ఏపీ సీఎం జగన్ పక్క రాష్ట్ర రాజకీయాల్లో మన అవసరం లేదంటూ తెలంగాణలో ఏకంగా వైసీపీని రద్దు చేసుకున్నారు. అటు చూస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ అన్ని రాష్ట్రాల్లో మనముండాలి, ఏకంగా హస్తిన కుంభస్థలం కొట్టాలంటూ హడావిడి చేస్తున్నారు.
ఓ రకంగా చూస్తే తెలంగాణలో కేసీఆర్ కి ఉన్న పలుకుబడి కంటే.. ఏపీలో జగన్ కి ఉన్న ఆదరణే చాలా ఎక్కువ. ఓట్లయినా, సీట్లయినా, ప్రజారంజక పథకాలయినా జగన్ కే ఎక్కువ క్రేజ్ ఉంది. మరి జగన్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు, కేసీఆర్ ఎందుకు దూకుడు మీదున్నారు. వీళ్లిద్దర్లో ఎవరు కరెక్ట్.
కేసీఆర్ తొందరపడుతున్నారా..?
వరుసగా రెండు దఫాలు అధికారంలోకి వచ్చిన బీజేపీపై సహజంగానే దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోంది. దాన్ని క్యాష్ చేసుకోవడంలో కాంగ్రెస్ విఫలమవుతుంటే.. మమతా బెనర్జీ, కేజ్రీవాల్ వంటివారు ఢిల్లీ పీఠంపై కన్నేశారు. తమ రాష్ట్రాల్లో తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తూ పక్క రాష్ట్రాల్లో పార్టీని విస్తరిస్తున్నారు. మరి 17 లోక్ సభ సీట్లున్న ప్రాంతీయ పార్టీ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎలా చక్రం తిప్పుతారనేది అనుమానమే.
వారి వారి సొంత రాష్ట్రాల్లో మమత, కేజ్రీవాల్ కి తిరుగులేదు. ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి పలుకుబడి ఉంది. కానీ కేసీఆర్ కి సొంత రాష్ట్రం తెలంగాణలోనే గట్టి పోటీ ఉంది. సీనియర్లంతా ఒక్కొక్కరే ఆయన్ను వీడి వెళ్లిపోతున్నారు. నియంత స్వామ్యం ఎవరికీ నచ్చడంలేదు.
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ దశలో తెలంగాణలో టీఆర్ఎస్ ని మరింత బలపరిచే ఆలోచన చేయకుండా కేంద్ర రాజకీయాల్లో కేసీఆర్ వేలుపెట్టడం ఎంతవరకు కరెక్ట్. కేటీఆర్ ను తన వారసుడిగా చేయడమే కేసీఆర్ లక్ష్యం అనుకుంటే.. దాని కోసం కేంద్ర రాజకీయాల వైపు కేసీఆర్ వెళ్లాల్సిన అవసరం లేదు.
జగన్ కి అంత అధైర్యమెందుకు..?
తెలంగాణలో వైఎస్సార్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ అభిమానం వల్లే 2014 ఎన్నికల తర్వాత కొత్తగా ఏర్పడిన తెలంగాణ అసెంబ్లీలో వైసీపీ కూడా అడుగుపెట్టింది. కానీ టీఆర్ఎస్ ఆకర్షణ ముందు తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీ ఖాళీ అయింది.
ఓ దశలో ఏపీలో అధికారంలోకి రావడమే జగన్ ముందున్న అతి పెద్ద సవాల్. అందుకే తెలంగాణలో పార్టీని వద్దనుకున్నారు. ఏపీపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి సీఎం అయ్యారు.
జాతీయ రాజకీయాలు జగన్ కి అవసరం లేదా..?
వైసీపీ నాయకులెప్పుడూ జగన్ మరో ఐదు దఫాలు ఏపీకి సీఎం అవుతారని చెబుతారే కానీ, ఢిల్లీకి వెళ్తారని ఎక్కడా అనలేదు. 30 ఏళ్లు వైసీపీదే అధికారం, జగనే మా సీఎం అంటారు కానీ.. జగన్ ని పీఎంగా చూడాలని ఎవరూ అనుకోవడంలేదు. ఆ మాటకొస్తే జగన్ కి కూడా ఆ ఆలోచన ఉన్నట్టు లేదు.
ఏపీలో వైసీపీ పథకాలను పొరుగు రాష్ట్రాలు ప్రశంసిస్తున్నా, పక్క రాష్ట్రాల వారు వాటిని అనుసరిస్తున్నా.. జగన్ మాత్రం ఎక్కడా జాతీయ రాజకీయాల జోలికి పోలేదు. ఏపీ ప్రజల కోసమే పనిచేయాలనుకుంటున్నారు.
ఒకరకంగా జగన్ స్ట్రాటజీయే ఇప్పటికిప్పుడు కరెక్ట్ అనుకున్నా.. కేసీఆర్ లాంటివారు చేసే సాహసాలు జగన్ కి భవిష్యత్ పాఠాలుగా పనిచేయొచ్చు. ఏదేమైనా జగన్ నేలవిడిచి సాము చేసేందుకు ఇష్టపడటంలేదనేది ఇప్పటికిప్పుడు తేల్చి చెప్పగల వాస్తవం.