స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి ఫస్ట్ షాక్ తగిలింది. అనంతపురం జిల్లాలో టీడీపీ నాటకీయ రీతిలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి చివరి నిమిషంలో నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. నామినేషన్ వేయడమే గొప్ప విజయంగా మారిన పరిస్థితుల్లో… స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఎన్నిక జరగుతుందని ఆ పార్టీ ఆశించింది. అయితే ప్రతిపక్షం ఒకటి తలిస్తే, అధికారులు మరో రకంగా వారికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు.
టీడీపీ అభ్యర్థి వేలూరు రంగయ్య నామినేషన్ చెల్లదని ఎన్నికల అధికారులు ప్రకటించడం గమనార్హం. వైసీపీ తరపున వాల్మీకి మంగమ్మ నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. చివరి రోజు, ఆఖరి నిమిషంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు వేలూరు రంగయ్య నామినేషన్ వేశారు.
నిజానికి నామినేషన్ వేయకుండా అడ్డుకునేందుకు వైసీపీ శత విధాలా ప్రయత్నించిందనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో నామినేషన్ పత్రంలో సరైన డాక్యుమెంట్స్ లేవని, అలాగే ఫోర్జరీ సంతకం చేశారనే అభియోగాలపై రంగయ్య నామినేషన్‌ను తిరస్కరించినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. దీంతో వైసీపీ అభ్యర్థి మంగమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు అవకాశాలు మెరుగుపడ్డాయి.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ కనీసం నామినేషన్‌ను కూడా పరిగణలోకి తీసుకోకుండా దుర్మార్గానికి తెగబడిందని టీడీపీ ఆరోపిస్తోంది. దీనిపై రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.