ఆ ఇద్దరినీ తప్ప.. ఊరందర్నీ కలుస్తున్న కేసీఆర్!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్రంలోని బీజేపీ సర్కారును కూల్చాలని కంకణం కట్టుకున్నారు. 17 ఎంపీ నియోజకవర్గాలు మాత్రమే ఉండే ఒక చిన్న రాష్ట్రానికి పరిమితమైన ప్రాంతీయ పార్టీ సారధిగా.. మోడీ అంతుచూడాలని కలగనడం ఎంత…

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్రంలోని బీజేపీ సర్కారును కూల్చాలని కంకణం కట్టుకున్నారు. 17 ఎంపీ నియోజకవర్గాలు మాత్రమే ఉండే ఒక చిన్న రాష్ట్రానికి పరిమితమైన ప్రాంతీయ పార్టీ సారధిగా.. మోడీ అంతుచూడాలని కలగనడం ఎంత కష్టమో ఆయనకు చాలా బాగా తెలుసు. అందుకే.. మోడీని వ్యతిరేకించే వారందరినీ కలిపి జట్టుగా తయారు చేయాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. 

ఇలా చేయడానికి –  మోడీ వ్యతిరేకించే వారే కానక్కర్లేదు. మోడీ జట్టు ఎన్డీయేలో లేని వారందరినీ కూడా కలిసి.. వారిని ఒక గొడుగు కిందికి చేర్చే ప్రయత్నంలో కేసీఆర్ చాలా ముమ్మరంగా శ్రమిస్తున్నారు. అదే ప్రయత్నం మీద ప్రస్తుతం ఢిల్లీ టూర్ కూడా నిర్వహిస్తున్నారు. 

ఇంతవరకు అంతా బాగానే ఉంది. మోడీ నడుపుతున్న ఎన్డీయే జట్టులో లేకపోయినప్పటికీ.. ఆయన ‘ఆ ఇద్దరిని’ మాత్రం పట్టించుకోకపోవడం మాత్రం చర్చనీయాంశమే. ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లోని వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల అధినేతలను కేసీఆర్ పట్టించుకోవడం లేదు. 

తన మూడో కూటమి ప్రయత్నాలు ప్రారంభించిన తొలినాటినుంచి కూడా ఆయన వీరిని– ఆ జాబితాలో చేర్చుకున్నట్టుగా కనిపించడం లేదు. జగన్ ఎన్డీయేకు సంబంధం లేని పార్టీకి నాయకుడు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి పార్లమెంటులో అవసరాన్నిబట్టి అంశాల వారీ మద్దతు ఇస్తున్న వారే తప్ప.. వారికి భజన చేస్తున్న నాయకుడు కాదు. 

నిజానికి కేంద్రం వైఖరి వలన రాష్ట్రానికి నష్టం జరుగుతున్నదని నమ్ముతున్న నాయకుడు కూడా. బయటకు చెప్పకపోయినా.. కేంద్రం ఏపీ పట్ల చూపిస్తున్న సవతి ప్రేమతో విసిగిపోయి ఉన్న నాయకుడు కూడా. అయినా సరే.. జగన్ ను కేసీఆర్ కనీసం తన మూడోకూటమి ప్రయత్నాలతో సంప్రదించను కూడా లేదు. 

జగన్మోహన్ రెడ్డి.. బీజేపీతో సఖ్యతను కోరుకుంటున్నాడని ఒక ప్రచారం వినిపిస్తుంటుంది. అందువల్ల కేసీఆర్ జగన్ ను సంప్రదించలేదా? జగన్ తో ఎంతో సాన్నిహిత్యం ఉన్నప్పటికీ కేసీఆర్ ఈ విషయంలో కనీసం సంప్రదించకపోవడంలో ఇలాంటి అభిప్రాయాలు కలుగుతున్నాయి. 

చంద్రబాబును కేసీఆర్ పట్టించుకోకపోవడంలో వింత లేదు. ఎందుకంటే.. ఏపీలో తెలుగుదేశం మనుగడ కాపాడుకోవాలంటే.. బీజేపీ- జనసేలతో కలిసి రాబోయే ఎన్నికల్లో పోటీచేయాలని చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నారు. మోడీ నిర్ణయాలపై పల్లెత్తు మాట అనకుండా జాగ్రత్త పడుతున్నారు. తన వన్‌సైడ్ లవ్ గురించి చాటుకుంటున్నారు. 

కాబట్టి.. కేసీఆర్ చంద్రబాబును పక్కన పెట్టినా ఓకే అనుకోవచ్చు గానీ.. పొరుగురాష్ట్రంలో కనీసం కూటమి ఎటెంప్ట్ చేయకుండానే.. దేశమంతా తిరిగి అన్ని పార్టీల వారినీ కలిసి కూడగట్టాలని అనుకోవడం చిత్రంగా ఉంది.