అమిత్ షా ముందు విశాఖ గొప్పతనం

విశాఖ మహా నగరం. ఈ విషయంలో రెండవ మాటకు తావు లేదు. ఆసియా ఖండంలోనే శరవేగంగా అభివృద్ధి చెందే సిటీగా విశాఖకు పేరు ఉంది. కాస్మోపాలిటన్ కల్చర్ తో దేశంలో టాప్ టెన్ సిటీలలో…

విశాఖ మహా నగరం. ఈ విషయంలో రెండవ మాటకు తావు లేదు. ఆసియా ఖండంలోనే శరవేగంగా అభివృద్ధి చెందే సిటీగా విశాఖకు పేరు ఉంది. కాస్మోపాలిటన్ కల్చర్ తో దేశంలో టాప్ టెన్ సిటీలలో విశాఖ ఒకటిగా ఉంది.

ఉమ్మడి ఏపీలో సైతం హైదరాబాద్ తరువాత విశాఖ తరువాత స్థానంలో ఉండేది. విభజన ఏపీలో ఏకైక మెగా సిటీగా విశాఖ ఈ రోజుకూ వెలుగొందుతోంది. అలాంటి విశాఖను రాజధాని చేస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సంగతి తెలిసిందే. అమరావతి ఏకైక రాజధాని అంటూ హై కోర్టు ఇచ్చిన తీర్పు మీద సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.

ప్రస్తుతం సుప్రీం కోర్టు విచారణలో రాజధాని అంశం ఉంది, అయినా ఈ నెల 3,4 తేదీలలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖను పాలనా రాజధాని చేసుకోవాలన్న ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉందని చెప్పారు. అలా జాతీయ స్థాయిలో విశాఖకు ఆయన ఫోకస్ చేస్తూ ముందుకు సాగారు.

కార్పోరేట్ దిగ్గజాలకు కూడా ఏపీలో మహానగరంగా విశాఖను చూపించారు. పెట్టుబడులు పెట్టేందుకు సేఫెస్ట్ సిటీగా విశాఖ ఉందని గుర్తు చేశారు. ఇంతకు ముందు జనవరి నెలాఖరులో సీఎం జగన్ ఢిల్లీ వెళ్ళినపుడు కూడా విశాఖ రాజధానిగా చేసుకోవాలన్న ఆలోచన ఉందని ప్రకటించారు.

మూడున్నరేళ్ళుగా మూడు రాజధానుల గురించి జరుగుతున్న చర్చ, రచ్చ కేంద్రానికి కూడా తెలుసు. ఇపుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎదురుగా విశాఖ ప్రాముఖ్యత ప్రాశస్త్యం గురించి విశాఖ నగర మేయర్ చాటి చెప్పారు. కొత్త ఢిల్లీలో రెండు రోజుల పాటు జరుగుతున్న జాతీయ విపత్తుల నివారణ సదస్సులో పాల్గొన్న మేయర్ హరివెంకట కుమారి మాట్లాడుతూ విశాఖ అత్యంత భద్రత కలిగిన నగరం అని చెప్పారు.

సువిశాలమైన సముద్రతీరాన ఉన్న విశాఖ నగరం ఎన్నో ప్రకృతి విపత్తులను తట్టుకుని నిలబడిందని ఆమె గుర్తు చేశారు. విశాఖ సమగ్రమైన ప్రగతిని సాధిస్తోందని ఆమె ఈ సందర్భంగా చెప్పడం విశేషం. ఏపీలో అగ్రశ్రేణి నగరంగా విశాఖ ఉంటూ రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ గా మారిందని మేయర్ వెల్లడించారు.

కేంద్ర హోం మంత్రి ఎదురుగా విశాఖ ప్రాధాన్యతను మేయర్ వెల్లడించడమే ఇక్కడ విశేషం. ఏపీ నుంచి అర్బన్ లోకల్ బాడీస్ తరఫున కేవలం విశాఖ మేయర్ ని నామినేట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం పంపించడం వెనక ఉన్న ఉద్దేశ్యం కూడా విశాఖ ఘనతను ఢిల్లీ వేదికగా కేంద్ర పెద్దలకు మరోసారి తెలియచెప్పడమే అంటున్నారు. కేంద్రం ఆలోచనలు ఎలా ఉన్నా విశాఖను రాజధానిగా చేసే విషయంలో వైసీపీ ప్రభుత్వం వెనకడుగు వేయడంలేదు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని వాడుకుంటోంది అనే చెప్పాలి.