యాక్సిడెంట్ తర్వాత మరోసారి బైక్ లేదా కారు తీయడానికి ఎవరైనా భయపడతారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. రోడ్డు ప్రమాదానికి గురైన సాయితేజ్ కు కూడా ఈ భయం ఉంది. కావాలంటే ఆయన కారు డ్రైవర్ ను పెట్టుకోవచ్చు. కానీ ఏదైనా సీన్ లో బైక్ నడపాల్సి వస్తే పరిస్థితి ఏంటి?
సరిగ్గా అలాంటి పరిస్థితే సాయితేజ్ కు ఎదురైంది. విరూపాక్ష సినిమాలో ఓ సీన్ ఉంది. సన్నటి రోడ్డుపై బైక్ తో దూసుకుపోయే సీన్ అది. అప్పుడే పెద్ద యాక్సిడెంట్ నుంచి కోలుకొని, సెట్స్ పైకి వచ్చిన సాయిధరమ్ తేజ్ ఈ సీన్ చేయగలడా లేదా అనే భయం అందర్లో ఉంది.
అయితే సాయితేజ్ మాత్రం కాస్త ధైర్యం తెచ్చుకున్నాడు. సీన్ పండడం కోసం కాస్త స్పీడ్ గానే బైక్ ను నడిపాడు. అలా యాక్సిడెంట్ తర్వాత తొలిసారి బైక్ నడిపాడు. ఫస్ట్ షాట్ లోనే ఆ రిస్కీ సీన్ ఓకే అయింది. ఆ ఎమోషనల్ మూమెంట్ పై యూనిట్ స్పందించింది. దర్శకుడు కార్తీక్ దండు, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్ ఆ ఎమోషనల్ మూమెంట్ ను షేర్ చేసుకున్నారు.
ఆ రిస్కీ షాట్ కు సంబంధించిన మేకింగ్ విజువల్స్ ను విరూపాక్ష యూనిట్ విడుదల చేసింది. 'భయాన్ని అధిగమిస్తేనే అసలైన జీవితం' అనే క్యాప్షన్ ను కూడా యాడ్ చేసింది.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి ఏప్రిల్ 21న విడుదలకానుంది విరూపాక్ష సినిమా. ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందించాడు.