థియేటర్ల పరిస్థితి దారుణంగా వుంది. సరైన సినిమాలు లేక థియేటర్లు వెలవెల పోతున్నాయి. సరైన సినిమా కనిపిస్తే చాలు కళ్లకు అద్దుకుని తీసుకోవాలని అనుకునే పరిస్థితి. ఇలాంటి టైమ్ లో స్పై సినిమా వస్తోంది. జనాలు మాకు కావాలి మాకు కావాలి అంటున్నారు. ఇలాంటి పరిస్థితిని వైజాగ్ ఏరియాలో దిల్ రాజు తనకు అనుకూలంగా భలే మార్చుకుంటున్నారని తెలుస్తోంది.
ఆగస్ట్ రెండో వారంలో రజనీ కాంత్ జైలర్ సినిమా విడుదల వుంది. అదే టైమ్ లో మెగాస్టార్ భోళాశంకర్ విడుదలవుతోంది. హిందీ సినిమా యానిమల్ కూడా వుంది. అది మనకు పెద్ద సినిమా కాదు కానీ, సందీప్ వంగా దర్శకుడు కనుక ఎ సెంటర్లలో కాస్త ఆసక్తి వుంటుంది. అయితే ఉత్తరాంధ్ర ఏరియాకు భోళాశంకర్ పంపిణీ దిల్ రాజు ది కాదు.
అందుకే ఇప్పటి నుంచీ జాగ్రత్త పడుతున్నారు. స్పై సినిమా ఇవ్వాలంటే జైలర్ సినిమాకు థియేటర్ ఇస్తామని ముందే అగ్రిమెంట్ అడుగుతున్నారు. దాంతో ఇప్పుడు కీలకమైన థియేటర్లు అన్నీ జైలర్ కు బుక్ అవుతాయి. రేటు కు ఆశపడి భోళాశంకర్ సినిమాను ఉత్తరాంధ్రకు కొత్తవాళ్లకు ఇచ్చారు. వాళ్లకు ఈ థియేటర్లు, బుకింగ్ లు, అగ్రిమెంట్ లు, అన్నీ పట్టే లోగానే కీలకమైన థియేటర్లు జైలర్ కు అగ్రిమెంట్ అయిపోతాయి.
భోళాకు థియేటర్లు దొరకవు అని కాదు కానీ కీలమైన థియేటర్లు దొరకడం కష్టం అవుతుంది.