cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: నిను వీడని నీడను నేనే

సమీక్ష: నిను వీడని నీడను నేనే
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌: వెంకటాద్రి టాకీస్‌, వి స్టూడియోస్‌, విస్టా డ్రీమ్‌ మర్చంట్స్‌
తారాగణం: సందీప్‌ కిషన్‌, ఆన్యా సింగ్‌, వెన్నెల కిషోర్‌, మురళి శర్మ, పూర్ణిమ భాగ్యరాజ్‌, పోసాని కృష్ణమురళి, ప్రగతి తదితరులు
సంగీతం: తమన్‌.ఎస్‌
కూర్పు: ప్రవీణ్‌ కె.ఎల్‌.
ఛాయాగ్రహణం: పి.కె. వర్మ
నిర్మాతలు: సందీప్‌ కిషన్‌, దయా పన్నెం, విజి సుబ్రమణియన్‌
రచన, దర్శకత్వం: కార్తీక్‌ రాజు
విడుదల తేదీ: జులై 12, 2019

ఒక నటుడు కథ వినగానే నిర్మాత ఎంత ఇస్తాడని చూడకుండా, ఎంత ఖర్చయినా తానే ఆ చిత్రాన్ని నిర్మించాలని భావించాడంటే ఖచ్చితంగా ఆ కథలో ఏదో స్ట్రయికింగ్‌ ఎలిమెంట్‌ వుంటుంది. సందీప్‌ కిషన్‌ నిర్మాతగా మారిన 'నిను వీడని నీడను నేనే'లో కూడా అలాంటి ఒక ఆసక్తికర అంశం వుంది. కథలోని తొలి మలుపు వినగానే చేసేయాలని డిసైడ్‌ అయి, ఇంటర్వెల్‌ దగ్గర అసలు మలుపు తెలియగానే సొంతంగానే తీసేయాలని ఫిక్స్‌ అయి వుండాలి. అయితే ఈ రెండు ఎక్సయిటింగ్‌ టర్న్స్‌ తీసుకున్న తర్వాత ఈ స్టోరీ జర్నీ ఎలా సాగింది, ఫైనల్‌గా గమ్యానికి ఎలా రీచ్‌ అయిందనేది కూడా చూసుకుని వుండాల్సింది. ఎక్సయిట్‌మెంట్‌లో మిగతా కథపై ఫోకస్‌ వుండి వుండదు. సినిమా తీస్తున్నప్పుడు, ఫైనల్‌గా చూసుకున్నప్పుడు కూడా ఆ రెండు మలుపులు దాటిన తర్వాత ఆ ఎక్సయిట్‌మెంట్‌ 'నీడ' వీడి వుండదు. ఫ్లాప్స్‌లో వున్నపుడు, సక్సెస్‌ ఇచ్చే స్టోరీ కోసం పరితపిస్తున్నపుడు ఒక ఎక్సయిటింగ్‌ కాన్సెప్ట్‌ వినగానే ఎగిరి క్యాచ్‌ చేయాలనుకోవడంలో తప్పు లేదు. అయితే ఆ కాన్సెప్ట్‌ పూర్తిస్థాయి సినిమాగా కన్వర్ట్‌ అయిందా లేదా అనేది చెక్‌ చేసుకోకుండా ప్రొసీడ్‌ అయిపోవడం మాత్రం తప్పు.

చాలా కథలు ఇంటర్వెల్‌ వరకు అద్భుతంగా వుండి తర్వాత పల్టీలు కొట్టడం పరిపాటి. ఫస్ట్‌ హాఫ్‌ గొప్పగా అనిపిస్తే ఇక అక్కడితో పైసా వసూల్‌ అనే నిర్లిప్తత ఆవహించి సినిమా స్థాయిని తగ్గించేస్తుంటుంది. కమర్షియల్‌ సినిమాలకి అయితే ఇతర మసాలా అంశాల వల్ల సెకండాఫ్‌ వీక్‌ అయినా చెల్లిపోతుంది కానీ కాన్సెప్ట్‌ సినిమాలకి ఉన్న రెండు గంటల సమయాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. దురదృష్టవశాత్తూ యువ దర్శకుడు కార్తీక్‌ రాజు 'నిను వీడని నీడను నేనే'కి ఒక ఆసక్తికరమైన కథాంశాన్ని తీసుకున్నాడు. అద్దంలో నువ్వు (సందీప్‌ కిషన్‌) కాక మరెవరో (వెన్నెల కిషోర్‌) కనిపించడం అనే పాయింట్‌ ఊహించడానికే థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఈ అంశం చుట్టూ అల్లిన ఈ కథ ముందుకి సాగే కొద్దీ మరింత ఎక్సయిట్‌ చేస్తుండగా... ఒక ఊహించని ట్విస్ట్‌ ఇస్తాడు. అంతవరకు మనం చూస్తున్న దానిని మార్చి చూడాల్సిన అవసరం కల్పిస్తాడు. ఈ కాన్సెప్ట్‌ విని సందీప్‌ సరెండర్‌ అయిపోవడంలో వింత లేదు.

