సినీ పరిశ్రమకు కరోనా పరిస్థితులు చాలా పాఠాలను నేర్పాయి. అందులో అతి ముఖ్యమైనది ఓటీటీ విడుదల. ఆ కష్టకాలంలో, థియేటర్లు పూర్తిగా మూతపడిన పరిస్థితుల్లో ఓటీటీల్లో విడుదల అవకాశమే లేకపోతే, ఈ మార్గమే లేకపోతే గత రెండేళ్లలో చిత్ర పరిశ్రమల పరిస్థితి మరింత దయనీయంగా ఉండేది. ఇక ఇప్పుడిప్పుడు పరిస్థితులు నిమ్మళిస్తున్నాయి. భారీ సినిమాలు కూడా థియేటర్ల బాటన పడుతున్నాయి.
మూడో వేవ్ తర్వాత థియేటర్లకు ప్రేక్షకుల తాకిడీ కూడా చాలా వరకూ పెరిగింది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ధైర్యంగా థియేటర్ల కు కదులుతున్నారు. దీనికి తగ్గట్టుగా భారీ సినిమాల విడుదల జరుగుతూ ఉంది. ఇక నుంచి పాత రోజులు మళ్లీ వస్తాయనే ఆశాభావం పరిశ్రమలో కనిపిస్తూ ఉంది.
అయితే ఆ పరిస్థితులతో సంబంధం లేకుండా..ఇకపై కూడా కొన్ని డైరెక్ట్ ఓటీటీ విడుదలలు ఉండబోతున్నాయనే స్పష్టత వస్తోంది. రకరకాల సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని సినిమాలను డైరెక్ట్ గా మూవీ స్ట్రీమింగ్ యాప్స్ ద్వారా విడుదల చేయడానికి మూవీ మేకర్లు సై అంటున్నారు. ఇటీవలే దుల్కర్ సల్మాన్ సినిమా ఒకటి థియేటర్లలో విడుదల అయ్యింది. అయితే ఆ సినిమాకు బాగా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.
ఇక ఈ హీరో నటించిన సెల్యూట్ సినిమా త్వరలోనే విడుదల కానుంది. అది ఓటీటీలో కావడం గమనార్హం. వాస్తవానికి ఈ సినిమాను సంక్రాంతి సమయంలోనే థియేటర్లకు వదలాలని అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నారు.
కేవలం ఈ సినిమా అనే కాదు.. కోవిడ్ తెచ్చిన మార్పు మేరకు ఇకపై పలు సినిమాలు కేవలం ఓటీటీల్లోనే విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది. మూవీ స్ట్రీమింగ్ యాప్స్ కు కూడా సబ్ స్క్రైబర్స్ ను పెంచుకోవడానికి ఈ మార్గం ఉపకరిస్తుంది. కాస్త ఎక్కువ ధర పెట్టి అయినా.. ప్రతి నెలా ఇలా కొన్ని డైరెక్ట్ సినిమాలను విడుదల చేయక తప్పని పరిస్థితిని కూడా అవి ఎదుర్కొనబోతున్నాయి.