కొన్నాళ్ల క్రితం వరకు ఆంధ్రలో ఒకటే లొల్లి. థియేటర్లు కుదేలయిపోతున్నాయి. రేట్లు కిట్టుబాటు కావడం లేదు. అంటూ. మీడియాలొ కూడా అదే గడబిడ. సినిమా పరిశ్రమను జగన్ చంపేస్తున్నారంటూ. దాన్ని కారణంగా చూపించి, అఖండ, పుష్ప లాంటి సినిమాలకు బయ్యర్లు డిస్కౌంట్ బేరాలు సాగించారు.
ఆ మేరకు డిస్కౌంట్లు ఇచ్చారు కూడా. సరే, అంతా గతం. ఇప్పుడు థియేటర్ టికెట్ రేట్లను వారి కోరిక మేరకు ప్రభుత్వం సవరించింది. పైగా రోజుకు అయిదు ఆటలు ఇచ్చింది.
అయినా కూడా ఆర్ఆర్ఆర్ రేట్లు తగ్గించాలని బయ్యర్లు కోరుతున్నారు. ఆంధ్ర (సీడెడ్ కాకుండా) 100 కోట్ల మేరకు కొనుగోలు చేసారు. అడ్వాన్స్ లు కట్టారు. కానీ ఇప్పుడు తీరా విడుదల దగ్గరకు వచ్చేసరికి రేట్లు తగ్గించాలంటూ బేరాలు ఆడుతున్నట్లు తెలుస్తోంది. దీనికీ కారణం వుంది.
ఎప్పుడో జమానా కాలం నాడు అడ్వాన్స్ లు ఇచ్చారు. కరోనా కారణంగా సినిమా ఆలస్యం అయింది. అందువల్ల తమకు వడ్డీల భారం పడిందని బయ్యర్లు చెబుతున్నారు. ఆ మేరకు కనీసం ఇరవై శాతం అన్నా డిస్కౌంట్ ఇవ్వాలని బయ్యర్లు కోరుతున్నారని తెలుస్తోంది.
అయితే ప్రభుత్వం కనుక 100 రూపాయలు అదనపు రేటు ఇస్తే, ఇక ఈ డిమాండ్ వుండకపోవచ్చు. అలా ఇచ్చినా కూడా వడ్డీలు, ఇంత భారీ రేట్లు గిట్టుబాటు కావని, ఎగ్ఙిబిటర్ల దగ్గర డబ్బులు లేవని, అడ్వాన్స్ లు రావడం లేదని, అందువల్ల కొంతయినా తగ్గిస్తే బెటర్ అని ఆర్ఆర్ఆర్ కొన్న ఓ డిస్ట్రిబ్యూటర్ అన్నారు.