cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

'అశోక' వనంలో కిష్కింధకాండ

'అశోక' వనంలో కిష్కింధకాండ

వానరం ఎప్పటికీ వానరమే. వానర రాజైనంత మాత్రాన వివేకంతో వ్యవహరిస్తాడు అనుకోవడానికి వీల్లేదు. అలాంటి వివేకం లేకనే వాలి తప్పు చేసి రాముడి చేతిలో హతమయ్యాడు. 

ఆంధ్ర సిఎమ్ జగన్ మంత్రివర్గంలోని మంత్రులు కొందరు, అదే విధంగా తాము మంత్రులమని, మాట్లాడేమాటను ఆచి తూచి వాడాలని మరచిపోయి, తమ చిత్తానికి ప్రవర్తిస్తూ, అధినేత కుర్చీ కిందకు నీళ్లు తెచ్చే ప్రయత్నానికి తమ వంతు సాయం చేస్తున్నట్ల కనిపిస్తోంది. 

అస్సలు రాజకీయ అనుభవం లేకనా? వ్యూహాత్మకంగా మాట్లాడడం రాకనా? పర్యవసానాలు తెలియకనా? ఇలా మాట్లాడడం. రామతీర్థం లోని బోడి కొండ ఆలయంలో దుర్ఘటన జరిగిపోయింది. 

అది జరిగిపోయింది. ఇక చేయగలిగింది లేదు. దాన్ని వీలయినంత సద్దుమణిగేలా చేయడం ఒకటే చేయాల్సింది. అవతలి వాళ్లు రెచ్చిపోతున్నపుడు మనం వీలయినంత సంయమనం పాటించాలి. అంతే గానీ మరింత పెట్రోలు పోసి రెచ్చగొట్టకూడదు. 

విగ్రహం ఎవరు ధ్వంసం చేసినా, ప్రభుత్వం, అధికారంలో వున్నవారు సమాధానం చెప్పుకోవాల్సి వుంటుంది కాబట్టి, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పైగా ప్రస్తుతం నడిచేవి ఓటు బ్యాంకు రాజకీయాలు. అటు విగ్రహం కోసం ఆగ్రహమైనా, ఇటు విగ్రహ ఉదంతంపై నిగ్రహమైనా. మరి అలాంటపుడు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి, తన నోటికి వచ్చినట్ల మాట్లాడడం అంటే ఏమనుకోవాలి?

అనుభవ రాహిత్యం అనుకోవాలా? ఏం జరిగినా తనకేం పోయే, ఆ నొపి సిఎమ్ జగన్ కు కదా అనే ధీమా అనుకోవాలా? అశోక్ గజపతిపై మాట తూలే ముందు కనీసపు ఆలోచన మంత్రి వెల్లంపల్లి చేసారు అనుకోవాలా? అలాంటి ఆలోచన వుంటే ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడేవారా? అని అనుకోవాలా?

అశోక్ గజపతి తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి కావచ్చు. రాజకీయ నాయకుడు కావచ్చు. కానీ రాజకీయంగా ఎన్నయినా విమర్శించవచ్చు. కానీ అశోక్ ఓ సంస్థానానికి వారసుడు. ఉత్తరాంధ్రలో కాస్త విలువ కలిగిన పూసపాటి వంశీయుడు ఆయన. ఉత్తరాంధ్ర క్షత్రియులకే కాదు, సామాన్య ప్రజానీకానికి కూడా ఆ వంశం అంటే కాస్త గౌరవ ప్రపత్తులు వున్నాయి. 

ఎక్కడో విజయవాడ నుంచి వచ్చి, అవి తెలియకుండా తమ నోటికి వచ్చినట్లు మాట్లాడేసి వెళ్తే ఎలా? దాని పర్యవసానాలు ఎలా వుంటాయో ఆలోచించనక్కరలేదా? పైగా జరిగిన ఉదంతానికి అశోక్ కు సంబంధం ఏమిటి? ప్రతిపక్షంలో వుండి ఆయన విమర్శిస్తే విమర్శించవచ్చు. దానికి దీటుగా బదులివ్వాలి కానీ, వ్యక్తిగత దూషణకు దిగితే ఎలా? 

