మరోసారి విడాకుల వ్యవహారంలోకి పవన్ కల్యాణ్

భీమ్లాతో బీజేపీ, జనసేన మధ్య గ్యాప్ వచ్చిందనేది బహిరంగ రహస్యం. బీజేపీ బద్ధ శత్రువైన టీఆర్ఎస్ నాయకుల్ని ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి పిలిచిన పవన్, కమలదళానికి కాలేలా చేశారు. దీంతో బీజేపీ టీమ్…

భీమ్లాతో బీజేపీ, జనసేన మధ్య గ్యాప్ వచ్చిందనేది బహిరంగ రహస్యం. బీజేపీ బద్ధ శత్రువైన టీఆర్ఎస్ నాయకుల్ని ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి పిలిచిన పవన్, కమలదళానికి కాలేలా చేశారు. దీంతో బీజేపీ టీమ్ “ఆపరేషన్ భీమ్లా”కి పూర్తిగా దూరమైంది. 

గతంలో వకీల్ సాబ్ సినిమా థియేటర్ల ముందు బీజేపీ టీమ్ రెచ్చిపోయింది. అప్పట్లో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు కూడా ఉండటంతో.. వకీల్ సాబ్ అంశాన్ని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలనుకున్నారు. 

ఇప్పుడు భీమ్లా విషయంలో మాత్రం బీజేపీ నేతలు రగిలిపోతున్నారు. బెజవాడలో పవన్, కేసీఆర్ పోస్టర్లు బయటకు రావడంతో ఆ మంట మరింత పెరిగింది. ఇక ఎడబాటు ఖాయమేననుకోవాలి.

ఏపీలో అంత గొడవ జరిగినా..?

ఏపీలో భీమ్లా విడుదల రోజు పెద్ద గొడవే జరిగింది. థియేటర్ల ముందు ఫ్యాన్స్ హంగామా.. సినిమా రిలీజ్ రోజు ఏకంగా ఓ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వడం, మూడో రోజు మరో మంత్రి ప్రెస్ మీట్ పెట్టడం.. ఇదంతా చూస్తుంటే ఏపీలో భీమ్లా వర్సెస్ వైసీపీ అన్నంతగా చర్చ నడిచింది. 

దీనికితోడు టీడీపీ భీమ్లాని భుజానికెత్తుకోవడం.. టీడీపీ నేతలంతా ఆ సినిమాకి సపోర్ట్ గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కౌంటర్లించింది. దాదాపు టీడీపీ సోషల్ మీడియా మొత్తం దీనిపైనే పని చేసింది. దీంతో రాజకీయ రగడ మొదలైంది.

అంతా అనుకున్నట్టే జరిగింది, కానీ ఏపీలో జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ మాత్రం నోరు తెరవలేదు. భీమ్లా నాయక్ సినిమాని తొక్కేస్తున్నారు అనే కామన్ డైలాగ్ కూడా అటునుంచి వినిపించలేదు. కారణం కేటీఆర్ తో ఫంక్షన్, కేసీఆర్ తో పోస్టర్.

ఎడబాటు ఖాయమే..

కలసి పనిచేస్తాం, కలసి ఉద్యమాలు చేస్తామంటూ కబుర్లు చెప్పారే కానీ.. ఏనాడూ కలసి ఏ పనీ చేయలేదు జనసేన-బీజేపీ. ఉప ఎన్నికల్లో బీజేపీ, పవన్ కల్యాణ్ ని ప్రచారానికి వాడుకుంది. స్థానిక ఎన్నికల్లో పొత్తులతో జనసేన త్యాగాలు చేసింది కానీ, బీజేపీ ఆ మేర సీట్లు సాధించలేదు. ఒకరకంగా జనసేన పర్ఫామెన్సే బాగుంది. బీజేపీతో పొత్తు లేకపోయి ఉంటే ఇంకా బాగుండేదని స్థానిక నాయకుల అభిప్రాయం.

వెరసి అన్నీ ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. సో.. బీజేపీ, జనసేన విడిపోవడం ఖాయమనే చెప్పాలి. అయితే పవన్ కి ఇది బాగా అలవాటైన ప్రక్రియే. గతంలో బీజేపీకి, టీడీపీకి చెరొకసారి విడాకులిచ్చారు. ఆ తర్వాత వామపక్షాలు, బీఎస్పీతో కూడా తెగతెంపులు చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా బీజేపీతో రెండోసారి విడాకులకు రెడీ అయ్యారు.