ప్రెస్ మీట్లకు అలవాటు పడ్డ చంద్రబాబు జూమ్ మీట్ లతో నెటిజన్లను విసిగిస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారంటే దానికో అర్థముంది. అయితే ఆయన తాజాగా జూమ్ లో సమీక్షలు, సలహాలు కూడా ఇస్తున్నారు. అధికారం పోయినా.. ఆయన సమీక్షలు చేసే అలవాటు మాత్రం తప్పిపోలేదు. విజయవాడ వచ్చిన చంద్రబాబు ఇక్కడినుంచి కూడా ఓ జూమ్ మీట్ పెట్టారు.
కరోనా విజేతలు, కరోనా బాధిత కుటుంబాలతో ఆయన మాట్లాడారు. వీరిలో పాప్ సింగర్ స్మిత లాంటి సెలబ్రిటీలు కూడా ఉన్నారు. సామాన్యులు, సెలబ్రిటీలు.. దాదాపుగా సగం మంది చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవారినే ఎంచుకోవడం విచిత్రం, విడ్డూరం. వ్యాక్సిన్ వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని చెబుతూనే.. మరోవైపు ధైర్యంగా ఉండాలని వీరందరికీ ఉచిత సలహా పారేశారు చంద్రబాబు. అంత ధైర్యవంతుడు ఇన్నాళ్లూ హైదరాబాద్ లో ఎందుకు దాక్కున్నారో కూడా చెప్పాల్సింది.
కరోనా విజేతల మాటలు ప్రజలకు చేరువైతే వారిలో ధైర్యం పెరిగే అవకాశముంది, మరిన్ని ముందు జాగ్రత్తలూ తీసుకోవచ్చు. ఆ ఉద్దేశంతో చంద్రబాబు జూమ్ మీట్ పెట్టారనుకుంటే పొరపాటే. కరోనా విజేతలు మాట్లాడింది తక్కువ, చంద్రబాబు సోది ఎక్కువ అన్నట్టుంది ఈ వీడియో కాన్ఫరెన్స్. ఇక్కడ కూడా తన రాజకీయ స్వలాభం కోసం పాకులాడారు బాబు.
కరోనాతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, పేదలు ఉపాధిలేక ఇబ్బంది పడుతున్నారని, 10వేల రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వాలని తాను డిమాండ్ చేసినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. కరోనా విషయంలో వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆరోపించారు. రాజకీయ ఆరోపణలు చేయాలనుకుంటే నేరుగా ప్రెస్ మీట్ పెట్టొచ్చు, లేదా జూమ్ లోనే సోలో గా కూర్చోవచ్చు, అదీ కాదనుకుంటే పార్టీ నాయకులతో ప్రతిరోజూ చేసే వ్యవహారమే కొనసాగించొచ్చు.
కరోనా విజేతలు, బాధిత కుటుంబాలతో వీడియో కాన్ఫరెన్స్ అనే పేరుతో ఇక్కడ కూడా కరోనా రాజకీయం ఎందుకో బాబే చెప్పాలి. వీడియో కాన్ఫరెన్స్ లో తమ అభిప్రాయాలు చెబుదామని పాల్గొన్నవారిని కూడా విసిగించారు చంద్రబాబు. అధికారం పోయినా.. ఇంకా సమీక్షలు, సమావేశాలు అంటూ చాదస్తం చూపిస్తున్నారు.