కెజిఎఫ్ సిరీస్ సృష్టికర్త, ఇండియన్ సినిమా క్రేజీ డైరక్టర్లలో ఒకరు ప్రశాంత్ నీల్. ఆయన బాహుబలి ప్రభాస్ తో కలిసి చేస్తున్న సినిమా సలార్. ఈ సినిమా ఏనాటి నుంచో షూటింగ్‌లో వుంది. ఆఖరికి ఈ నెలలో విడుదల వుతుందని మేకర్లే ప్రకటించారు. సినిమా విడుదల డేట్ రోజుల్లోకి వచ్చినా ట్రయిలర్ లేదు. ఏ కబురూ లేదు. ఎందుకా అని అందరూ అనుకుంటూ వుంటే బాంబు లాంటి వార్త..సినిమా వాయిదా పడిందని. అది కూడా అధికారికంగా కాదు. గ్యాసిప్ లే. కానీ ఖండన కూడా లేదు. సో.. వాయిదా పడినట్లే.
సలార్ వాయిదాకు ఎవరి రీజన్లు వారు చెప్పుకుంటున్నారు. సిజి వర్క్ బాగా లేదని వాయిదా అనే టాక్ ఒకటి వుంది. కానీ ఈ రీజన్లు ఏవీ కాదు. కేవలం డిజిటల్ రైట్స్ అమ్మకం పూర్తి కానందునే వాయిదా అని క్లారిటీగా తెలుస్తోంది.
విషయం ఏమిటంటే హంబోలే ఫిలింస్.. ప్రశాంత్ నీల్ ఎక్కువ దుబారా లేకుండా చాలా జాగ్రత్తగా సినిమా తీస్తారు. వంద రెండు వందల కోట్లలో సినిమా తీసి వెయ్యి కోట్లు తెచ్చుకుంటారు. అంతే తప్ప వెయ్యి కోట్లు ఖర్చు చేసి పదకొండు వందల కోట్లు తెచ్చుకునే రకం కాదు. నాన్ థియేటర్ హక్కుల మీద పెట్టుబడి రాబట్టుకుని థియేటర్ లో నేరుగా స్వంతగా విడుదల చేసుకున్నారు గతంలో. కేజిఎఫ్ విడుదలకు ముందే డిస్ట్రిబ్యూటర్ల దగ్గర తీసుకున్న అడ్వాన్స్‌లు అన్నీ తిరిగి ఇచ్చేసారు.
అలాంటి నిర్మాతలు సలార్ సినిమాను మాత్రం ఆంధ్ర, తెలంగాణ అమ్మకానికి ప్రయత్నించారు.. ప్రయత్నిస్తున్నారు. ఆంధ్ర 85 కోట్లు నైజాం 80 కోట్ల నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ కింద ఇవ్వాలనుకుంటున్నారు. ఎందుకిలా? అంటే అసలు విషయం అక్కడే వుంది. సలార్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల విక్రయ అగ్రిమెంట్ ఇంకా జరగలేదని తెలుస్తోంది. అమెజాన్ సంస్థతో సంప్రదింపులు జరుగుతున్నాయి.
కేవలం రేటు సమస్య కాదు. కొన్ని అనుభవాల రీత్యా ఓటిటి సంస్థలు వంద కోట్లకు పై బడిన డిజిటల్ హక్కుల కొనుగోలు విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. బాలీవుడ్ లో కొన్ని భారీ సినిమాలు భారీ రేట్లకు కొని గట్టి దెబ్బలు తిన్నాయి. దాంతో బడ్జెట్ పరిమితులు స్వంతంగా విధించుకున్నాయి. అమెజాన్ కు సంబంధించినంత వరకు ఈ ఏడాది బడ్జెట్ ఖర్చయిపోయిందని తెలుస్తోంది. అలాగే నెట్ ఫిక్స్ కు అయితే వచ్చే ఏడాది తొలి రెండు క్వార్టర్ల నిధుల కూడా కేటాయింపులు జరిగిపోయాయని తెలుస్తోంది.
అందువల్ల ఈ వ్యవహారం సెటిల్ అయితేనే సలార్ ప్రాజెక్ట్ మీద అస్సలు ఫైనాన్స్ బర్డెన్ వుండదు. లేదూ అంటే అమ్మకాలు జరిపాల్సి వుంటుంది. అదీ కాక ఏ సినిమా అయినా విడుదలకు ముందు నాన్ థియేటర్ అమ్మకాలు జరిగితేనే అన్ని విధాలా బెటర్. లేదూ అంటే అనవసరపు ఇబ్బందులు వుంటాయి. అందుకే విడుదల డేట్ మీద సలార్ ముందు వెనుకలు అవుతోందని తెలుస్తోంది.