో చేసింది ఏమిటి? ఇలా అనేక సందేహాలు రేకెత్తిస్తూ ట్రయిలర్ ను కట్ చేసారు తప్ప, ఓ అంచనాకు వచ్చేలా చేయలేదు.
ఇందులో ట్విస్ట్ ఏమిటంటే ట్రయిలర్ లో కట్ చేసిన ఓ సీన్. రాజశేఖర రెడ్డి ఫొటో బ్యాక్ డ్రాప్ లో వుండగా వైఎస్ భారతి పాత్ర ధారి అదోలా నవ్వుతూ, జగన్ పాత్రధారికి షేక్ హ్యాండ్ ఇవ్వడం. ఇద్దరూ అదోలా నవ్వుకోవడం. ఇదేంటో, ఈ సీన్ ఏమిటో? ఎవరి అర్థం వాళ్లు తీసుకోవాల్సిందే సినిమా వచ్చే వరకు.
ట్రయిలర్ లో ఆకట్టుకునేది పాత్రలకు తగిన నటుల ఎంపిక. ఆ విషయంలో ఆర్జీవీని ఎవరూ దాటలేరు. భారతి, రోశయ్య, చంద్రబాబు ఇలా అన్ని పాత్రలకు తగిన నటులను తీసుకువచ్చారు. అక్కడే సగం విజయం సాధించేస్తారు. జనాలు థియేటర్ కు వచ్చి చూస్తారా..చూడరా అన్నది పక్కన పెడితే సోషల్ మీడియాలో వైరల్ అయిపోవడానికి ఇది చాలు.