“సాయిపల్లవి పెళ్లి చేసుకుందంట. తన తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా ఆమె ఈ పని చేసిందంట” ఇలా 2 రోజులుగా సాయిపల్లవిపై పుకార్లు షికారు చేశాయి. మరీ గమ్మత్తైన విషయం ఏంటంటే, దండలు వేసుకొని, ఓ వ్యక్తితో సాయిపల్లవి దిగిన ఫొటోను కూడా ఈ సందర్భంగా షేర్ చేశారు.
దీంతో చాలామంది అది నిజం అనుకున్నారు. సాధారణంగా తనపై ఎలాంటి పుకార్లు వచ్చినా పట్టించుకోకుండా, తన పని తాను చేసుకుపోతుంటుంది సాయిపల్లవి. అయితే ఈసారి మాత్రం ఆమె అలా ఉండలేకపోయింది. తన పెళ్లి అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించింది.
“నిజం చెప్పాలంటే, నేను రూమర్‌లను పట్టించుకోను, కానీ అది కుటుంబ సభ్యులైన స్నేహితులతో లింక్ అయి ఉన్నప్పుడు, నేను మాట్లాడాలి. నా కొత్త సినిమా పూజా కార్యక్రమం నుంచి ఒక ఫొటో తీసుకొని, దాన్ని కావాలనే క్రాప్ చేసి ఇలా చేశారు. కొంతమంది కావాలనే ఉద్దేశపూర్వకంగా, పెయిడ్ బాట్స్ ద్వారా ఈ పని చేశారు. ఓవైపు నా సినిమాలకు సంబంధించి ఆసక్తికరమైన ప్రకటనలు చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అంతలోనే ఈ పనికిమాలిన పనులు నన్ను నిరుత్సాహపరుస్తున్నాయి. ఇలా ఒకర్ని అసౌకర్యానికి గురిచేయడం చాలా నీచమైన పని.”
ఇలా తన పెళ్లి వార్తలపై వస్తున్న పుకార్లను సాయిపల్లవి ఖండించింది. నిజానికి ఈ పుకార్లను, దానికి సంబంధించి వైరల్ అవుతున్న ఓ ఫొటోను దర్శకుడు వేణు ఊడుగుల వెంటనే ఖండించాడు. ఓ సినిమా ఓపెనింగ్ లో ఆ ఫొటో తీశారని క్లారిటీ ఇచ్చాడు. అయినప్పటికీ రూమర్స్ ఆగలేదు. ఇప్పుడు స్వయంగా సాయిపల్లవి ఈ రూమర్లపై వివరణ ఇచ్చింది.