ఎస్పీ బాలసుబ్రమణ్యం పూర్తిగా కోలుకున్నారట. ఐసీయూ నుంచి జనరల్ వార్డ్ కు డిశ్చార్జ్ అయ్యారట. అంతేకాదు.. హాస్పిటల్ బెడ్ పై నుంచి ఆయన ఓ పాట కూడా పాడారంట. ఈ మేరకు బాలు పాడిన ఓ పాట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది
“విశ్వం నా కోసమే విస్తరించి ఉందని.. పుడమి నా కోసమే పుట్టిందని..” అనే లిరిక్స్ తో సాగే ఈ సోలో గీతం ప్రస్తుతం రకరకాల సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కానీ ఇది హాస్పిటల్ బెడ్ పై నుంచి బాలు పాడిన పాట కాదు. పాట పాడింది బాలూనే అయినప్పటికీ.. ఇది గతంలో ఆయన ఓ కవితకు ఇచ్చిన గీతరూపం. అంతేతప్ప.. హాస్పిటల్ నుంచి పాడింది కాదు.
నిజంగా అంత బాగా పాడే స్థితిలో ఉంటే ఆయన హాస్పిటల్ బెడ్ పై ఎందుకుంటారని ప్రశ్నిస్తున్నారు చాలామంది. మరీ ముఖ్యంగా ఆక్సిజన్ సపోర్ట్ తో ఉన్న బాలు ఇలా పాట పాడడం అసాధ్యం అంటున్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే.. ఓవైపు తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై ఎస్పీ చరణ్ ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇస్తున్నప్పటికీ ఇలాంటి పుకార్లు రావడం.
ఎస్పీ చరణ్ చెబుతున్న ప్రకారం.. ప్రస్తుతం బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఆయనకు ఆక్సిజన్ అందిస్తూనే ఉన్నారు. ఈ వారాంతానికి ఆయన ఆరోగ్యం మరింత మెరుగై, సోమవారం నాటికి లైఫ్ సపోర్ట్ అవసరం లేకుండానే ఆయన చికిత్సకు స్పందించే అవకాశం ఉంది. ప్రస్తుతం చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్ లో ఎస్పీ బాలసుబ్రమణ్యంకు చికిత్స అందిస్తున్నారు.