Advertisement

Advertisement


Home > Politics - Analysis

సింహం, సింగిల్... డైలాగ్స్ అవసరమా?

సింహం, సింగిల్... డైలాగ్స్ అవసరమా?

రాజ‌కీయాల్లో అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టు న‌డుచుకోవాల్సి వుంటుంది. మ‌డిక‌ట్టుకుని కూచున్న వాళ్లు న‌ష్ట‌పోవడంతో పోటు స‌హ‌జంగానే ప్ర‌త్య‌ర్థులు లాభ‌ప‌డుతుంటారు. సీరియ‌స్ రాజ‌కీయాలు చేసే వాళ్లు ఈ విషయాల్ని అర్థం చేసుకోవాల్సి వుంటుంది. రాజ‌కీయాల్లో ఈ రోజు ఉన్న ప‌రిస్థితులు రేపు కూడా ఉంటాయ‌ని అనుకోవ‌డం అజ్ఞానం త‌ప్ప మ‌రొక‌టి కాదు. 

ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో అధికార ప‌క్షం త‌ర‌చూ సింహం సింగిల్‌గానే వ‌స్తుంద‌ని చెబుతుంటుంది. డైలాగ్ చెప్పుకోడానికి అద్భుతంగా వుంది. కానీ ఇదేమీ సినిమా కాదు. పాలిటిక్స్ అంటే అంద‌రినీ కలుపుకునే ప్ర‌య‌త్నం నిత్యం జ‌రుగుతూ వుండాలి. 23 సీట్ల‌కు ప‌డిపోయిన చంద్ర‌బాబు, రేపు రాబోయేది త‌మ ప్ర‌భుత్వ‌మే అనే ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ విష‌య‌మై గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో కేడ‌ర్‌కు అధికారంపై ధీమా, భ‌రోసా ఇవ్వ‌గ‌లి గారు. ఇదంతా అంద‌రినీ క‌లుపుకుని పోవ‌డం వ‌ల్లే సాధ్య‌మైంది. ముఖ్యంగా వామ‌ప‌క్షాల మ‌ద్ద‌తు లేకపోయి వుంటే టీడీపీ మూడు ఎమ్మెల్సీల‌ను గెల‌వ‌డం అసాధ్యం. ఎందుకంటే ప్ర‌తి చోట రెండో ప్రాధాన్య‌త ఓట్లు ద‌క్క‌డం వ‌ల్లే టీడీపీ బ‌య‌ట‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. రాజ‌కీయం అంటే కేవ‌లం ఎన్నిక‌ల్లో పోటీ, అధికారం ద‌క్కించుకోవ‌డ‌మే కాదు.

ఇత‌ర‌త్రా అనేక అంశాలు ముడిప‌డి వుంటాయి. తాజాగా ఏపీలో రాజ‌కీయ ప‌రిస్థితి గ‌మ‌నిస్తే... టీడీపీకి అన్ని వైపుల నుంచి మ‌ద్ద‌తు ఉన్న వాతావ‌ర‌ణం నెల‌కుంది. వీరంతా వైఎస్ జ‌గ‌న్ స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేస్తుండ‌డం వ‌ల్ల ఒక నెగెటివ్ అభిప్రాయాన్ని బ‌లంగా బిల్డ‌ప్ చేసే అవ‌కాశం వుంటుంది. త‌ద్వారా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందుతుంది. అంతే త‌ప్ప ఎన్నిక‌ల్లో పొత్తు పెట్టుకుంటేనే ప్ర‌యోజ‌నం వుంటుంద‌ని భావించ‌కూడ‌దు.

ప్ర‌స్తుతం వైఎస్ జ‌గ‌న్ రాజ‌కీయంగా ఒంట‌రి. అధికారంలో ఆయ‌నే ఉండొచ్చు. ఇదేమీ శాశ్వ‌తం కాదు క‌దా! తెలంగాణ‌లో కేసీఆర్ బీజేపీకి వ్య‌తిరేకంగా అన్ని ప‌క్షాల‌ను క‌లుపుకుని వెళ్ల‌డాన్ని చూసైనా జ‌గ‌న్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. త‌ద్వారా త‌న ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక వాయిస్‌ను త‌గ్గించుకోవ‌చ్చు. 

కేవ‌లం ఒక మాట ప‌ల‌క‌రింపు, వారు చెప్పేది అభిమానంగా వింటే చాలు చాలా స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంది. అలా కాకుండా రాజ‌కీయంగా ఎవ‌రినో బెదిరించ‌డానికో, ఆడుకోడానికే త‌మ నాయ‌కుడు సింహ‌మ‌ని, సింగిల్‌గానే వ‌స్తుంద‌నే రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌ల‌తో న‌ష్ట‌మే అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

వైఎస్ జ‌గ‌న్ సింహ‌మో, పులో ప్ర‌జ‌లే గుర్తిస్తారు. అందుకు త‌గ్గ‌ట్టు ఆద‌రించ‌డ‌మో, వ్య‌తిరేకించ‌డ‌మే చేస్తారు. సొంత పార్టీ వాళ్లే ప‌దేప‌దే త‌మ నాయకుడు అది, ఇది అని సొంత డ‌బ్బా కొట్టుకుంటే అస‌లుకే ఎస‌రు వ‌స్తుంది. కావున సాధ్య‌మైనంత వ‌ర‌కూ మ‌నుషుల భాష‌ను ప్ర‌యోగిస్తేనే ఏ పార్టీకైనా మంచిది. 

 


  • Advertisement
    
  • Advertisement