భీమ్లానాయక్ సక్సెస్ ను పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు దర్శకుడు సాగర్ చంద్ర. తన కెరీర్ లో తొలి బిగ్గెస్ట్ హిట్ ఇదేనని, ఓ దర్శకుడిగా ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నానని తెలిపాడు. ఈ సందర్భంగా పవన్ పై తీసిన తొలి షాట్ జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్నాడు.
“పవన్ కల్యాణ్ పై తీసిన ఫస్ట్ షాట్ నాకు బాగా గుర్తు. లాడ్జ్ ఫైట్ కు ముందు వచ్చే ఎంట్రీ సీన్ తీసుకున్నాం. లాడ్జ్ కు పవన్ కల్యాణ్ బుల్లెట్ పై వచ్చే షాట్స్ తీశాం. ఆ తర్వాత టాకీలోకి వెళ్లాం. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ సెట్ లో సన్నివేశాలు తీశాం.”
త్రివిక్రమ్ తో కలిసి వర్క్ చేశానని తెలిపిన సాగర్ చంద్ర.. స్క్రీన్ ప్లే క్రెడిట్ మొత్తం త్రివిక్రమ్ కే ఇచ్చాడు. తను మాత్రం దర్శకుడిగా వర్క్ చేశానంటున్నాడు. సినిమాలో చాలా మార్పులు త్రివిక్రమ్ చేశారని, జైలు సెట్ లో క్రీస్తు ప్రార్థన మార్పు మాత్రం తనదేనని చెప్పుకొచ్చాడు.
“జైలు సీన్ లో రానా భార్యను, తండ్రిని ఒకేసారి పరిచయం చేయాలి. నిమిషంలో అంతా చెప్పాలి. కేవలం ఆ పాత్రల పరిచయం కోసం మాత్రమే ప్రెయిర్ ను వాడుకున్నాను. ఇక నా అవుట్ పుట్ సరిగ్గా రాలేదని, ఆ తర్వాత త్రివిక్రమ్ సెట్స్ లోకి వచ్చారని గాసిప్స్ వచ్చాయి. అందులో నిజం లేదు. మొదటి రోజు నుంచి త్రివిక్రమ్ సెట్స్ లోనే ఉన్నారు. రీషూట్స్ అనేవి చాలా కామన్. ఈ సినిమాకు కూడా జరిగాయి. కానీ నేను తీసిన సీన్లు పూర్తిగా తీసి పక్కనపడేసిన సందర్భాలు మాత్రం లేవు.”
త్రివిక్రమ్ ఎప్పుడూ తన దర్శకత్వంలో కలుగజేసుకోలేదంటున్నాడు సాగర్ చంద్ర. తను పెట్టిన ఫ్రేమ్స్ బాగాలేదని ఎప్పుడూ చెప్పలేదని.. ఒక్కసారి చూస్కో అని మాత్రమే అనేవారని అన్నాడు. పైగా రవి.కె చంద్రన్ రూపంలో చాలా సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఉన్నప్పుడు తనకు ఆ సమస్యలు ఎదురుకాలేదన్నాడు. నటీనటుల డైలాగ్స్ డెలివరీ టైమ్ లో మాత్రం త్రివిక్రమ్ దగ్గరుండి అన్నీ చూసుకున్నాడట.