స్వాములకు కాదు ఆ సంగతి నేతలకు చెప్పాలి!

‘మతం ఒక మత్తుమందు’ అనే నినాదం దశ దాటి.. మతం అనేది ఒక ఉన్మాదం స్థాయికి  చేరుకున్న వాతావరణం ఇవాళ ఉంది. మతం ఆధారంగా ఎన్నెన్ని రకాల విషప్రచారాలు నడుస్తున్నాయో.. సమాజంలో ప్రతి ఒక్కరూ..…

‘మతం ఒక మత్తుమందు’ అనే నినాదం దశ దాటి.. మతం అనేది ఒక ఉన్మాదం స్థాయికి  చేరుకున్న వాతావరణం ఇవాళ ఉంది. మతం ఆధారంగా ఎన్నెన్ని రకాల విషప్రచారాలు నడుస్తున్నాయో.. సమాజంలో ప్రతి ఒక్కరూ.. ఇతర మతానికి చెందిన ప్రతి ఒక్కరినీ ద్వేష భావంతోచూసే దుస్థితి ఎలా ఏర్పడుతున్నదో సమాజం గమనిస్తూనే ఉంది. 

అబద్ధాలు, కల్పిత విషయాలను రకరకాల రూపాల్లో ప్రచారం లో పెడుతూ.. కొన్ని మతాలకు వ్యతిరేకగా ప్రజలందరిలో ద్వేషం పుట్టేలా జరిగే ప్రచారాలు మితి మీరుతున్నాయి. సోషల్ మీడియా ఇందుకు ప్రధానంగా ఉపయోగపడుతోంది. ఇలాంటి విషపూరిత ప్రచారాలు.. యావత్ సమాజపు సౌహార్ద ముఖచిత్రాన్ని ఛిద్రం చేసేసే పరిస్థితి ఏర్పడుతోంది. 

ఈ నేపథ్యంలో.. ప్రజల మధ్య విద్వేషాన్ని పెంచుతున్న రాడికల్ శక్తులను కట్టడి చేసేందుకు మతగురువులు, వివిధ మతాల పెద్దలు చొరవ తీసుకోవాలని అజిత్ ధోవల్ అన్నారు. ధోవల్ అంటే.. జాతీయ భద్రత సలహాదారు. దేశరక్షణకు సంబంధించిన అనేకానేక కీలక వ్యవహారాల్లో ప్రధాని మోదీ నిర్ణయాల వెనుక కీలకంగా ఉండే వ్యూహకర్త. వెలుపలినుంచి దేశానికి వాటిల్లగల భద్రత పరమైన ప్రమాదాలను అరికట్టడంలో ఉద్ధండుడిగా గుర్తింపు ఉన్నారు. 

అలాంటి అజిత్ ధోవల్.. దేశ అంతర్గత భద్రతకు పెనుముప్పుగా మారుతున్న మతప్రాతిపదికగా సాగే విషప్రచారాల గురించి గొంతెత్తడం ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం. దేశ అంతర్గత భద్రత అనేది కేవలం ఉగ్రవాదుల నుంచి మాత్రమే ఉండదు. ప్రతి మనిషినీ రెండో మనిషి అనుమానంగా చూడడం దగ్గరే మొదలవుతుంది. మనుషులు వేర్వేరు మతాలకు చెందిన వారు అయినంత మాత్రాన.. వారి మధ్య స్నేహబంధాలు పూర్తిగా లేకుండా పోవడం దగ్గరే మొదలవుతుంది. కానీ.. ఇలాంటి విషప్రచారాలను కట్టడి చేయడం గురించి.. మత గురువులకు విన్నవిస్తే, సూచిస్తే సరిపోతుందా. అసలు ఈ విషం మొదలవుతున్నది ఎక్కడో గుర్తించాల్సిన అవసరం లేదా?

ఇతర మతాలను ద్వేషించడం అనేది ఇవాళ్టి రోజుల్లో మత గురువులకంటె.. రాజకీయ నాయకులకే ఎక్కువ అవసరం. రాజకీయం – మతం రెండూ మన దేశంలో పెనవేసుకుపోయాయి. మతం ఆధారంగానే రాజకీయం నడుస్తోంది. మతాల మధ్య అడ్డుగోడలు కట్టడంలోనే రాజకీయాలు మనుగడ సాగిస్తున్నాయి. కాబట్టి.. మతాలకు అనుకూలంగానే, అసహ్యించుకునేలాగానో విషప్రచారాలను పుట్టిస్తున్నది కూడా రాజకీయ నాయకులు, వారి అనుచరులే! ఈ సంగతి భద్రత వ్యవహారాల విషయంలో అంత మేధావి అయిన అజిత్ ధోవల్ కు తెలియదా? 

సాక్షాత్తూ.. ఆయన ఏ మోడీ ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారో.. అదే మోడీ అభిమాన గణాలు.. మతాల మీద ఎంతటి విద్వేషాన్ని, విషాన్ని ప్రచారం చేస్తున్నాయో ధోవల్ గుర్తించలేకపోతున్నారా? ప్రజల నడుమ శత్రుత్వం పెంచే విషప్రచారాలను కట్టడి చేయడానికి పూనుకోమని ధోవల్ రాజకీయనాయకులకే హితవు చెప్పాలి. అక్కడ ప్రారంభిస్తేనే.. ఈ యజ్ఞానికి ఫలితం ఉంటుంది.