కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై ఆమె భర్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ పవర్ ఫుల్ పంచ్ విసిరారు. సోషల్ మీడియాలో పరకాల ప్రభాకర్ ట్వీట్ వైరల్ అవుతోంది. కేంద్ర మంత్రి ప్రకటనపై ప్రతిపక్షాలు విమర్శిస్తే దాన్ని రాజకీయ కోణంలో చూస్తారు. అలాంటి వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోరు.
కానీ నిర్మలా సీతారామన్ ఇటీవల చేసిన ఓ ప్రకటనపై దేశ వ్యాప్తంగా బాగా చర్చ నడుస్తోంది. అంతేకాదు, మోడీ సర్కార్‌పై సోషల్ మీడియాలో బాగా సెటైర్లు పేలుతున్నాయి. తాజాగా కేంద్ర మహిళా మంత్రిపై ఏకంగా ఆమె భర్తే వ్యంగ్య విమర్శలు చేయడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. వివాదాస్పదానికి కారణమైన నిర్మలా సీతారామన్ అన్న మాట ఏంటో చూద్దాం.
“దేశ స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు మైనస్ 23 శాతంగా నమోదు కావడం మన చేతుల్లో లేని (యాక్ట్ ఆఫ్ గాడ్) కరోనా వల్లే ఇలా జరిగింది” అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల అన్నారు. నిర్మలా సీతారామన్ అభిప్రాయంపై భర్త పరకాల ప్రభాకర్ ఘాటైన, వ్యంగ్య ధోరణిలో ట్వీట్ చేశారు.
“ప్రభుత్వం సూక్ష్మ, ఆర్థిక సవాళ్లపై తగిన విధంగా స్పందించక పోవడమే అసలైన యాక్ట్ ఆఫ్ గాడ్. కోవిడ్ ఆ తర్వాత వచ్చింది. ఈ పరిస్థితిని గత అక్టోబర్‌లోనే ఊహించాను. కానీ ప్రభుత్వం తిరస్కరించినప్పటికీ , తాజాగా జీడీపీ వృద్ధి రేటు పడిపోవడంతో అసలు వాస్తవం తెలిసొచ్చింది. దయచేసి…ఇప్పటికైనా ఆ దేవుడి కోసం ఏదో ఒకటి చేయండి” అని ఆయన ట్వీట్ చేశారు.
పరకాల ప్రభాకర్ ట్వీట్ ప్రతిపక్షాలకు పెద్ద ఆయుధం ఇచ్చినట్టైంది. భర్త వెటకారంపై కేంద్ర మంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి మరి. మొత్తానికి పరకాల ప్రభాకర్ ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది.