బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్లకు సీఎంలకు అస్సలు పడదు. ఇప్పటికే చాలా ఉదాహరణలున్నాయి. పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, రీసెంట్ గా తమిళనాడు.. ఇప్పుడీ లిస్ట్ లో తెలంగాణ కూడా చేరిపోయింది. నిన్నమొన్నటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ వ్యవహారం ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల సాక్షిగా రచ్చకెక్కుతోంది. బడ్జెట్ సమావేశాలకు ముందు గవర్నర్ ప్రసంగం అనేది సంప్రదాయం. దాన్ని తుంగలో తొక్కుతున్నారు కేసీఆర్ సారు. కారణం. గవర్నర్ తమిళి సై తో తనకు సయోధ్య లేకపోవడమే.
గత గవర్నర్ నరసింహన్ తో రాసుకుపూసుకు తిరిగిన సీఎం కేసీఆర్, ప్రస్తుత గవర్నర్ తమిళి సై ని పూర్తిగా పట్టించుకోవడంలేదని గతంలోనే చెప్పాం. రిపబ్లిక్ డే వేడుకలకు కేసీఆర్ దూరం కావడం, ఆ తర్వాత సమ్మక్క, సారక్క జాతరకు ప్రొటోకాల్ మర్యాదలు, సెక్యూరిటీ లేకుండా గవర్నర్ ని అవమానించడం, ఇప్పుడు ఏకంగా బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్నే పక్కనపెట్టడం.. దీంతో ఈ ప్రతీకార జ్వాలలు ఓ రేంజ్ కి చేరుకున్నాయనే విషయం అర్థమవుతోంది.
గతంలోనే గొడవలు..
తెలంగాణలో కరోనా సమయంలో ప్రభుత్వ అధికారులను పిలిపించుకుని గవర్నర్ నేరుగా సమీక్షలు నిర్వహించడం కేసీఆర్ కి అస్సలు నచ్చలేదు. ఆ తర్వాత కౌశిక్ రెడ్డికి గిఫ్ట్ గా ఇచ్చిన ఎమ్మెల్సీ సీటు విషయంలో గవర్నర్, ప్రభుత్వ ప్రతిపాదన పక్కనపెట్టి కేసీఆర్ ని మరింత రెచ్చగొట్టారు. ఆ తర్వాత కూడా ఒకటీ అరా సందర్భాల్లో కేసీఆర్, తమిళి సై మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఇప్పుడవి ఫైనల్ స్టేజ్ కి చేరాయి.
అందులోనూ ఇప్పుడు కేసీఆర్ బీజేపీ పేరు చెబితేనే తోక తొక్కిన తాచులా లేస్తున్నారు. తెలంగాణ గవర్నర్ పక్కా బీజేపీ మనిషి. గవర్నర్ గా పదవి దిగిపోయిన తర్వాత కూడా ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో తన సత్తా చూపించాలనుకుంటున్నారు. తమిళనాడులో కమలదళం బలం పెంచాలనుకుంటున్నారు. ఈ దశలో కేసీఆర్ తో ఆమె సయోధ్యతో ఉంటారని ఎవరూ ఊహించరు.
అయితే గవర్నర్ తన అధికారాల మేరకు ప్రభుత్వ నిర్ణయాల్లో కలుగజేసుకోవడం తెలంగాణ సీఎంకు నచ్చడంలేదు. అందుకే తన పరిధి మేరకు తాను కూడా గవర్నర్ ని దూరం పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. బడ్జెట్ సమావేశాల వ్యవహారంలో ఇప్పటికే బీజేపీ విమర్శలు మొదలు పెట్టింది. మహిళా గవర్నర్ ని ఇలా అవమానిస్తారా అంటూ లాజిక్ తీస్తోంది. కానీ ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఆగేలా లేదు. ఇతర రాష్ట్రాల్లో లాగా మరింత పెద్దదయ్యే అవకాశముంది.