యువ నాయకుడు నారా లోకేశ్‌కు గతం తెలియకపోవడం మంచిదవుతోంది. అజ్ఞానానికి మించిన సౌఖ్యం లేదని పెద్దలు ఊరికే చెప్పలేదు. లోకేశ్ అజ్ఞానమే ఆయనకు శ్రీరామ రక్షణవుతోంది. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు ఉద్యమబాట పట్టిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలకు జరుగుతుండగా అంగన్వాడీ కార్యకర్తలు నిరసనకు దిగడంతో పోలీసులు అణచివేత చర్యలు చేపట్టారు. అంగన్వాడీల్లో ప్రభుత్వ వ్యతిరేకతను రాజకీయంగా సొమ్ము చేసుకోవాలని లోకేశ్ ఆత్రుతపడుతున్నారు.
49వ రోజు పాదయాత్ర చేపట్టిన లోకేశ్ కదిరి నియోజకవర్గంలో అంగన్వాడీ కార్యకర్తల ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. అంతేకాదండోయ్, జగన్ సర్కార్ దాష్టీకానికి నిరసనగా నల్లబ్యాడ్జీ ధరించి నిరసన తెలపడం గమనార్హం. జీతాల పెంపు హామీని అమలు చేయాలని కోరితే అరెస్ట్ చేయడం దారుణమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం దిగిపోవడానికి కొన్ని నెలల ముందు… అంగన్వాడీ కార్యకర్తలు సమస్యల పరిష్కారం కోరుతూ చలో విజయవాడకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా అంగన్‌వాడీ మహిళా కార్మికులపై భాష్పవాయువు ప్రయోగం, లాఠీ దెబ్బలు, గుర్రాలతో తొక్కించిన సంగతి తెలిసిందే. ఒకవైపు మహిళల ఒంటిపై బట్టలు ఊడిపోతున్నా పోలీసులకు కర్కశంగా వ్యవహరించిన వైనం ప్రతి ఒక్కరికీ గుర్తు వుంది. అలాగే 2004కు ముందు బాబు హయాంలో హైదరాబాద్‌లో అత్యంత దారుణంగా అంగన్వాడీ కార్యకర్తలపై పోలీసులతో దాడి చేయించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుంది.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం వాళ్ల వేతనాల పెంపుపై సానుకూలంగా స్పందించింది. అందుకు తగ్గ చర్యలు కూడా తీసుకుంది. ఇవేవీ లోకేశ్‌కు తెలియదు పాపం. తాను మంత్రిగా ఉన్న ప్రభుత్వం, అలాగే 20 ఏళ్ల క్రితం చంద్రబాబు సర్కార్ కార్మిక, కర్షక, మహిళల పట్ల ఎంత దారుణంగా వ్యవహరించిందో లోకేశ్ తెలుసుకుంటే మంచిది.
బాబు కుమారుడు అంగన్వాడీ కార్యకర్తలకు మద్దతుగా నల్లబ్యాడ్జీలు ధరించడం విచిత్రంగా వుంది. కాల మహిమ అంటే ఇదే కాబోలు. లోకేశ్‌కు అజ్ఞానమే రాజకీయంగా ఏమైనా మాట్లాడ్డానికి, చేయడానికి పనికొస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.