ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు పవన్ కల్యాణ్. అందులో 2 రీమేక్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. అయితే కొన్నేళ్ల కిందటే పవన్ ఓ రీమేక్ అనుకున్నారు. బౌండెడ్ స్క్రిప్ట్ కూడా రెడీగా ఉంది. కానీ ఆ సినిమా సెట్స్ పైకి రాలేదు. అలా ఆగిపోయిన ఆ రీమేక్ పై తాజాగా స్పందించాడు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్.
“పవన్ కల్యాణ్ గారే పిలిచారు. 2-3 సిట్టింగ్స్ అయ్యాయి. దాదాపు ఏడాది ట్రావెల్ చేశాం. తేరి అనే సినిమా రీమేక్ అది. బౌండెడ్ స్క్రిప్ట్ కూడా రెడీ అయింది. కాకపోతే అప్పుడు పవన్ కల్యాణ్ గారు అజ్ఞాతవాసి సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత పాలిటిక్స్ లోకి వెళ్లిపోయారు. అంతేతప్ప, స్క్రిప్ట్ లో ఎక్కడా ఇబ్బందులు ఎదురుకాలేదు.”
అలా తేరి రీమేక్ అగిపోయిన విషయాన్ని బయటపెట్టాడు సంతోష్ శ్రీనివాస్. ఆ తర్వాత అదే స్క్రిప్ట్ ను రవితేజతో అనుకున్నప్పటికీ సాధ్యపడలేదన్నాడు. ఇప్పటికీ ఆ సినిమా, బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉందంటున్నాడు శ్రీనివాస్. మరోవైపు బాలయ్యతో చేయబోయే సినిమాపై కూడా రియాక్ట్ అయ్యాడు.
“ఓ మంచి పవర్ ఫుల్ ఆలోచన వచ్చింది. దాంతో పాటు టైటిల్ కూడా వచ్చింది. బలరామయ్య బరిలో దిగితే అనేది టైటిల్. బలమైన కథ అది. దాన్ని బాలయ్యతోనే చేయాలి. కథ ఇంకా నడుస్తుంది. బాలయ్యకు ఇంకా చెప్పలేదు. ఆ కథ ఎటు వెళ్తుందో చూడాలి.”
ఈ సంక్రాంతికి అల్లుడు అదుర్స్ సినిమాతో థియేటర్లలోకి వస్తున్నాడు సంతోష్ శ్రీనివాస్. ఈ సినిమాలో సోనూ సూద్ కూడా నటిస్తున్నాడు. లాక్ డౌన్ టైమ్ లో హీరో అయిపోయిన సోనూ సూద్ కోసం.. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని మార్పుచేర్పులు చేయాల్సి వచ్చిందని అంగీకరించాడు దర్శకుడు.
“లాక్ డౌన్ తర్వాత సోనూ సూద్ ను ఆడియన్స్ చూసే విధానం మారిపోయింది. దీంతో మా అల్లుడు అదుర్స్ సినిమాలో కూడా సోనూ సూద్ పాత్రలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. హీరో ఇమేజ్ తెచ్చుకున్న ఆయనతో కొన్ని సీన్స్ చేయలేం. కొన్ని జాగ్రత్తలు తీసుకొని, ప్రేక్షకుల్లో సోనూ సూద్ పై ఉన్న గౌరవం పోగొట్టకుండా చేశాం. సినిమాలో ఆయన విలన్ కాబట్టి, కొన్ని లూజ్ డైలాగ్స్ ఉన్నాయి. అవన్నీ తీసేశాం.”
15వ తేదీన థియేటర్లలోకి వస్తోంది అల్లుడు అదుర్స్ సినిమా. ఈ సంక్రాంతికి తమ సినిమానే సిసలైన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అంటున్నాడు సంతోష్ శ్రీనివాస్.