జనసేనాని పవన్‌కల్యాణ్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పరోక్షంగా చురక అంటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అధికారం నుంచి దింపేందుకు మిత్రపక్షమైన బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వాలని, ఆ తర్వాత తాను రంగంలోకి దిగుతానని జనసేన ఆవిర్భావ సభలో చెప్పిన సంగతి తెలిసిందే. రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నట్టు కూడా చెప్పారు. అంతేకాదు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చీల్చనని పవన్ స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యలపై రకరకాల ప్రచారాలు తెరపైకి వచ్చాయి. రానున్న ఎన్నికల్లో టీడీపీతో పొత్తుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేది మెజార్టీ అభిప్రాయం. మరోవైపు టీడీపీతో కలిసి వెళ్లేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. పవన్‌కల్యాణ్ అడుగుతున్న రోడ్ మ్యాప్‌పై బీజేపీ అధికారిక స్పందన ఏంటో తెలియాల్సి వుంది. కానీ జనసేన ఆవిర్భావ సభలో పవన్ ప్రసంగంపై బీజేపీ మౌనం పాటించడంతో పాటు కేంద్ర ప్రతినిధులతో ఆయన మాట్లాడ్తారని సోము వీర్రాజు చెప్పడం చర్చనీయాంశమైంది.
పవన్ రోడ్ మ్యాప్ అడిగిన నేపథ్యంలో తాజాగా సోము వీర్రాజు వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. వారసత్వ రాజకీయాలకు ప్రధాని మోదీ వ్యతిరేకమని వీర్రాజు స్పష్టం చేశారు. ఏపీలో ప్రత్యామ్నాయంగా బీజేపీ-జనసేన కూటమి అవతరిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో నవరత్నాల పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో జగన్ కూరుకునేలా చేశారని ఆరోపించారు.
ఏపీలో తమకు కనీసం డిపాజిట్లు కూడా రావాలని ఆరోపిస్తున్న మంత్రి వెల్లంపల్లి చర్చకు సిద్ధం కావాలని కోరారు. మంత్రి వెల్లంపల్లితోనే మోదీ నాయకత్వంలోని సర్కార్‌కు ఓట్లు వేయాలని కోరేలా చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు.
వారసత్వ రాజకీయాలకు తాము వ్యతిరేకమని చెప్పడం ద్వారా టీడీపీతో పొత్తు ఆమోదయోగ్యం కాదని పవన్‌కల్యాణ్‌కు సంకేతాలు ఇచ్చినట్టు చర్చ జరుగుతోంది. ఏపీలో రెండు కుటుంబ పార్టీలే పాలన సాగిస్తున్నాయని అనేక సందర్భాల్లో సోము వీర్రాజు విమర్శించిన సంగతి తెలిసిందే.
బీజేపీ రోడ్ మ్యాప్‌ను ఆ పార్టీ నేతలు తమ వ్యాఖ్యల ద్వారా తెలియజేస్తారనే చర్చ జరుగుతోంది. వైసీపీతో పాటు టీడీపీని కూడా టార్గెట్ చేయడం ద్వారా ఆ రెండు పార్టీలకు బీజేపీ సమాన దూరమని ఆ పార్టీ నేతలు చెప్పదలుచుకున్నట్టు కనిపిస్తోంది.