రాజకీయాల్లోంచి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక రెండో సినిమా బయటకు వచ్చింది హీరో పవన్ కళ్యాణ్ నుంచి. రెండు సినిమాలు చేయడానికి దాదాపు రెండేళ్లు పట్టింది. 2024 ఎన్నికలకు ఇంకో రెండేళ్ల సమయం వుంది. పూర్తిగా రాజకీయాల మీద దృష్టి పెట్టాలి.
భాజపా అండతో అన్ని చోట్లా పోటీ చేయాలి అనుకుంటే కనీసం ఆరేడు నెలలు ముందు నుంచి అయినా కసరత్తు మొదలుపెట్టాలి. ఆంధ్ర అంతా తిరగాలి. ఇలా చాలా వుంటుంది వ్యవహారం. అంటే పవన్ కు మిగిలిన సమయం మహా అయితే ఏడాదిన్నర.
ఈ ఏడాదిన్నరలో ఆయన చేయగలిగే సినిమాలు ఎన్ని? చేయాల్సిన సినిమాలు ఎన్ని?
క్రిష్ డైరక్షన్ లో హరి హర వీరమల్లు
హరీష్ శంకర్ డైరక్షన్ లో భవదీయుడు భగత్ సింగ్
పీపుల్స్ మీడియా..సముద్రఖని..సాయిథరమ్ తేజ్ కాంబినేషన్ లో సినిమా.
సితార సంస్థ..వైష్ణవ్ తేజ్..కాంబినేషన్ లో ఓ సినిమా.
సురేంద్ర రెడ్డి డైరక్షన్ లో రామ్ తాళ్లూరికి ఓ సినిమా.
లేటెస్ట్ గా వినిపిస్తున్న డివివి దానయ్యకు ఓ సినిమా.
వీలయితే కుదిరితే బోయపాటి డైరక్షన్ లో ఓ సినిమా.
అంటే ఆరేడు సినిమాలు. పవన్ తో సినిమా చేయడం అంత సులువు కాదు. ఒకటి రెండు సమస్యలు కాదు. ఆయన లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ కొట్టిన షూటింగ్ లు లెక్క పెట్టకుంటే నిర్మాతకు నీరసం వస్తుంది. త్రివిక్రమ్ వున్నారు కాబట్టి సితార సినిమా ఏదో కిందా మీదా పడి, ఎన్ని క్యాన్సిళ్లు కొట్టినా తట్టుకుని, మళ్లీ మళ్లీ ఆర్టిస్ట్ ల కాల్ షీట్లు తెచ్చుకుని పూర్తి చేసారు.
ఎఎమ్ రత్నం-క్రిష్ సినిమాకు కేవలం పవన్ తో మాత్రమే సమస్య కాదు. ఫైనాన్షియల్ సమస్యలు కూడా వున్నాయని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. అందువల్లే దాన్ని పక్కన పెట్టారని, ఈ నెలలోనో, వచ్చే నెల ఆరంభంలోనో పీపుల్స్ మీడియా-సముద్రఖని-సాయ ధరమ్ తేజ్ సినిమా స్టార్ట్ చేస్తారని బోగట్టా.
ఆ సినిమా చేయాలి..క్రిష్ సినిమా సంగతి తేలాలి. అప్పుడు హరీష్ శంకర్ సినిమా. మహా అయితే ఎన్నికలు వచ్చేలోగా ఇవి మాత్రమే పూర్తి అయ్యే అవకాశం వుంది. మరి మిగిలిన సినిమాలు అన్నీ ఎప్పుడు చేస్తారో చూడాలి. ఇప్పటికే పవన్ లుక్ ను షేపప్ చేయడానికి సిజికి గట్టిగా ఖర్చు చేయాల్సి వస్తోంది. భీమ్లా నాయక్ కు ఈ విషయంలో గట్టిగా ఖర్చు చేసారు.
మళ్లీ సినిమాలు ఆపి, రాజకీయాల్లోకి వెళ్లి, కొన్నాళ్ల తరువాత వచ్చి సినిమాలు ఆరంభిస్తే, ఆయన ఫిజిక్ ఎలా వుంటుందో అప్పుడు కానీ తెలియదు. ఇవన్నీ ఇలా వుంచితే భీమ్లా సినిమాకు రెమ్యూనిరేషన్లు అన్నీ కలిపి 150 వరకు ఖర్చయింది. ఎంత మార్కెట్ చేసినా, కిందా మీదా పడినా మిగిలింది చాలా తక్కువే. రాను రాను ఖర్చులు పెరుగుతాయి కానీ తగ్గవు. అలా అని ఇంతకన్నా మార్కెట్ చేయడం అసాధ్యం.
అందువల్ల చూస్తుంటే పవన్ తో సినిమాలు ప్లాన్ చేసిన వారందరీకి కాస్త కష్టంగానే వుండేలా వుంది వ్యవహారం.