చట్ట సభలలో ఓబీలకు జనాభా నిష్పత్తికి అణుగుణంగా రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణను ప్రతిపాదిస్తూ రాజ్యసభలో తాను ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై శుక్రవారం ఓటింగ్ నిర్వహించడానికి న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ససేమిరా అనడంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ బిల్లును విజయసాయి రెడ్డి గత జూన్ 21న సభలో ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించిన సంగతి తెలిసిందే. చర్చ ముగియకుండానే ఆరోజు సభ వాయిదా పడటంతో ఈరోజు తిరిగి చర్చ కొనసాగింది. సభలోని పలు పార్టీల సభ్యులు ఈ బిల్లుకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
మంత్రితో సహా అధికార పక్షానికి చెందిన ఒకరిద్దరు సభ్యులు వ్యతిరేకించారు. చర్చపై న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ జవాబిస్తూ 2021లో తిరిగి జనాభా లెక్కల సేకరణ పూర్తయ్యేవరకు బీసీలకు చట్ట సభలలో రిజర్వేషన్ అనే అంశం చేపట్టడం సాధ్యం కాదు కాబట్టి ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని విజయసాయి రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
దీనికి విజయసాయి రెడ్డి సమాధానం చెబుతూ మంత్రి వాదనను పూర్తిగా తిప్పికొట్టారు. చట్ట సభలలో బీసీలకు జనాభా ప్రాతిపదికపై రిజర్వేషన్లు కల్పించడానికి జనాభా లెక్కల సేకరణకు సంబంధం ఏమిటని మంత్రిని నిలదీశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికలలో తమ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు చెందిన 65 శాతం మందికి మంత్రివర్గంలో స్థానం కల్పించారని సభకు స్పష్టం చేశారు.
ఇలాంటి ప్రాతినిధ్యం మరే రాష్ట్రంలోను ఇప్పటి వరకు కల్పించలేదని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తగిన న్యాయం చేయాలన్నదే తమ పార్టీ అధినేత లక్ష్యమని చెప్పారు. దానికి అనుగుణంగానే ప్రభుత్వంలో వారికి తగిన ప్రాధాన్యత కల్పించడం జరిగిందన్నారు. ఈ బిల్లును సభలో మెజారిటీ సభ్యులు సమర్ధిస్తున్నందున మంత్రి కోరిన విధంగా తాను బిల్లును వాపసు తీసుకోనని స్పష్టం చేశారు. కాబట్టి ఈ బిల్లుపై ఓటింగ్ జరిపించాలని ఆయన సభాధ్యక్షుడికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు.
ఈ దశలో మంత్రి రవిశంకర్ ప్రసాద్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తి ఈ బిల్లు రాజ్యాంగ సవరణను ప్రతిపాదిస్తున్నందున, ఓటింగ్ జరపాలంటే సభలో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరముందని అన్నారు. అసలు ఈ బిల్లులో పేర్కొన్న ఉద్దేశాలు, అందుకు ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణలు పరస్పర విరుద్దంగా ఉన్నాయని వాదించారు.
దీంతో సభలో విజయసాయి రెడ్డికి మద్దతుగా నిలిచిన సభ్యులంతా పెద్దపెట్టున నిరసన వ్యక్తం చేశారు. అయినా మంత్రి తన వాదన నుంచి వెనక్కి తగ్గలేదు. పలుమార్లు తన వాదన వినాలంటూ విజయసాయి రెడ్డి చేసిన విజ్ఞప్తులను సభాధ్యక్షులు పెడచెవిన పెట్టడంతో ప్రభుత్వ వైఖరికి విసిగిపోయిన తాను సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లుగా ప్రకటించి బయటకు వచ్చేశారు.