అల్ ప‌చీనో న‌ట విశ్వ‌రూపం.. ‘సెంట్ ఆఫ్ ఏ ఉమ‌న్’

ఒక అంధుడిని సూప‌ర్ మ్యాన్ త‌ర‌హాలో చూపించే క‌థ‌లు టాలీవుడ్ లో ఈ మ‌ధ్య‌కాలంలో వ‌చ్చాయి. అయితే మ‌నోళ్లు ఏది చేసినా అతిగానే ఉంటుంది కాబ‌ట్టి.. అంధుడి పాత్ర‌తో చేయించే ఫీట్లు కూడా అసాధ్యం…

ఒక అంధుడిని సూప‌ర్ మ్యాన్ త‌ర‌హాలో చూపించే క‌థ‌లు టాలీవుడ్ లో ఈ మ‌ధ్య‌కాలంలో వ‌చ్చాయి. అయితే మ‌నోళ్లు ఏది చేసినా అతిగానే ఉంటుంది కాబ‌ట్టి.. అంధుడి పాత్ర‌తో చేయించే ఫీట్లు కూడా అసాధ్యం అనే రీతిలోనే ఉంటాయి. తెలుగు సినిమాల్లో హీరో అంధుడు అయిన‌ప్ప‌టికీ, అత‌డికి క‌ళ్లుండ‌వు త‌ప్ప అన్నీ రొటీన్ గానే ఉంటాయి! పాడే పాట‌లు, చేసే ఫైట్లు, ప‌రిష్క‌రించే స‌మ‌స్య‌లు అన్నీ రొటీనే. అత‌డికి క‌ళ్లు లేక‌పోవ‌డ‌మే వెరైటీ!

అయితే ఈ వెరైటీ ఎలిమెంట్ ను వాస్త‌విక‌త‌కు ద‌గ్గ‌ర‌గా ట‌చ్ చేస్తే? అలాంటి ప్ర‌య‌త్నాలూ  బోలెడ‌న్ని జ‌రిగాయి. క‌మ‌ల్ హాస‌న్ అప్పుడెప్పుడో 'అమావాస్య చంద్రుడు' అంటూ ఒక సినిమా తీశాడు. అందులో అంధ హీరోపై సానుభూతి పాళ్లే ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. హీరోయిన్ కూడా సానుభూతితో మొద‌లుపెట్టి అత‌డిపై ప్రేమ‌ను పెంచుకుంటుంది. ఆ సినిమా పై జ‌నాలు మాత్రం సానుభూతి చూప‌లేదు. 'అమావాస్య చంద్రుడి'కి నిర్మాత కూడా అయిన క‌మ‌ల్ ఆ అప్పుల‌ను తీర్చుకోవ‌డానికి ఏడెనిమిదేళ్లు ప‌ట్టింద‌ట‌!

ఇక మ‌ల‌యాళీలు అస‌లే విషాదంలాంటి అంధుడి జీవితాన్ని మ‌రింత విషాదంగా మార్చి ఒక సినిమా తీశారు. క‌ళా భ‌వ‌న్ మ‌ణి అంధుడిగా జీవించిన ఆ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేశారు. విషాదం పాళ్లు ఎక్కువ‌వ్వ‌డం తెలుగు వాళ్ల‌కు ఎక్క‌లేదు.

ఇక అంధుడులోని క‌ళాకార ప్ర‌తిభ‌ను 'సిరివెన్నెల‌'గా వ‌ర్షింప‌జేశారు. ప్ర‌శంస‌లు అందుకున్న సినిమా ఇది. ఇలా అంధుడి పాత్ర‌తో భార‌తీయ సినిమా వాళ్ల ప్ర‌యోగాలు ఇలా ఉన్న కాలంలోనే.. హాలీవుడ్ లోనూ ప్ర‌ధాన పాత్రను అంధుడిగా ప్ర‌జెంట్ చేస్తూ.. గొప్ప సినిమా వ‌చ్చింది. అదే 'సెంట్ ఆఫ్ ఏ ఉమెన్'

ఇందులో హీరో త‌న‌పై సానుభూతిని ఆశించ‌ని టాలీవుడ్ హీరో టైపు కాదు, అలాగ‌ని క‌ళ్లు లేవ‌నే అంతులేని విషాదాన్ని మోసే వాడూ కాదు, ఏదో అత్యున్న‌త వ్య‌క్తిత్వ‌మో, గొప్ప క‌ళాకారుడో కాదు.. జ‌స్ట్ ఒక సాధార‌ణ మ‌నిషి. మిల‌ట‌రీలో ప‌ని చేసి క‌ళ్లు పోవ‌డంతో రిటైరైన వ్య‌క్తి. భార్య కూడా మ‌ర‌ణించింది. 