ఇంకా ఎక్కువగా ఆ పాయింట్‌ గురించి డిస్కస్‌ చేస్తే స్పాయిలర్‌ అవుతుంది కనుక దానిని అలా విడిచి పెట్టేద్దాం. తనలో ఎవరో వున్నారని తెలుసుకున్నపుడు, అది ఎవరో తెలుసుకోవడానికి డాక్టర్లు, పోలీసుల సాయం తీసుకుంటున్నపుడు చాలా ఎక్సయిటింగ్‌గా అనిపించిన వ్యవహారం... ఒకసారి తనలో వున్న వాడితోనే మాట్లాడి తేల్చుకుందాం అనుకున్న తర్వాత ఒక్కసారిగా నీరసం ఆవహించింది. దానిని మరింత పలుచన చేస్తూ 'త్రీ-స్టేజ్‌' కామెడీ అంటూ వెన్నెల కిషోర్‌లోని కమెడియన్‌కి న్యాయం చేసే డెస్పరేట్‌ అటెంప్ట్‌తో ఒక్కసారిగా 'నిను వీడని నీడను నేనే' టోన్‌ మారిపోతుంది. ఒకరి శరీరంలోకి ఓ ఆత్మ వచ్చి చేరిందంటే... ఆ ఆత్మకి ఈ లోకాన్ని విడిచి వెళ్లకపోవడానికి బలమైన కారణం వుండాలి. ఈ కారణం 'కల్పించడానికి' దర్శకుడు చాలా అవస్థలే పడడం క్లియర్‌గా తెలిసిపోతుంది. ఈ కారణం నుంచి కథ పుట్టినట్టయితే కథనం సాఫీగా వుండేది. కానీ అద్దంలో వేరే ఎవరో కనిపించడం నుంచి పుట్టిన కథ కావడం వల్ల... అలా కనిపించడానికి కారణం అన్వేషించాల్సి వచ్చింది.

ఇందుకోసం తనది యాక్సిడెంట్‌ కాదు... ఎవరో చంపేసారు అనేది లీలగా గుర్తొచ్చినట్టు చూపించారు. పోనీ దానికి స్టిక్‌ అయ్యారా అంటే అది లేకుండా మళ్లీ మొదటికి వచ్చారు. మరి ఆత్మ ఎందుకని వేరే శరీరంలో అంతగా తిష్ట వేసుకుని వుండిపోయింది అనడానికి కారణం కోసం ఫ్యామిలీ ఎమోషన్‌ని తెర మీదకి తెచ్చారు. ఒకవేళ ఇదే క్లయిమాక్స్‌ అనుకున్నపుడు... కథ దీనిపై మొదలు పెట్టి వుండాలి. కేవలం ఎస్కేపిస్ట్‌ రూట్‌ కోసం ఈ ఎమోషన్‌ని వాడుకోవడంతో అది చివర్లో అతికించిన ఫీలింగ్‌ వస్తుంది. అంతే కాకుండా ఈ ప్రాసెస్‌లో కథలో వున్న కొత్తదనం పూర్తిగా కనుమరుగై ఒక అర్థం లేని మెలోడ్రామాతో ముగుస్తుంది. ఈ చిత్రంతో వచ్చిన మరో చిక్కు ఏమిటంటే... ఇక్కడ సమీక్షలో కథ అంతా హీరో పాయింట్‌ ఆఫ్‌ వ్యూలోనే చెప్పినట్టు, ట్రెయిలర్లు కూడా అతని మీదే ఫోకస్‌ చేసినట్టు అసలు కథ లేదు. హీరోతో పాటు హీరోయిన్‌ కూడా అదే క్లిష్ట పరిస్థితిలో చిక్కుకుంటుంది. అయినప్పటికీ ఆమె ఎమోషన్‌పై తగినంత ఫోకస్‌ వుండదు. కొన్నిసార్లు ఆమె పాత్ర సన్నివేశంలో వున్నా కానీ సఫర్‌ అవుతున్నది హీరో ఒక్కడే అన్నట్టుగా ఆమెని సైడ్‌లైన్‌ చేసారు. అలాంటప్పుడు కథనం ఇలా రాసుకోకుండా... ఈ కాన్సెప్ట్‌కి హీరో ఒకడే ఎఫెక్ట్‌ అయినట్టుగా కథ రాసుకుని వుండాల్సింది.

ముఖ్య తారాగణం అంతా తమ వంతు చేయగలిగింది చేసారు. తెరవెనుక నుంచి తమన్‌ నేపథ్య సంగీతంతో పాటు వర్మ ఛాయాగ్రహణంతో మూడ్‌ క్రియేట్‌ చేసారు. దర్శకుడు కార్తీక్‌ రాజు కొన్ని సందర్భాలలో చక్కని ప్రతిభ చూపించినా కీలకమైన ద్వితియార్ధంలో తన దర్శకత్వం అగమ్యగోచరం అనిపించేట్టు బేలగా అయిపోయాడు. 2035వ సంవత్సరంలో టెక్నాలజీ ఇలా వుంటుందంటూ పడ్డ తాపత్రయం లాంటి వాటితో హద్దులు దాటాడు. కార్తీక్‌ ఐడియాలు బాగున్నాయి కానీ వాటితో జీవితాన్ని మార్చుకునే సినిమానయితే తీయలేకపోయాడు.

సందీప్‌ కిషన్‌ కష్టాల నుంచి దాదాపు గట్టెక్కేసే పాయింట్‌ని అయితే పట్టగలిగాడు కానీ 'నిను వీడని నీడని నేనే' అంటూ తరుముతోన్న దురదృష్టాన్ని దూరం చేసే జాగ్రత్తలు తీసుకోలేక అర్థంలేని ద్వితియార్ధంతో భంగపడ్డాడు.

బాటమ్‌ లైన్‌: నీడలోనే ఉండిపోయిన కాన్సెప్టు!
- గణేష్‌ రావూరి

సినిమా రివ్యూ: దొరసాని

 


×