టీమిండియా క్రికెట్ జట్టుకు నాయకత్వం వహిస్తూ, నాన్ ప్లేయింగ్ కెప్టెన్ అంటూ విమర్శలను ఎదుర్కొన్న వాళ్లు పలువురున్నారు. దిగ్గజ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈ విషయంలో విమర్శలపాలయ్యాడు. కెప్టెన్ గా కొత్త ప్రమాణాలను సెట్ చేసినప్పటికీ, ఒక దశలో గంగూలీ బ్యాటర్ గా ఫెయిల్ అవుతూ, నాన్ ప్లేయింగ్ కెప్టెన్ అంటూ విమర్శలను ఎదుర్కొన్నాడు. నాన్ ప్లేయింగ్ కెప్టెన్ అనే మాటే క్రికెట్ ది కాదు. టెన్నిస్ కు సంబంధించిన ఈ టెర్మ్ ను ఫామ్ లోని కెప్టెన్ పై విమర్శలను చేయడానికి వాడుకుంటూ వచ్చారు విశ్లేషకులు.
ఇక ధోనీ కూడా ఒక దశలో బ్యాటర్ గా అట్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చాడు. కెప్టెన్ గా దక్కుతున్న విజయాలు ధోనీ బ్యాటింగ్ పై విమర్శలను కవర్ చేశాయి. ఇక ఈ మధ్యనే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కొహ్లీ బ్యాటింగ్ పై వచ్చిన విమర్శలు అన్నీ ఇన్నా కావు. వాటికి జడిసే కొహ్లీ తప్పుకున్నాడు. కొద్దో గొప్పో కొనసాగే ఆసక్తి ఉన్నా, బీసీసీఐ అతడిని తప్పించింది.
ఇక ఇప్పుడు రోహిత్ శర్మ వంతు వచ్చినట్టుగా ఉంది. టీమిండియాకు పూర్తి స్థాయి కెప్టెన్ గా రోహిత్ కు పగ్గాలైతే దక్కాయి. వరసగా రెండు టీ20 సీరిస్ లను టీమిండియా స్వీప్ చేసింది. ఇంత వరకూ బాగానే ఉంది కానీ, ఈ రెండు సీరిస్ లలో రోహిత్ బ్యాటింగ్ మాత్రం చెప్పుకోవడానికి ఏమీ లేనట్టుగా ఉంది.
అటు శ్రీలంక, ఇటు వెస్టిండీస్.. రెండూ ఇప్పుడు అంతర్జాతీయంగా అంత గొప్ప జట్లు కావు. ఇలాంటి జట్లపై స్వదేశంలో టీ20 సీరిస్ లు అంటే రెచ్చిపోవడానికి ఇంతకు మించిన అవకాశం దక్కదు. అయితే రోహిత్ మాత్రం ఆరు మ్యాచ్ లలో కూడా చెప్పుకోదగిన ఆటను కనబరచలేదు.
అయితే విజయాలు అయితే దక్కాయి కాబట్టి.. రోహిత్ ఎలా ఆడాడనేది ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. కెప్టెన్సీ కోటాలో రోహిత్ ఈ విమర్శల నుంచి తప్పించుకుంటున్నాడు. మరి ఇలా ఎన్నాళ్లు అనేది కీలకమైన ప్రశ్న.
రోహిత్ ఒక రకంగా హనీమూన్ పీరియడ్ లో ఉన్నాడు. విజయాలు కూడా దక్కాయి కాబట్టి ప్రస్తుతానికి సేఫే. గత కొన్నేళ్లుగా రోహిత్ బ్యాటింగ్ చాలా వరకూ మెరుగయ్యింది. టెస్టులకు పనికిరాడనే ముద్ర పోయి, టెస్టు కెప్టెన్సీ వరకూ ఎదిగాడు. రోహిత్ కు కెప్టెన్సీ ఇవ్వడంపై కొన్ని విమర్శలు లేకపోనూ లేదు. ఇలాంటి నేపథ్యంలో.. రోహిత్ ఫామ్ లోకి రాకపోతే విమర్శలు తీవ్రతరం కావడంలో పెద్ద ఆశ్చర్యం ఉండదు.