అత‌డికి అన్ని ఉద్వేగాలూ ఉంటాయి. క‌ళ్లు లేవ‌నే ఫ్ర‌స్ట్రేష‌న్ ఉంటుంది. ఆ ఫ్ర‌ష్ట్రేష‌న్ ను పంటి బిగువ‌న భ‌రించే టైపు కాదు. చూడ‌టం మానేసిన‌ప్పుడే జీవించ‌డం ఆగిపోయిన‌ట్టు అని ఒక స‌గ‌టు అంధుడి బాధ‌ను త‌న కేర్ టేక‌ర్ తో పంచుకునేంత సాధార‌ణ హీరో అత‌డు!

చూపు లేక‌పోవ‌డం, వ‌య‌సు మీద ప‌డుతూ ఉండ‌టం, అయిన వాళ్ల ఆద‌ర‌ణ‌కు నోచుకోక‌పోవ‌డం గురించి బాధ‌నంతా వెల్ల‌గ‌క్కుతాడు. అయితే ఆ బాధ‌ను పంచుకునే త‌త్వం కూడా హీరోయిక్ గా ఉంటుంది. క‌ళ్లు లేనంత మాత్రాన హీరోకి కాంక్ష ఉండ‌కుండా పోదు. చూడలేక‌పోయినా స్త్రీ ప‌ట్ల ఆక‌ర్ష‌ణ పోదు! స్త్రీ అందాన్ని క‌ళ్ల‌తో చూడ‌లేక‌పోతున్నా.. త‌ను సాన్నిహిత్యంగా గ‌డిపిన స్త్రీల అందం గురించి వ‌ర్ణిస్తాడు. మ‌రిచిపోలేని అందాల‌ను స్మ‌రిస్తాడు. 

ఎదురైన అమెరిక‌న్ స్త్రీలు కొట్టుకువ‌చ్చిన సెంట్ సుగంధాన్ని బ‌ట్టి వాటి బ్రాండ్ల‌ను ఇట్టే చెప్పేయ‌గ‌ల కొంటెత‌నం అత‌డి సొంతం. స్మెల్ ను బ‌ట్టి సెంట్ బ్రాండ్ ను చెప్పేస్తూ.. ఆ అంధుడు ఆడ‌వాళ్ల‌ను క‌ట్టి ప‌డేస్తాడు. వాళ్ల‌తో టాంగో డ్యాన్స్ చేయ‌గ‌ల‌డు, త‌న వాక్చాతుర్యంతో స్త్రీని క‌ట్టి ప‌డేయ‌గ‌ల‌డు. ఈ అహ్లాద‌క‌ర‌మైన క్యారెక్ట‌ర్ డిజైన్ తో.. ఆల్ పచీనో న‌ట విన్యాసంగా సాగుతుంది 'సెంట్ ఆఫ్ ఏ ఉమ‌న్' సినిమా.
 
అప్ప‌టి వ‌ర‌కూ తెర‌పై క‌నిపించ‌ని రీతిలో ఒక అంధుడి పాత్ర‌ను డిజైన్ చేయ‌డం ఈ సినిమాకు సంబంధించి గొప్ప స‌ర్ ప్రైజ్ అయితే, ఆ పాత్ర‌ను ప‌చీనో పండించిన తీరు  గురించి ఎంత చెప్పినా త‌క్కువే! త‌న కంఠ‌స్వ‌రం, త‌న న‌ట‌న‌తో ప‌చీనో ఈ సినిమాను ఒక మర‌పురానిది గా మార్చాడు. 

అప్ప‌టికే ద‌శాబ్దాల‌కు పూర్వం గాడ్ ఫాద‌ర్ రెండు వెర్ష‌న్ల‌తో ప్ర‌పంచాన్ని క‌ట్టి ప‌డేసినా త‌న‌కు ద‌క్క‌ని ఆస్కార్ అవార్డును ఈ న‌టుడు సెంట్ ఆఫ్ ఏ ఉమ‌న్ తో సొంతం చేసుకున్నాడు. పచీనోకు ఆస్కార్ అవార్డును సంపాదించి పెట్టిన సినిమాగా కూడా ఇది శాశ్వ‌త ప్ర‌త్యేక‌త‌ను క‌లిగి ఉంటుంది.

