దేశంలో గత కొన్నేళ్లుగా హైలెట్ అవుతున్న కొన్ని కుంభకోణాల వ్యవహారాల్లో సినిమా వాళ్ల పేర్లు ఒక లీలగా అయినా వినిపించడం రివాజుగా మారింది. ప్రత్యేకించి మోసాలు చేసి డబ్బులు సంపాదించే వాళ్లు, డ్రగ్స్ అమ్మే వాళ్లు, ఆ పై కేసినోల నిర్వహణ వంటి వ్యవహారాలతో దొరికిపోయి.. వార్తల్లో నిలుస్తున్న వారికీ సినిమా వాళ్లకూ ఏదో ఒక లింకు అయితే దొరుకుతూనే ఉంది పోలీసులకు, విచారణ సంస్థలకు!
తాజాగా తెలుగు రాష్ట్రాల్లో క్యాసినో నిర్వహణ వ్యవహారంతో వార్తల్లోకి ఎక్కిన చికోటి ప్రవీణ్ కూడా పలువురు సినీ తారలతో సన్నిహిత సంబంధాలు మెయింటెయిన్ చేశారనే మాట వినిపిస్తూ ఉంది. తన క్యాసినో నిర్వహణ వ్యాపారానికి ప్రచారం పొందేందుకు పలువురు సినిమా వాళ్లను ఉపయోగించుకున్నాడని, దానికి గానూ వారికి భారీగా డబ్బులు కూడా ఇచ్చాడని విచారణలో తేలుతుతోందట. సినిమా వాళ్లు ఏదో అమాయకంగా ఇతడి ఉచ్చులో పడలేదు. వారికి భారీ స్థాయి రెమ్యూనిరేషన్లు చెల్లించి ఇతడు వారిని బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకున్నాడనేది టాక్. అయితే సదరు తారలు పబ్లిక్ గా ఈ వ్యవహారాన్ని ప్రమోట్ చేయలేదని అనుకోవాలి. మరి అంతర్గతంగా వారు ఎలా ఈ వ్యవహారాన్ని ప్రమోట్ చేశారనేది విచారణ సంస్థలే చెప్పాలి!
ఒక హీరోయిన్ కు అయితే చికోటి ప్రవీణ్ నుంచి నలభై లక్షల రూపాయల వరకూ అందాయట. మరి కొందరు కూడా ఈ జాబితాలో ఉన్నారట. ఇటీవలే కాన్ మన్ సుఖేష్ చంద్రశేఖరన్ వ్యవహారంలో కూడా పలువురు నటీమణుల పేర్లు వినిపించాయి. అతడి చేత కాస్ట్లీ గిఫ్ట్ లు పొందింది బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్. ఈ వ్యవహారంలో ఆమెకు సంబంధించి కోట్ల రూపాయల మొత్తాలను ఈడీ అటాచ్ చేసింది. ఇక పరారీలో ఉన్న లలిత్ మోడీతో డేటింగ్ అంటూ సుస్మితా సేన్ వార్తల్లోకి ఎక్కింది. ఈ విషయంలో సుస్మిత తనపై వస్తున్న విమర్శలను ఖాతరు చేయడం లేదు. లలిత్ మోడీ వద్ద ఉన్న డబ్బుకు ఆశపడి ఆమె అతడితో డేటింగ్ చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. అయితే ఆమె అలాంటిది కాదని ఆమె మాజీ ప్రియులు అంటున్నారు. ఆమె వ్యక్తిత్వం ఎలాంటిది అయినా.. లలిత్ మోడీలో ఆమె ఏం చూసి అతడితో ప్రేమలో ఉన్నా.. దేశ జనులు హేట్ చేస్తున్న వ్యక్తితో బంధం ఎంత వరకూ.. సబబు? అనేది సుస్మిత సొంతంగా ఆలోచించుకోవాల్సిన అంశం!
