ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం గొడవ కొనసాగుతూనే ఉంది. జంగారెడ్డిగూడెంలో కల్తీసారా తాగి పలువురు మృతి చెందారని, కానీ ప్రభుత్వం తప్పుల్ని దాచి పెడుతోందని, దీనిపై చర్చించాల్సిందేనని అసెంబ్లీలో టీడీపీ డిమాండ్ చేస్తోంది. అయితే టీడీపీ కోరినప్పుడు కాదని, మరో సందర్భంలో చర్చకు రెడీ అని అధికార పార్టీ ప్రకటించింది.
ఈ నేపథ్యంలో టీడీపీ చర్చకు పట్టుబడుతుండడంతో సభా కార్యక్రమాలకు అవాంతరాలు తప్పడం లేదు. దీంతో టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేయడం తప్ప మరో మార్గం స్పీకర్ తమ్మినేని సీతారాంకు కనిపించడం లేదు. ఇవాళ కూడా టీడీపీ సభ్యుల్ని స్పీకర్ సస్పెండ్ చేశారు.
ఇదే సందర్భంలో స్పీకర్ కొత్త రూల్‌ను తెరపైకి తేవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సభా కార్యక్రమాలను టీడీపీ సభ్యులు తమ సెల్‌ఫోన్లలో రికార్డ్ చేస్తుండడాన్ని స్పీకర్ సీరియస్‌గా పరిగణించారు. ఇకపై అసెంబ్లీలోకి సెల్‌ఫోన్లు తీసుకురావద్దని స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. ఇది అధికార, ప్రతిపక్ష సభ్యులందరికీ వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. సభా సంప్రదాయాలను సభ్యులందరూ పాటించాలని ఆయన ఆదేశించారు.
సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్న కారణంగా 11 మంది టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెన్షన్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. సత్యప్రసాద్, చినరాజప్ప, రామ్మోహన్, అశోక్, సాంబశివరావు, గొట్టిపాటి రవి, రామరాజు, గణబాబు, భవానీ, జోగేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణలను సస్పెండ్ చేశారు.
అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష సభ్యులు పంతాలు, పట్టింపులకు పోతుండడంతో సభా సమయం వృథా అవుతోంది. ప్రజాసమస్యలపై చర్చకు బదులు రచ్చకు కేంద్రంగా అసెంబ్లీ సమావేశాలను వాడుకోవడం గమనార్హం.