ఒక టీనేజ్ కుర్రాడు(చార్లెస్) కాలేజీలో ఒక సంక‌ట ప‌రిస్థితిని ఎదుర్కొన‌డంతో సినిమా ప్రారంభం అవుతుంది. త‌ల్లిదండ్రులు విడాకులు తీసుకోవ‌డంతో, త‌న త‌ల్లి వేరే వ్య‌క్తిని పెళ్లి చేసుకోవ‌డంతో.. వారి ప‌రిమిత ఆద‌ర‌ణ‌తో స్కాల‌ర్ షిప్ సాయంతో ఒక  ప్ర‌ముఖ స్కూళ్లో చ‌దువుకునే ఆ కుర్రాడి క‌థ‌తో ఈ సినిమా మొద‌ల‌వుతుంది. 

స్కూళ్లో కొంత‌మంది ఆక‌తాయి కుర్రాళ్లు ఉంటారు. వారు ధ‌నిక కుటుంబాల‌కు చెందిన వారు. స్కూల్ డీన్ పై ఆ ఆక‌తాయిల‌కు కోప‌మొస్తుంది. త‌మ క‌సి తీర్చుకోవ‌డానికి వాళ్లు అత‌డిని క్యాంప‌స్ లోనే దారుణంగా అవ‌మానిస్తారు. ఒక బెలూన్ లో పెయింట్ పోసి అది స‌రిగ్గా డీన్ మీద ప‌డేలా ఏర్పాట్లు చేస్తారు. ముందు రోజు రాత్రే అందుకు ఏర్పాట్లు చేసి ఉంటారు. వారాప‌ని చేసేటప్పుడు అమాయ‌క చార్లెస్ దాన్ని చూసి ఉంటాడు.

ఆ ప‌ని చేసింది ఎవ‌రో డీన్ కు కూడా తెలుసు. అయితే వారిని కాలేజ్ నుంచి పంపాలంటే త‌గిన సాక్ష్యం అవ‌స‌రం. ఆ సాక్షి ఈ చార్లెస్ మాత్ర‌మే. ఇతడు సాక్ష్యం చెబితేనే డీన్ చ‌ర్య‌లు తీసుకోగ‌ల‌డు. ఆక‌తాయి కుర్రాళ్లు ఈ పిల్లాడిని బెదిరిస్తారు. డీన్ ఏమో త‌న‌కు అనుకూలంగా సాక్ష్యం చెబితే.. పెద్ద యూనివ‌ర్సిటీకి రెక‌మెండ్ చేస్తానంటూ ఆఫ‌ర్ ఇస్తాడు. చూసింది చెప్ప‌క‌పోతే  కాలేజీ నుంచి కూడా స‌స్పెండ్ చేస్తానంటూ బెదిరిస్తాడు.

జ‌రిగిన ఘ‌ట‌న‌పై క‌మిటీ వేసి విచార‌ణ‌కు ఒక ముహూర్తాన్ని ప్ర‌క‌టిస్తాడు డీన్.  అంత‌క‌న్నా ముందు వీకెండ్ జాబ్ గా ఆ స‌మీపంలోనే నివ‌సించే అంధ క‌ల్నల్ ఫ్లాంక్ స్లేడ్ (పచీనో) కేర్ టేకింగ్ బాధ్య‌త‌లు తీసుకుంటాడు కుర్రాడు. ఆ స్లేడ్ ఒక‌ మాజీ మిల‌ట‌రీ ఆఫీస‌ర్. యుద్ధ స‌మ‌యంలో క‌ళ్లు పోయి ఉంటాయి. 

అస‌లే మిల‌ట‌రీ మ‌నిషి, ఆ పై అస‌హాయుడు అయ్యే స‌రికి తీవ్ర‌మైన అస‌హ‌నంతో ఉంటాడు. అత‌డి కూతురు త‌న‌ బాధ్య‌త‌లు చూసుకుంటూ ఉంటుంది. ఆమె త‌న భ‌ర్త‌తో స‌హా ఎక్క‌డికో వెళ్లాల్సి వ‌స్తే.. వారాంతంలో ఈ కుర్రాడికి ఆయ‌న బాధ్య‌త‌ల‌ను చూసుకుంటే 300 డాల‌ర్ల జీతం ఇస్తానంటుంది. క‌ష్ట‌మే అయినా పండ‌గ‌కు ఊరెళ్ల‌డానికి టికెట్ కు ఆ డ‌బ్బు ప‌నికొస్తుంద‌ని చార్లెస్ అందుకు ఒప్పుకుంటాడు.