వెల్లంపల్లికి గుర్తు వుందో లేదో? తెలుసో లేదో? 2014 ఎన్నికల వేళ జగన్ కు క్షత్రియులు అంతా దూరంగా వున్నారు. ఎందుకని? జైల్లో వున్నవేళ జగన్ సత్యం రామలింగరాజు మీద చేయి చేసుకున్నారనే వందతి వల్ల. అది ఎవ్వరికీ తెలియదు. 

ఎక్కడ పుట్టిందో తెలియదు. కానీ దాని ఫలితంగా క్షత్రియులు అంతా దూరంగా వుండిపోయారు. లక్కీగా 2019 నాటికి క్షత్రియులు అంతా జగన్ కు దగ్గరయ్యారు.  ఆయనతోనే నడిచారు. పవన్ ను తమ ఏరియాలో చిత్తుగా ఓడించారు.

ఆర్ఆర్ఆర్ అనే రఘురామరాజు ఇప్పటికే జగన్ కు కంటిలో నలుసులా తయారయ్యారు. కానీ ఆయన సంగతి, మంచి చెడ్డ తెలుసుకాబట్టి క్షత్రియులు ఆ సంగతి పట్టించుకోలేదు. కానీ అశోక్ సంగతి అలా కాదు. పూసపాటి వంశీయులు అంటే క్షత్రియులు అందరికీ ఓ గౌరవం వుంది. వెల్లంపల్లి చేసిన అనాలోచిత వ్యాఖ్యల వల్ల వారంతా జగన్ కు దూరంగా జరిగే ప్రమాదం వుంది. 

అసలు దేవాదాయ శాఖ మంత్రిగా, ఓ స్వామీజీ చెప్పినట్లు ఆడుతూ వెల్లంపల్లి తప్పులు మీద తప్పులు చేస్తున్నారు. సంచయితను తీసుకువచ్చి మాన్సాస్ పగ్గాలు, సింహాచలం దేవస్థాన అధికారం అప్పగించడమే పెద్ద తప్పు. 

తన తల్లి తన తండ్రిని వదిలేసిన తరువాత, చిన్ననాడే ఈ ప్రాంతం వదిలి వెళ్లిపోయి, మరో వ్యక్తిని తండ్రిగా అంగీకరించిన, అంతంత మాత్రం అనుభవం వున్న అమ్మాయిని తీసుకువచ్చి, దశాబ్దాల చరిత్ర వున్న మాన్సాస్ ను చేతిలో పెట్టడం అంటే ఏమనుకోవాలి? పోనీ అలా అప్పగించిన తరువాత ఏం నిర్ణయాలు తీసుకుంటోందో? అవి మంచివో, చెడ్డవో గమనించాల్సిన బాధ్యత లేదా?

కేవలం వ్యక్తిగత వైరంతో పూసపాటి రాజకుటుంబీకులను అవమానాల పాలు చేస్తుంటే జనం గమనిస్తున్నారన్న ఇంగితం కూడా లేకపోతే ఎలా? దేవాదాయ శాఖ మంత్రిగా ఓ స్వామీజీ ముందు మోకరిల్లితే చాలు, తమ పదవి పదిలం అనుకుంటే ఎలా? కేవలం ఓ మంత్రి అనుభవ రాహిత్యం, అజ్ఞానం కారణంగా ఓ వర్గం మొత్తం తనకు తన పార్టీకి దూరమైపోతోందని సిఎమ్ జగన్ గమనించాల్సి వుంది. 

అలా గమనిస్తే చాలదు, కనీసపు క్షమాపణ అయినా చెప్పించి పరిస్థితి కాపాడాలి లేదా, కొత్త దేవాదాయ శాఖ మంత్రిని అన్నా చూడాలి. అంతకు మించి హద్దులు మీరుతున్న స్వామీజీ వ్యవహారాలకు అడ్డుకట్ట వేయాల్సి వుంది లేదూ అంటే జగన్, ఆయన పార్టీ అందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంది. 

ప‌వ‌న్ పిలిచి సినిమా చేయ‌మ‌న్నారు

రాజకీయ కామెడీ స్టార్ గా పవన్ కళ్యాణ్

 


×