చిత్రం: సప్త సాగరాలు దాటి
రేటింగ్: 2.75/5
తారాగణం: రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్, అవినాష్, శరత్ లోహితాశ్వ, అచ్యుత కుమార్, పవిత్ర లోకేష్, రమేష్ ఇందిర, గోపాల్ కృష్ణ దేశ్‌పాండే తదితరులు
సంగీతం: చరణ్ రాజ్
కెమెరా: అద్వైత గురుమూర్తి
ఎడిటర్: విజయ్ వేలుకుట్టి
నిర్మాత: రక్షిత్ సెట్టి
రచన-దర్శకత్వం: హేమంత్ రావు
విడుదల: సెప్టెంబర్ 22, 2023
“కాంతార” తర్వాత చిన్న బడ్జెట్ కన్నడ సినిమాలపై తెలుగు ప్రేక్షకుల దృష్టి పడుతోంది. ఏ మాత్రం విషయమున్నా భుజానకెత్తుకుంటున్నారు. “సప్త సాగరదాచే ఎల్లో” అనే కన్నడ చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ విపరీతంగా వచ్చాయి. వెంటనే తెలుగు వెర్షన్ విడులైపోయింది.
ఈ కథ 2010 నేపథ్యంలో సాగుతుంది. మను (రక్షిత్ శెట్టి) ఒక డ్రైవర్. ప్రియ (రుక్మిణి) ఒక స్టూడెంట్- మంచి సింగర్ కూడా. ఇద్దరూ ప్రేమించుకుంటారు. కానీ తన ప్రియురాలిని పెళ్లి చేసుకుని ఆనందమయమైన జీవితం గడపాలనుకుంటాడు మను. దానికి అతనికి డబ్బు కావాలి. అనుకోకుండా వచ్చిన ఒక అవకాశానికి లొంగి ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటాడు. డబ్బు కోసం తన యజమాని కొడుకు చేసిన యాక్సిడెంట్ నేరాన్ని తన మీద వేసుకుంటాడు. జైలుకెళ్తాడు. తర్వాత ఏమౌతుంది? అతనికి రిమాండ్ ఎన్నాళ్లు? శిక్ష పడుతుందా? మను, ప్రియలు మళ్లీ కలుస్తారా? ఇవన్నీ తెర మీద చూడాలి.
కథగా తీసుకుంటే ఇదొక జైల్ డ్రామా. ఎందుకంటే అగ్రభాగం జైల్ సన్నివేశాల చుట్టూనే జరుగుతుంది. చేయని నేరానికి జైలుకెళ్లిన హీరో, అక్కడ పడే ఇబ్బందులు, జైల్లో ఉండే ఇతర రౌడీలతో ఘర్షణ .. ఇలాంటివన్నీ చాలా సినిమాల్లో వచ్చేసాయి.
“విచారణ” లాంటి సినిమా తర్వాత చేయని నేరానికి ఇబ్బంది పడే అమాయకుల్ని చిత్రీకరించడం కష్టమే. ఆ స్థాయిని అయితే ఈ చిత్రం అందుకోలేకపోయింది.
అయితే ఈ సినిమాకి ప్లస్ పాయింటల్లా కెమెరా వర్క్. హీరోయిన్ కి టైట్ క్లోస్ షాట్స్ పెట్టి కథని ఒక పొయెట్రీగా మలిచాడు. హీరో కూడా సగటు పక్కింటబ్బాయి మాదిరిగా ప్రేక్షకులకి అలవాటైపోతాడు. మిగిలిన పాత్రల్లో అధిక శాతం సెల్ఫిష్ పాత్రలే.
టెక్నికల్ విషయనికొస్తే నేపథ్యసంగీతం బానే ఉంది. కానీ పాటలే పరమ వీక్. ఇలాంటి లవ్ స్టోరీకి కావాల్సిన గుండెల్ని తాకే పాటలు లేనే లేవిందులో. కన్నడలో పాటలు ఎలా ఉన్నాయో కానీ, తెలుగులో సాహిత్యం మాత్రం తేలిపోయింది. ఒక్క వాక్యం కూడా మనసుని హత్తుకునేలా లేదు.
