ఎనర్జీ అంటే రవితేజ..రవితేజ అంటేనే ఎనర్జీ. స్క్రీన్ మీదనే కాదు, ఆఫ్ ది స్క్రీన్ కూడా అలాగే వుంటారు. ప్రశ్న అడిగేలోపే సమాధానం వస్తుంది. సమాధానం విన్నాక మళ్లీ ప్రశ్నించేందుకు వీలు వుండదు. రవితేజతో మీడియా మీట్ అంటే అలాగే వుంటుంది.
గోదావరి వెటకార అడుగు అడుగునా తొంగి చూస్తుంది. సంక్రాంతికి విడుదల కాబోతున్న క్రాక్ సినిమా ప్రమోషన్ కోసం, ఖిలాడీ షూటింగ్ లంచ్ గ్యాప్ లో కొన్ని నిమిషాలు ఆయన 'గ్రేట్ ఆంధ్ర'తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలు ఇవే.
చాలా కాలం తరువాత మీ సినిమాకు మాంచి బజ్, ప్రీ రిలీజ్ హుషారు కనిపిస్తోంది.
అవును అంతేగా..ముందు కొన్ని సినిమాలు దొబ్బేసాయిగా.
మీరు నమ్మకం పెట్టుకుని కూడా నిరాశ పర్చాయా ఆ సినిమాలు.
అన్నీ కాదు. నేలటికెట్, అమర్ అక్బర్ ఆంధోని మీద మరీ ఎక్కువ ఆశలు పెట్టుకోలేదు కానీ డిస్కోరాజా మీద కాస్త ఆశపడ్డారు. అది మంచి సబ్జెక్ట్. కానీ హ్యాండిల్ చేయడంలో ఎక్కడో తేడా జరిగింది.
మూడుగంటలు మాస్క్ పెట్టుకుని మరీ థియేటర్ లో కూర్చుని చూసేంత మీ సినిమాలో ఏం వుంటుంది?
ఎంటర్ టైన్ మెంట్. కామన్ ప్రేక్షకుడికి అంతకన్నా ఏం కావాలి? ఏం ఇవ్వాలి? మూడు గంటల సేపు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్..
కానీ ట్రయిలర్ లో ఎమోషనల్ రవితేజ కనిపిస్తున్నారు. ఫన్ ఎక్కడ?
సినిమాలో వున్నదే అది. హీరో క్యారెక్టర్ నే అవుట్ అండ్ అవుట్ ఫన్.
సేతుపతి కథనేనా ఇది.
ఎవరన్నారు..ఇది పూర్తిగా వేరు. రియల్ ఇన్సిడెంట్ లు, రియల్ క్యారెక్టర్లపై డైరక్టర్ గోపీచంద్ బోలెడు వర్కవుట్ చేసి తయారుచేసిన కథ. కావాలంటే ఆయనను అడగండి ఆ రియల్ క్యారెక్టర్ల పేరు కూడా చెబుతాడు.
శృతి కేవలం గ్లామర్ డాల్ నా? డెప్త్ వున్న క్యారెక్టరా?
శృతికి మంచి పాత్ర అవుతుంది. సినిమాలో హీరోయిన్ కు కూడా మంచి స్కోప్ వున్న కథ ఇది.
గోపీచంద్ మలినేనితో హ్యాట్రిక్ అవుతుందని ఆశిస్తున్నారా?
మీ అంతా కోపరేట్ చేస్తే అవుతుంది.
సినిమాను ప్రీపోన్ చేయడం అన్నది మీ ఐడియానా?
నిర్మాత ఇలా చేద్దాం అన్నారు. బాగుందని అంతా ఓకె అన్నాం.
అంతేనా టఫ్ కాంపిటీషన్ వుందనా?
కాంపిటీషన్ ఎప్పుడూ వుంటుంది. సంక్రాంతికి ఇంకా ఎక్కువ వుంటుంది. అయితే హిట్ అయితే ఎన్ని సినిమాలు అయినా ఆడేస్తాయి సంక్రాంతికి. అది ఆ సీజన్ అడ్వాంటేజ్.
దీని తరువాత ఖిలాడీ..ఆ తరువాత?
ప్రస్తుతానికి ఖిలాడీ చేస్తున్నా..చాలా బాగా వస్తోంది. నాకు బాగా నచ్చింది. ఆ తరువాత కొత్త కొత్త డైరక్టర్లు, కొత్త తరహా కథలు వింటున్నా. కానీ సమస్య ఏమిటంటే నేను ప్రయోగాలు చేస్తే, అవార్డులు, పేరు వస్తాయేమో కానీ డబ్బులు రావాలి కదా? అదీ సందేహం.
మారుతితో సినిమా ఎందుకు వదిలేసారు.
వదిలేయలేదు. మారుతి అంటే నాకు చాలా ఇష్టం. తప్పకుండా ఆయనతో సినిమా చేస్తాను. అయితే అది ఎప్పుడు అన్నది మీకు తరువాత చెబుతాను.
నక్కిన త్రినాధరావు-పీపుల్స్ మీడియా సినిమా.
అది కూడా డిస్కషన్ లో వుంది.
చాలా రోజుల తరువాత ఈ సినిమాలో అందంగా కనిపిస్తున్నారు.
కాంప్లిమెంట్ కు థాంక్స్. బాడీలో ఫ్యాట్ తగ్గించుకోవడం కోసం నేను చేసిన ప్రయత్నం వల్ల ఫేస్ కూడా కాస్త లాగేసింది. దానికి తోడు హెయిర్ ఎక్కువై మొహం మరీ చిన్నదిగా కనిపించింది. మళ్లీ ఇప్పుడు అంతా సెట్ రైట్ అయింది. మీరైనా, నేనైనా వర్కవుట్లు ముఖ్యం. రోజుకు గంటన్నర వర్కవుట్ చేస్తాను. నా బాడీలో ఎక్కడ చూడండి. ఫ్యాట్ అన్నది వుండదు.
క్రాక్ మీద మీకు పర్సనల్ గా పాజిటివ్ వైబ్ వుందా.
హండ్రెడ్ పర్సంట్. మీరే చూస్తారుగా మరో మూడు రోజుల్లో.
తప్పుకుండా..ఆల్ ది బెస్ట్.
థాంక్యూ
విఎస్ఎన్ మూర్తి