ఇప్పటికే సినిమా వాళ్లు తొక్కని అడుసు అంటూ లేకుండా పోయింది. ఈ మధ్యనే డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ ను కూడా కుదిపేసింది. ఆ మధ్య విదేశాలకు హీరోయిన్లను తరలించి.. అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నారనే అభియోగాలు కూడా టాలీవుడ్ పై గట్టిగా వచ్చాయి. వ్యభిచారం, డ్రగ్స్, క్యాసినోలు.. ఇలా ప్రతి అంశంలోనూ ఎవరో కొందరి టాలీవుడ్ వాళ్ల పేర్లు ప్రచారం రావడం రొటీన్ గా మారింది. అంతే కాదు.. చికోటి ప్రవీణ్ కు క్యాసినోల విషయంలో ఖాతాదారులుగా కూడా కొంతమంది టాలీవుడ్ స్టార్లు, సినీ జనాలు ఉన్నారనేది గట్టిగా వినిపిస్తున్న మాట!
విదేశాలకు అతడు తీసుకెళ్లే బ్యాచ్ లలో సినిమా వాళ్లకు కూడా స్థానం ఉందట. ఇలా ఈ సూత్రధారితో సినిమా వాళ్ల సంబంధాలు రకరకాలుగా ఉన్నాయని ప్రాథమిక విచారణ వివరాల ద్వారా తెలుస్తోంది. అయితే ఇక్కడే గమనించాల్సిన అంశం ఏమిటంటే.. ఏ వ్యవహారంలో అయినా సినిమా వాళ్ల పేర్లు మొదట్లో గట్టిగా వినిపించాయంటే ఆ తర్వాత ఆ వ్యవహారం అంత తేలిక అవుతుందనేది ఇప్పటి వరకూ అర్థం చేసుకోగల విషయం. ఏదైనా చీకటి వ్యవహారంలో సినిమా తారల పేర్లు వినిపిస్తే.. ఆ వ్యవహారం క్రమంగా డైల్యూట్ అవుతుంది. మొదట్లో ఉండే హడావుడి ఆ తర్వాత రోజులు గడిచే కొద్దీ ఉండదు! ఇక్కడ ఒక భాష సినీ జనాలను నిందించడం కూడా లేదు. డబ్బు , గ్లామర్ పోగయ్యే ప్రతి చోటా ఇలాంటి పరిస్థితే ఉండవచ్చు.
బాలీవుడ్ జనాలకూ వివాదాలు కొత్త కాదు. అక్కడ కూడా ఆయుధాలు, డ్రగ్స్ వ్యవహారాలు, ఇంకా దూకుడైన ప్రవర్తన వంటి వ్యవహారాలతో సినిమా తారల పేర్లు తరచూ వినిపిస్తూ ఉంటాయి. ఒక మలయాళీ స్టార్ హీరో దిలీప్ పై అంతకన్నా తీవ్ర అభియోగాలు వచ్చాయి. ఒక మలయాళీ నటి మీద అత్యాచారయత్నం చేయించడం, ఆమెపై దాడి చేయించేందుకు కూడా అతడు వ్యూహకర్తగా నిలిచాడనే కేసులు నమోదయ్యాయి. ఆ వ్యవహారంలో దిలీప్ నెలల పాటు జైల్లో ఉండి వచ్చాడు. ఇప్పుడేమో సినిమాలు చేసుకుంటూ ఉన్నాడు. ఆ కేసు విచారణ కొనసాగుతూ ఉంది.
ఇలాంటి వివాదాలను సినిమా పెద్దమనుషుల వద్ద ప్రస్తావిస్తే.. అలాంటి వివాదాలు ఎక్కడైనా ఉంటాయని, అయితే తమ వివాదాలే పెద్దవి అవుతాయంటారు. అయితే మీ టూ తో సహా.. గత దశాబ్దకాలంటో భారతీయ సినిమా వాళ్ల చుట్టూ మూగిన వివాదాలు అన్నీ ఇన్నీ కావనేది మాత్రం సత్యం. వీటి వల్ల గ్లామరస్ ఇండస్ట్రీ ప్రజల దృష్టిలో ఎప్పటికప్పుడు పలుచన అవుతూ ఉంటుంది కూడా!