ఇక నటీనటుల విషయానికొస్తే హీరోయిన్ రుక్మిణి చాలా గ్రేస్ఫుల్ గా ఉంది. పాత్రకి తగ్గట్టుగా ఆమె ఆహార్యం, అభినయం ఉన్నాయి.
కథానాయకుడు రక్షిత్ శెట్టి కూడా పాత్రోచితంగా ఉన్నాడు. అన్నట్టు ఇక్కడ హీరోయే నిర్మాత.
“కాంతార” ఫేం అచ్యుత్ కుమార్ తన టిపికల్ కంత్రీపాత్రని పోషించాడు.
హీరోయిన్ తల్లిగా పవిత్ర లోకేష్ మాత్రమే తెలుగువారికి బాగా తెలిసిన నటి.
జైల్లో డాన్ గా కనిపించిన రమేష్ ఇందిర లౌడ్ గా అనిపించాడు.
కథ బానే ఉన్నా…డీటైలింగ్ చక్కగా ఉన్నా.. కథనంలో డెప్త్, ఎమోషన్ ని సస్టైన్ చేసే విధానం కాస్త వీక్ గా ఉన్నాయి. డైలాగ్స్ కూడా కొన్ని తేలిపోయినట్టుగా ఉంటే, “ఖైదీల వల్ల, ఖైదీల కోసం, ఖైదీల తో నడిచేదే జైలు” అని ఒక ఖైదీ చేత హీరోకి చెప్పించడం సందర్భోచితంగా బాగుంది.
డ్రైవరు హీరో, చదువుకుంటున్న అమ్మాయి హీరోయిన్ అనగానే ఈ మధ్యనే వచ్చిన “బేబీ” గుర్తొస్తుంది. ఇదీ అలాంటి బ్యాక్ డ్రాపే. కానీ కథాగమనం మొత్తం వేరు.
ప్రధమార్ధమంతా సాఫ్ట్ గా సాగుతుంది. ఇంటర్వల్ ముందు వచ్చే సంఘర్షణ, కాసేపట్లో వచ్చే ఇంటర్వెల్ ట్విస్ట్ గ్రిప్పింగ్ గా ఉన్నాయి.
ద్వితీయార్ధం మాత్రం పూర్తిగా జైలు సన్నివేశాలే. పదే పదే ములాకత్ సీన్లు వస్తుండడం వల్ల కథ ముందుకి నడవకుండా అక్కడక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది.
క్లైమాక్స్ కి వచ్చేసరికి విషాదాంత ఛాయలతో ముగుస్తుంది.
ఇంతకీ విషయమేంటంటే ఈ సినిమా అంతా ఒక భాగం మాత్రం. మలి భాగం కూడా షూటింగైపోయింది. దాని తాలూకు టేజర్ కూడా చివర్లో వేసి అక్టోబర్ 27 విడుదల అని వేసారు. రాబోయే రెండవ పార్టులో జైల్లో ఉన్న ప్రధాన పాత్రలు బయటికొచ్చాక ఏమౌతుందో ఆ కథ ఉంది.
విషాదాంతంగా ముగిసిన తొలి భాగానికి, రెండో భాగం రివెంజ్ డ్రామాలాగ అనిపిస్తోంది.
కొసమెరుపు ఒకటి చెప్పుకోవాలి. సీరియస్ ఎండింగులో కాస్త డీటైలింగుని మెచ్చుకోదగ్గ షాట్ ఒకటుంది. 2010లో అరెస్టైన హీరో 2020లో విడుదలవుతాడు. బయటికి రాగానే ముక్కుని నోటిని కవర్ చేస్తూ మాస్క్ ధరిస్తాడు. అంటే అది కరోనాకాలం అని చెప్పడానికన్నమాట.
బాటం లైన్: సగం సాగరమే దాటి