వివేకా హత్య కేసులో తరచూ వినిపిస్తున్న పేరు ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణను గత ఏడాది ఆగస్టు 12న ఈయన ఎదుర్కొన్నారు. కడప ఎంపీ అవినాశ్ రెడ్డి, ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి, డి.శివశంకర్ రెడ్డిలు తనకు రెండు కళ్ల లాంటివారని, సీఎం జగన్ తనతో అన్నట్టు నాటి డీజీపీ గౌతమ్ సవాంగ్ …తమతో చెప్పిన విషయాన్ని డాక్టర్ సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డిలు సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. ఈ ముగ్గురిలో ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఇంతకూ ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి ఎవరనే చర్చ తెరపైకి వచ్చింది. జగన్ సతీమణి వైఎస్ భారతికి ఈసీ సురేంద్రనాథరెడ్డి స్వయాన పెదనాన్న కుమారుడు. పులివెందుల నియోజకవర్గంలోని గొల్లలగూడూరు ఈసీ సురేంద్ర స్వస్థలం. ఈయన తండ్రి పేరు ఈసీ పెద్దగంగిరెడ్డి. భారతి తండ్రి పేరు ఈసీ చిన్నగంగిరెడ్డి. ఈసీ చిన్నగంగిరెడ్డి వైద్యుడిగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మామగా ప్రసిద్ధుడు.
ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి కడపలో యోగివేమన విశ్వవిద్యాలయంలో బయోటెక్నాలజీలో విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగంలో చేరారు. అనంతరం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే, సురేంద్రనాథ్‌రెడ్డిని ప్రొఫెసర్‌గా ప్రమోట్ చేస్తూ స్పెషల్ జీవో విడుదల చేశారు. అనంతరం కడపలో ఏర్పాటు చేసిన ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయానికి డిప్యుటేషన్‌పై రిజిస్ట్రార్‌గా పంపారు. ప్రస్తుతం అక్కడే ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు.
సురేంద్రనాథ్‌రెడ్డి భార్య సుప్రియ కొంత కాలం కడప సాక్షి ఎడిషన్ మేనేజర్‌గా పని చేశారు. రెండేళ్ల క్రితం ఆమె ఆ బాధ్యతల నుంచి కూడా స్వచ్ఛందంగా తప్పుకున్నారు. వివేకా హత్య సమయంలో కడప ఎంపీ అవినాష్‌రెడ్డితో పాటు ఉండడం, సంఘటనా స్థలానికి వెళ్లడం, ఆయన భార్య సాక్షి పత్రికలో కీలక బాధ్యతల్లో ఉన్న నేపథ్యంలో సీబీఐ విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది. సురేంద్రనాథ్‌రెడ్డి గురించి పెద్ద ఎత్తున మీడియాలో వార్తలు వస్తుండడంతో అందరూ ఆయన గురించి ఆరా తీయడం గమనార్హం.