కేసీఆర్ కు కంటయ్యాడు …మరో వివాదంలో ఇరుక్కున్నాడు!

త్రిదండి చినజీయర్ స్వామి మరోసారి వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఈసారి సీఎం కేసీఆర్ తో వివాదం కాదు. మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇది మాత్రం ఆయన చేతులారా చేసుకున్నదే. కొంతకాలం కిందట ముచ్చింతల్లోని ఆశ్రమంలో…

త్రిదండి చినజీయర్ స్వామి మరోసారి వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఈసారి సీఎం కేసీఆర్ తో వివాదం కాదు. మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇది మాత్రం ఆయన చేతులారా చేసుకున్నదే. కొంతకాలం కిందట ముచ్చింతల్లోని ఆశ్రమంలో రామానుజాచార్య విగ్రహావిష్కరణ సమయంలో కేసీఆర్ తనకు అవమానం జరిగిందని ఫీలవడం, ప్రధాని మోడీకి చినజీయర్ ప్రాధాన్యం ఇచ్చారని మండిపడటం, మోడీకి స్వాగతం చెప్పడానికి వెళ్ళకపోవడం దీంతో చినజీయర్ -కేసీఆర్ మధ్య దూరం పెరగడం … ఈ కధంతా అందరికీ తెలిసిందే.

యాదాద్రి ఉద్ఘాటనకు కూడా జీయర్ స్వామిని ఆహ్వానించకపోవొచ్చని అనుకుంటున్నారు. అందులోనూ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ మనసు మనసులో లేదు. ఈ ప్రభావం చిన జీయర్ మీద తప్పకుండా ఉంటుంది. ఇదిలా ఉంటే చినజీయర్ సమ్మక్క -సారలమ్మ వివాదంలో ఇరుక్కున్నారు. ఈ వివాదంలో జీయర్ మీద పోలీసు కేసు కూడా నమోదు అయింది.

అందులోనూ చినజీయర్ గిరిజనులతో పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో (అది ఎప్పటిదో తెలియదు) చినజీయర్ స్వామి గిరిజనులు (కేవలం గిరిజనులే కాదు, తెలంగాణలోని సబ్బండ వర్గాలు) ఎంతగానో ఆరాధించే సమ్మక్క సారలమ్మల మీద జీయర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో గిరిజన ఆరాధ్యదైవాలైన సమ్మక్క సారలమ్మలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చిన్న జీయర్ స్వామిపై తెలంగాణ ఆదివాసీ గిరిజన సంక్షేమ సంఘాలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నాయి.

చిన్న జీయర్ స్వామి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, ఆదివాసీ గిరిజనులకు క్షమాపణ చెప్పాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దిష్టి బొమ్మల దహనాలు, చిన్న జీయర్ ఫొటోకు చెప్పుల దండలు వేసి తమ నిరసన తెలియజేస్తున్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా జీయర్ స్వామిని తీవ్రంగా విమర్శించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేసు నమోదైంది.

చిన్న జీయర్ స్వామి మేడారం సమ్మక్క సారలమ్మ లపై చేసిన వ్యాఖ్యలకు ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆదివాసీల ఆరాధ్య దైవం అయిన, వనదేవత లైన సమ్మక్క, సారలమ్మలను అవమానించేలా చిన్న జీయర్ స్వామి మాట్లాడారని, ఆయన మాట్లాడిన వీడియోతో సహా పోలీసులకు ఇచ్చి కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.

ఆదివాసి ఆడబిడ్డ చరిత్ర తెలియని చిన్న జీయర్ కు వారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. జనాల దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేసే చరిత్ర చిన్న జీయర్ స్వామిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మక్క సారలమ్మలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన్న జీయర్ స్వామి వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. చిన్న జీయర్ వ్యాఖ్యలపై ప్రముఖ సినిమా నిర్మాత అశ్వనీదత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సమ్మక్క సారలమ్మ ల పై చిన్న జీయర్ స్వామి కి చేసిన కామెంట్లు చాలా బాధ కలిగించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వెంటనే చిన్న జీయర్ స్వామి తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే చిన్న జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలను సిపిఐ నేత నారాయణ ఖండించారు. తక్షణమే ఈ చిన్న జీయర్ స్వామి తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను ఖండించాలి అన్నారు సిపిఐ నారాయణ. సమ్మక్క-సారలమ్మలను అవమానించేలా చిన్న జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు దారుణమని పేర్కొన్నారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారులు చిన్న జీయర్ స్వామి వెంట ఉన్నారని ఆరోపించారు. ఆధ్యాత్మికత పేరుతో వ్యాపారం చేస్తున్న వ్యక్తి చిన్న జీయర్ స్వామి అని విమర్శించారు. తక్షణం ఆయన సమ్మక్క సారలమ్మ లపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరి ఈ వివాదంపై సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారో తెలియదు. గిరిజనుల సెంటిమెంటును, మనోభావాలను జీయర్ స్వామి తీవ్రంగా గాయపరిచారు.

ఈ విషయం ఆ వీడియో చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. ఒకవేళ కేసీఆర్ ఏవిధంగానూ జీయర్ ను సమర్ధించే పరిస్థితి లేదు. అలా చేస్తే గిరిజనులు వ్యతిరేకమవుతారు. వారి ఓట్లు పోతాయి. కేసీఆర్ జీయర్ నైనా వదులుకుంటారు కానీ  గిరిజనుల ఓట్లు వదులుకోరు. పోలీసులు చర్యలు తీసుకున్నా మాట్లాడలేరు. చినజీయర్ అనవసరంగా కొరివితో తల గోక్కున్నట్లు అయింది.