సాయి కొర్రపాటి ‘నేనున్నాను’

మంచి సినిమాల నిర్మాత సాయి కొర్రపాటి గురించి ఇండస్ట్రీ జనాలకే తెలియని మంచి విషయం ఒకటి వుంది. ఆయన అసలు సిసలైన ధార్మిక ప్రచారవేత్త అని అనుకోవచ్చు. మంచి మంచి ధార్మిక గ్రంధాలు ఫ్రచురించి,…

మంచి సినిమాల నిర్మాత సాయి కొర్రపాటి గురించి ఇండస్ట్రీ జనాలకే తెలియని మంచి విషయం ఒకటి వుంది. ఆయన అసలు సిసలైన ధార్మిక ప్రచారవేత్త అని అనుకోవచ్చు. మంచి మంచి ధార్మిక గ్రంధాలు ఫ్రచురించి, వాటిని ఆలయాలకు, భక్తులకు అందిస్తుంటారు. ఇందుకోసం ఆయన లక్షలు కాదు, కోట్లు ఖర్చు చేసారు, చేస్తున్నారు అంటే అది అతిశయోక్తి ఏమాత్రం కాదు. ఆయన ఇప్పటి వరకు ప్రచురించిన పుస్తకాలు ఒక్కసారి చూస్తే, అవును, నిజమే కదా? అని ఎవరైనా అనాల్సిందే.

పురాణపండ శ్రీనివాస్ అనే సంకలన కర్త సహకారంతో అనేకానేక పుస్తకాలు గత అయిదేళ్లుగా సాయి కొర్రపాటి అందిస్తున్నారు. వివిధ స్తోత్రాలు, మంత్రాలు, దండకాలు, అష్టకాలు, ఇలా ఒకటేమిటి, భక్తులు నిత్యం పారాయణం చేసుకోవానికి వీలుగా ఆ పుస్తకాలు ప్రచురిస్తున్నారు. పైగా వీటిని క్వాలిటీ పేపర్ తో, పెద్దవాళ్లు చదువుకోవడానికి వీలయిన పెద్ద అక్షరాలతో, మాంచి చిత్రాలతో కలిపి, ఈ పుస్తకం ఎంత ఖరీదు వుంటుందో? అని అనిపించేలా పుస్తకాలు ప్రచురించి మరీ అందిస్తున్నారు.

ప్రధాని ప్రణబ్ ముఖర్జీ, ముఖ్యమంత్రి కేసిఆర్, అనేక మఠాధిపతులు, పీఠాధిపతులు ఈ పుస్తకాలు చూసి, సాయి కొర్రపాటి కృషి చూసి అభినందించారు. లేటెస్ట్ గా హనుమంతుడి మీద సాయి కొర్రపాటి 'నేనున్నాను' అనే పుస్తకం తయారు చేసారు. ఈ పుసక్తం కూడా మహా మహుల అభినందనలు అందుకుంది. వారపత్రిక సైజులో, వందల పేజీలతో, ఖరీదైన కాగితంతో, అద్భుతమైన వర్ణ చిత్రాలతో ఈ పుస్తకం అలరిస్తోంది. హనుమంతుడి స్తోత్రాలు, ఇంకా అనేక అంశాలతో పాట, రామాయణాన్ని సంక్షిప్తంగా ఇందులో పొందు పరిచారు. 

వాణిజ్యపరమైన సినిమా రంగంలో వుంటూ, ధార్మిక సేవ చేస్తున్న సాయి కొర్రపాటి కృషి అభినందనీయం.