లోకంలో ఎన్నెన్ని రకాల మనుషులున్నారో బాలీవుడ్ నటి రిచాచద్దాను చూస్తే తెలుస్తుంది. సహజంగా ఒక్కో రోజు ఒక్కో ప్రాధాన్యం కలిగి ఉంటుంది. తల్లికి, తండ్రికి, మహిళలకు, సిఫాయిలకు, పర్యావరణానికి ….ఇలా ఒక్కోదానికి ఒక్కో రోజు జరుపుకుంటూ వాటి ప్రాధాన్యత గురించి అవగాహన కల్పిస్తుంటారు. సహజంగా స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ జనాన్ని జాగృతపరుస్తుంటాయి.
ఈ నెల 21న కౌగిలింతల దినాన్ని పురస్కరించుకుని బాలీవుడ్ నటి రిచాచద్దా ఫ్రీహగ్స్ అంటూ ప్లకార్డు పట్టుకుని దారిన పోయే వారందరికీ కౌగిలింతలతో ఆశ్చర్యపరచింది. ఇంతకూ ఏంటీ పిచ్చిపని అని ఎవరైనా అడిగితే కౌగిలింతలో చాలా సౌక్యం ఉందని చెబుతుందామె. కౌగిలింత ఒత్తిడి దూరం చేసి…ప్రేమను పంచుతుందని ఆమె చెబుతారు.
ఈ సందర్భంగా రిచా ఇన్‌స్టాగ్రామ్‌లో కౌగిలింతల వీడియోతో పాటు చక్కటి సందేశాన్ని పోస్ట్ చేశారు. ఇంతకూ ఆమె ఏమంటారంటే…
“ఈ ప్రపంచం ద్వేషమయమైంది. దాన్ని ప్రేమతోనే తగ్గించగలం. అందుకే నేను ముక్కూమొహం తెలియని వారిని కౌగిలించుకుని ప్రేమను పంచాను. ఇది ఒక రకమైన ప్రేమ సంగీతం. మున్ముందు కూడా ఇలా చేయాలని నిర్ణయించుకున్నాను. వచ్చే ఏడాది ఎవరైనా నన్ను కలవొచ్చు. సంతోషంగా ఉండండి…ప్రేమను పంచండి” అని ఆమె పేర్కొన్నారు.