ఓ హీరో తన సినిమా కోసం రెండేళ్లు కేటాయించొచ్చు. రిస్క్ తీసుకున్నా ఓకే అనుకోవచ్చు. కానీ ఓ హీరోయిన్ ఒక్క సినిమా కోసం రెండేళ్లు టైమ్ తీసుకుంటే.. కచ్చితంగా ఇది రిస్కే. అసలే హీరోయిన్ కెరీర్ స్పాన్ తక్కువ. అలాంటి తక్కువ కెరీర్ లో దాదాపు రెండేళ్ల టైమ్ ఒకే సినిమాకు కేటాయించడం అంటే, టోటల్ కెరీర్ నే రిస్క్ లో పెట్టినట్టవుతుంది. ఇప్పుడు అలాంటి రిస్క్ తీసుకోవడానికి రెడీ అవుతోంది సాయిపల్లవి.
భారీ బడ్జెట్ తో రామాయణం ప్రాజెక్టు రాబోతోంది. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ తో, దేశంలోని అన్ని ప్రముఖ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తామని గతంలోనే అల్లు అరవింద్ ప్రకటించారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన ప్రముఖ నటులు ఇందులో కీలక పాత్రలు పోషించబోతున్నారు. ఇందులో భాగంగా సీత పాత్ర కోసం సాయిపల్లవిని తీసుకున్నారు.
ఈ పాత్ర కోసం ఏకంగా రెండేళ్ల పాటు ఇతర సినిమాలకు దూరంగా ఉండబోతోంది సాయిపల్లవి. కేవలం రామాయణం ప్రాజెక్టు కోసమే ఆమె రెండేళ్ల పాటు వర్క్ చేయాలని నిర్ణయించుకుందట.
ఇదే కనుక జరిగితే ఆమె చాలా పెద్ద రిస్క్ తీసుకున్నట్టే. ఈ రెండేళ్ల టైమ్ లో శ్రీలీల, కృతిశెట్టి లాంటి హీరోయిన్లు అరడజను సినిమాలు లాగించేస్తారు. కానీ సాయిపల్లవి మాత్రం సీత పాత్ర కోసం రెండేళ్లు గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకుందట.
శర్వానంద్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సాయిపల్లవిని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారు. కానీ సాయిపల్లవి మాత్రం తన దృష్టి మొత్తం రామాయణం ప్రాజెక్టుపైనే పెట్టిందంటున్నారు.