ఇప్పుడు ఎలాంటి ఆనారోగ్యానికి గురైనా అనుమానించాల్సిన పరిస్థితులున్నాయి. జలుబు, దగ్గు, జ్వరంతో బాధ పడుతున్నా రంటే చాలు…కరోనా అయి ఉంటుందేమో అని తడుముకోకుండా నోట్లో నుంచి మాట వస్తోంది. దీన్ని బట్టి కరోనా మనల్ని ఎంతగా భయపెడుతున్నదో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా ప్రముఖ కన్నడ నటుడు, నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ అనారోగ్యానికి గురైనట్టు తెలియగానే చిత్ర పరిశ్రమ ఉలిక్కి పడింది. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. సదరు నిర్మాత కుమారుడు డాక్టర్ అభిలాష్…తండ్రికి ట్రీట్మెంట్ ఇస్తుండడం విశేషం.
రాక్‌లైన్ వెంకటేష్ కేవలం కన్నడ సినిమాలకే పరిమితమైన నిర్మాత కాదు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషా చిత్రాల్లో పలు హిట్ చిత్రాలను అందించాడు. తెలుగులో రవితేజతో ‘పవర్’ సినిమా నిర్మించాడు. అలాగే బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ నటించిన బ్లాక్‌బస్టర్ ‘బజరంగీ భాయీజాన్’కు ఆయన సహ నిర్మాత. రజనీకాంత్ ‘లింగా’ సినిమాను ఆయనే నిర్మించడం విశేషం. అలాగే రామ్ గోపాల్ వర్మ ‘కిల్లింగ్ వీరప్పన్’లో ఆయన మైసూర్ ఎస్పీగా నటించడం గమనార్హం.
ప్రస్తుతం ఆయన శ్వాస సంబంధ సమస్యతో ఆస్పత్రి పాలు కావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం తన తండ్రి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్ అభిలాష్ వెల్లడించాడు. కాగా శ్వాస సమస్య అంటే కరోనా లక్షణం కావడంతో, రాక్‌లైన్ వెంకటేష్ కూడా ఆ మహమ్మారి బారిన పడ్డాడని పలు భాషల చిత్ర పరిశ్రమల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారానికి బలం కలిగించే అంశాలు లేకపోలేదు.
ఇటీవల ప్రముఖ నటి, ఎంపీ సుమలత తనకు కరోనా పాజిటివ్ అని ప్రకటించారు. ఇటీవల సుమలత భర్త అంబరీశ్ స్మారక విగ్రహం ఏర్పాటు చేసే క్రమంలో ఆమెతో వెంకటేష్ చర్చించాడు. అనంతరం ఇదే విషయమై ఆయన కర్నాటక సీఎం యెడియూరప్పను కూడా కలిసి చర్చించారు.
దీంతో సుమలత ద్వారా వెంకటేష్‌కు కరోనా వ్యాపించి ఉంటుందని పలువురి వాదన. అయితే ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షల విషయమై ఇంత వరకూ అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు. వెంకటేష్ లేదా ఆయన కుటుంబ సభ్యులు వాస్తవం ఏంటో చెబితే తప్ప …కరోనాపై ప్రచారం సాగుతూనే ఉంటుంది.