కూతురు ఇంటి నుంచి వెళ్ల‌గానే.. కుర్రాడిని తీసుకుని న్యూయార్క్ సిటీ టూర్ కు వెళ్తాడు స్లేడ్. ఈ ప్ల‌జ‌ర్ టూర్ లో ఆ అంధుడు, ఈ కుర్రాడు ఒక‌రికొక‌రు అర్థం అవుతారు.  కుర్రాడు సొంత క‌ష్టంతో చ‌‌దువుకుంటున్న తీరును చూసి అభినందిస్తాడు అంధుడు. త‌న బాధ‌ల‌ను చెప్పుకుంటాడు. అనేక మంది నిరాద‌ర‌ణ‌కు అత‌డు గురి అవుతుండ‌టాన్ని కుర్రాడు అర్థం చేసుకుంటాడు. పెరారీ న‌డపాల‌న్న స్లేడ్ కోరిక‌ను కుర్రాడు తీరుస్తాడు. 

ఈ టూర్ ముగించుకునే స‌మ‌యానికి ఆ కుర్రాడిని అడాప్ట్ చేసుకోలేనంత‌గా ద‌గ్గ‌ర‌వుతాడు స్లేడ్. ఒక ద‌శ‌లో ఆత్మ‌హ‌త్య‌కు రెడీ అయిన ఆ అంధ మాజీ మిల‌ట‌రీ అధికారి కుర్రాడు ఇచ్చిన స్ఫూర్తితో ఎంతో మార‌తాడు.  ఆ మధ్య వ‌య‌స్కుడిలో బ‌త‌కాలి అనే కాంక్ష‌ను రేకెత్తించ‌గ‌లుగుతాడు ఈ టీనేజ‌ర్. అలా వారి మ‌ధ్య‌న మ‌రింత సాన్నిహిత్యం ఏర్ప‌డుతుంది. అయితే కుర్రాడికి అస‌లు స‌మ‌స్య కాలేజ్ లో ఉంది.

అక్క‌డ విడవ‌‌మంటే పాముకు కోపం, క‌ర‌వ‌మంటే క‌ప్ప‌కు కోపం. డీన్ కు అనుకూలంగా సాక్ష్యం చెబితే.. ఆ కుర్రాళ్లు ఏదైనా చేయ‌గ‌ల‌రు, అలాగ‌ని డీన్ కు వ్య‌తిరే‌కంగా సాక్ష్యం చెబితే.. అత‌డు కాలేజీ నుంచి స‌స్పెండ్ చేస్తారు, బ‌లం క‌లిగిన రెండు వ‌ర్గాలు త‌న‌కేమాత్రం ప్ర‌మేయం లేని అంశంలో ఒక బ‌లహీనుడిని న‌లిపేస్తారు. ఆ ఘ‌ట‌న‌కు సంబంధించి క‌మిటీ మీటింగ్ స‌మ‌యానికి ఆ టూర్ ముగించుకుని కాలేజ్ ద‌గ్గ‌ర దిగుతాడు చార్లెస్.

ఆ స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రించుకోవాలో అర్థం కాని ఆ కుర్రాడు మీటింగ్ హాల్ కు వెళ్లాకా..అక్క‌డ‌కు అనూహ్యంగా స్లేడ్ రంగ‌ప్ర‌వేశం చేస్తాడు. కుర్రాడితో ఆడుకుంటున్న అటు డీన్ కు, ఇటు ఆక‌తాయిల‌కు త‌గిన రీతిలో బుద్ధి చెబుతాడు. త‌న వాగ్ధాటితో.. కాలేజ్ స్టూడెంట్స్ ను ఆక‌ట్టుకుంటాడు. అక్క‌డో లేడీ హిస్ట‌రీ లెక్చ‌ర‌ర్ ఈ అంధ మేజ‌ర్ మాట‌ల‌కు మెస్మ‌రైజ్ అవుతుంది.

ఆమె అత‌డి ద‌గ్గ‌ర‌కు రాగానే.. ఆమె కొట్టిన సెంట్ పేరు చెప్పి.. మ‌రింత ఆక‌ట్టుకుంటాడు. పొలిటిక‌ల్ సైన్స్ గురించి ఆమెను డిస్క‌స్ చేయ‌డానికి కొంటెగా పిలిచి ఇంటి దారి ప‌డ‌తాడు స్లేడ్! అలా అంధుడి జీవితంలో ఒక ఆశాభావ ధోర‌ణితో సినిమా ముగుస్తుంది.

స్త్రీ వాడే సెంట్ ఎంత గుభాలించి, ఎంత గుర్తుండిపోతుందో.. ఈ సినిమా కూడా ప‌చినో న‌ట ప్ర‌ద‌ర్శ‌న‌తో, అంత‌టి ఆక‌ర్ష‌ణగా గుర్తుండి పోతుంది!

-జీవ‌న్ రెడ్డి.బి