2023 సంక్రాంతి మీద రుమాళ్లు వేసే పని మొదలయిపోయింది. ఇప్పటికే పైకి చెప్పకపోయినా అదే టార్గెట్ గా రామ్ చరణ్-శంకర్ సినిమా రెడీ అవుతోంది. చకచకా షూటింగ్ జరుగుతోంది. ఆ సినిమాను ఎలాగైనా 2023 సంక్రాంతి బరిలోకి దింపాలని నిర్మాత దిల్ రాజు పట్టుదలగా వున్నారు. ఆ పాన్ ఇండియా సినిమాకు ఇప్పుడు పోటీగా మరో సినిమా డేట్ వచ్చేసింది.
ప్రభాస్ బాలీవుడ్ రామాయణం ‘ఆదిపురుష్’ డేట్ అనౌన్స్ చేసారు. 2023 సంక్రాంతికే ఆ సినిమా కూడా. సరే, సంక్రాంతి అంటే రెండు సినిమాలు ఎలాగూ విడుదల కు అవకాశం వుంటుంది. అందువల్ల ఈ రెండింటికీ సమస్య లేదు. కాస్త గ్యాప్ వుంచుకుంటే సరిపోతుంది.
కానీ త్రివిక్రమ్-మహేష్ సినిమా పరిస్థితి ఏమిటి? ఆ సినిమా ఇప్పటికి ఇంకా ప్రారంభం కాలేదు. దసరా బరిలోకి దిగాలి అంటే కాస్త కష్టమే. త్రివిక్రమ్ కు, మహేష్ కు కలసి వచ్చిన సంక్రాంతి అయితే బెటర్. కానీ ఇప్పుడు ఇక ఆ అవకాశం లేనట్లే.
మూడు భారీ సినిమాలు సంక్రాంతికి అంటే కష్టం. పోనీ ముందుగా డిసెంబర్ ను ఎంచుకుందాం అంటే పుష్ప 2 ఆ డేట్ మీద కన్నేసి వుంది.
సర్కారువారి పాట సినిమా పూర్తి కావాలి. అప్పుడు త్రివిక్రమ్-మహేష్ సినిమా మొదలవ్వాలి. కనీసం ఆరు నెలలు టైమ్ తీసుకుంటుంది. డే అండ్ నైట్ కొడితే దసరాకు అవకాశం వుంటుందేమో? మొత్తం మీద 2022..2023..రెండు సంక్రాంతి లు మిస్.