పచ్చ మీడియా కథనాల పరంపర క్లయిమాక్స్‌కు చేరువ అవుతోంది. వాంగ్మూలాల లీకేజీ పేరిట.. సీబీఐ దర్యాప్తు చేసిన సమస్త డాక్యుమెంట్లు తమ వద్దనే ఉన్నట్టుగా వరుస కథనాలు అందించిన పచ్చ మీడియా వ్యవహారం ఇప్పుడు ముదిరి పాకాన పడింది. ఇన్నాళ్లూ అవినాష్ రెడ్డిని నిందితుడిగా ప్రొజెక్టు చేయడానికి తాపత్రయపడిన ఈ కథనాలు తాజాగా తమ దిశ మార్చుకున్నాయి.
ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీదికే తమ అస్త్రాలను ఎక్కు పెట్టాయి. హత్య వెనుక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉండవచ్చుననే వాంగ్మూలాలను తాజాగా ప్రచురించాయి. ఈ పచ్చ కథనాల అండతో చంద్రబాబునాయుడు కూడా రెచ్చిపోయి.. జగన్ మీద ఆరోపణలకు దిగడం విశేషం. తన మీద కేసు పెట్టినా కూడా.. ఇప్పుడున్న 11 కు తోడు, 12వ సీబీఐ కేసు అవుతుందని వెటకారంగా మాట్లాడారని ఆయన అనడం, వాంగ్మూలాల్లోని వ్యాఖ్యల ఆధారంగా ఆ ప్రకటన చేయడం.. ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది.
మన పచ్చ పత్రికలు ఒక వ్యాసం రూపంలో తాము చెప్పదలచుకున్న విషయాన్ని అందిస్తాయి. కానీ.. వాస్తవంలో సీబీఐ అధికారులు సాక్షుల నుంచి, అనుమానితుల నుంచి, నిందితుల నుంచి సేకరించే వాంగ్మూలాలు అంత సంక్షిప్తంగా ఉండవు. చాలా సుదీర్ఘంగానే ఉంటాయి. సుదీర్ఘంగా ఉండే వాంగ్మూలాల్లో.. తమకు నచ్చిన, తాము ఏ విషయాన్ని అయితే బాగా హైలైట్ చేయాలని అనుకుంటున్నామో.. ఆ విషయం మాత్రమే తీసుకుని.. ఈ పచ్చ పత్రికలు కథనాలను అందించాయి.
వాంగ్మూలాల్లో ఉండే పూర్తి వివరాలను అందించే ఉద్దేశం వారికి లేదు. అందుకు పత్రికలో స్థలం లేదు అని నెపం పెడతారు. కానీ.. ఎవరి మీద బురద చల్లదలచుకున్నారో వారి మీద ఉండే ఆరోపణల్ని మాత్రం గుదిగుచ్చి అందిచేస్తారు.
ఇలాంటి అనైతిక చవకబారు పద్ధతుల్లో వాంగ్మూలాల లీకేజీ పేరిట ఒక సుదీర్ఘమైన ప్రచారం కొన్ని వారాలుగా.. డెయిలీ సీరియల్ తరహాలో సాగుతూ వచ్చింది. ప్రతి కథనంలోనూ ఎంపీ అవినాష్ రెడ్డి వైపే వేలెత్తి చూపడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అవినాష్ రెడ్డి మీద అనుమానాలు పెరిగేలా అన్ని కథనాలను వండి వార్చారు.
ఈకేసు కోర్టు ఎదుట విచారణ పూర్తయిన తర్వాత.. అవినాష్ రెడ్డి హత్యకు అసలు సూత్రధారి అవినాష్ రెడ్డి అని తేలవచ్చు, తేలకపోవచ్చు, ఆయనకు శిక్ష పడకపోవచ్చు కూడా! కానీ.. ఈలోగా.. వాంగ్మూలాల లీకేజీ పేరుతో.. అవినాష్ రెడ్డి కి ప్రజల్లో ఉండే ఆదరణను సమూలంగా నాశనం చేసేయడం ఈ పత్రికల లక్ష్యం. ఈ కథనాల ద్వారా ప్రజల మెదళ్లలోకి విషప్రచారం చొప్పించేస్తే.. తర్వాత కోర్టు తీర్పు ఏమిటన్నది ప్రజలు గమనించేలోగానే వారిలో ద్వేషం ఏర్పడి పోయి ఉంటుంది. అలాంటి లక్ష్యంతోనే ఈ కథనాలు వండినట్టు అర్థమవుతుంది.
తాజాగా ఈ కథనాల డెయిలీ సీరియల్ డైరెక్షన్ మారింది. ఇప్పుడు జగన్ నే నిందితుడిగా చూపిస్తున్నారు. తాజాగా.. వివేకా కూతురు సునీత, అల్లుడు రాజశేఖర రెడ్డి వాంగ్మూలాలు అంటూ.. హత్య వెనుక జగన్ ఉన్నారని పేర్కొంటున్న కథనాలను అందించారు. ఈ కథనాల వెనుక.. పచ్చ మీడియా లక్ష్యం స్పష్టం. జగన్ పాత్ర ఏమిటనేది.. కోర్టు ఎదుట చర్చకు వచ్చే అవకాశం కూడా లేదు.
కానీ.. ఈ కథనాల ద్వారా.. జగన్ ను కూడా సీబీఐ విచారించాలని డిమాండ్ చేయగల అవకాశం చంద్రబాబుకు అందించాలి. సొంత బాబాయిని చంపించిన వ్యక్తి జగన్ అనే దురభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించాలి. ఈ లక్ష్యాలను చేరుకుంటే చాలు అన్నట్టుగానే పచ్చమీడియా ప్రచారాలు, ప్రచురణలు సాగుతున్నాయి.