ప్రసిద్ధ ఆధ్యాత్మిక నగరం తిరుపతి 893వ పుట్టిన రోజు శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. జగద్గురువు రామానుజాచార్యులు 1130, ఫిబ్రవరి 24న గోవిందరాజస్వామి విగ్రహ ప్రతిష్ట, అలాగే మాడవీధులకు శంకుస్థాపన చేసినట్టు టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి చేయించిన పరిశోధనల్లో బయట పడింది. ఆ తర్వాత కాలంలో అదే తిరుపతిగా అవతరించినట్టు చెబుతున్నారు.
ఒక నగరం పుట్టిన రోజు జరుపుకోవడం ప్రపంచ చరిత్రలో ఇదే ప్రప్రథమని భూమన చెబుతున్నారు. గత ఏడాది మొదటిసారిగా 892వ పుట్టిన రోజును జరిపి. ఈ ఏడాది కూడా ఆ సత్సంప్రదాయాన్ని కొనసాగించారు. ఈ దఫా వేడుకలో టీటీడీ, తిరుపతి మున్సి పల్ కార్పొరేషన్ భాగస్వాములయ్యాయి.
ఈ సందర్భంగా ఇవాళ గోవిందరాజస్వామి ఆలయంలో భూమన నేతృత్వంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధుల్లో చెక్కభజన, కోలాటం తదితర జానపద, సంప్రదాయ నృత్య కళాకారులు ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కళారూపాలు నగర వాసులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
మహిళలు పసుపు నీళ్లు చల్లుతూ ప్రదర్శనకారులకు ఘనంగా స్వాగతం పలికారు. గోవింద నామస్మరణలతో నగరం భక్తి తన్మయత్వంలో తడిసి ముద్దయ్యింది. పుట్టిన రోజు వేడుక ముగింపు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇక మీదట తిరుపతి పుట్టిన రోజును ప్రతి ఏడాది జరుపుకోవడం ఆనవాయితీగా రావాలని ఆకాంక్షించారు. కలియుగ దైవం కొలువుదీరిన తిరుమల పాదాల చెంత తిరుపతిలో జీవించే అవకాశం రావడం ఎంతో అదృష్టమన్నారు.