సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావుపై ఎవరు చేస్తున్నారో గానీ, పదేపదే ఆయన మరణించారంటూ సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ వార్తల్ని నమ్మి ఆయన ఇంటికి అభిమానులు ఫోన్లు చేస్తున్నారు. అలాగే తాజాగా ఆయన మరణవార్త నిజమని నమ్మి ఏకంగా 10 మంది పోలీసులు కోటా శ్రీనివాసరావు ఇంటి వద్దకు భద్రత కల్పించేందుకు వెళ్లడం గమనార్హం. తాను మరణించినట్టు వస్తున్న వార్తలపై కోటా తీవ్ర ఆవేదనతో ఖండించారు. ఈ సందర్భంగా తనపై తప్పుడు వార్తలు ప్రస్తారం చేస్తున్న వ్యక్తులపై మండిపడ్డారు.
కావాలనే ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఉగాది పండుగ ఏర్పాట్లలో ఉన్నట్టు ఆయన తెలిపారు. తన మరణ వార్తల్ని నమ్మి, చాలా ఫోన్ కాల్స్ వచ్చాయని, ఇది తనకు ఎంతో వేదన కలిగిస్తోందన్నారు.
ఇలాంటి వార్తల్ని విని కొంచెం పెద్ద వాళ్లైంటే గుండె ఆగి చనిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరణ వార్త నిజమని నమ్మిన పోలీసులు భద్రత కల్పించేందుకు ఇంటి వద్దకు పది మంది పోలీసులు కూడా వచ్చారని కోటా తీవ్ర బాధను వ్యక్తం చేశారు.
జీవితాలతో ఆడుకోవడం దారుణమన్నారు. ఇలాంటి అవాంఛనీయ చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని ప్రజానీకానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంకెప్పుడూ ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మొద్దని కోటా వేడుకున్నారు. కోటా శ్రీనివాసరావుకు సంబంధించి మరణవార్తల్ని అనేక సందర్భాల్లో ఇలాగే ప్రచారం చేయడం తెలిసిందే. జీవించిన సీనియర్ నటుడిపై ఇలాంటి వార్తలు రావడంపై అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోటాపై పదేపదే మరణవార్తలు రావడంపై కొందరు ఎందుకిలా? అని ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు.