ఒరిజినల్ వెర్షన్ తీసిన మలయాళీలు ఆ సినిమాను అలా వదిలేశారు కానీ, రీమేక్ లు చేసుకున్న వాళ్లు మాత్రం దాన్ని అరగదీస్తూనే ఉన్నారు. మలయాళంలో మణిచిత్రతాళు పేరుతో రూపొందిన సినిమాను చాలా సంవత్సరాల తర్వాత కన్నడలో రీమేక్ చేశారు. ఆప్తమిత్ర పేరుతో ఆ సినిమా హిట్ కావడంతో, దాన్ని కన్నడలో తీసిన వాసు దర్శకత్వంలో రజనీకాంత్ తమిళ, తెలుగు వెర్షన్లను తీయించాడు. అది సూపర్ హిట్ అయ్యింది.
ఆ తర్వాత కన్నడలో ఆప్తమిత్ర 2 వచ్చింది. వాసునే దర్శకత్వం వహించాడు. ఆ సినిమా విడుదల ముందు విష్ణువర్ధన్ మరణించాడు. సినిమా సూపర్ హిట్ అయ్యింది. దాన్ని రీమేక్ అంటూ కొన్నాళ్ల పాటు రజనీ పేరు వినిపించింది. ఆయన చేయలేదు. దాన్నే వెంకటేష్ హీరోగా తెలుగులో రీమేక్ అయితే చేశారు. అది కాస్తా ఆడలేదు.
ఇక చంద్రముఖి సౌత్ లో హిట్ అయిన తీరుతో హిందీ జనాలు దాన్ని రీమేక్ చేశారు. భూల్ భులయ్యా పేరుతో దశాబ్దంన్నర కిందటే ఆ సినిమా అక్కడ వచ్చింది. అయితే అది సౌత్ లో సాధించినంత విజయాన్ని సాధించలేదు. అయినా.. ఈ మధ్యనే భూల్ భులయ్యా పార్ట్ టూ వచ్చి మంచి హిట్ కొట్టింది! అలా చంద్రముఖి మరో సీక్వెల్ వచ్చింది. దానికీ.. కన్నడ, తెలుగులో తీసిన సీక్వెల్ కూ సంబంధం లేదు!
ఇక ఇప్పుడు తమిళంలో చంద్రముఖి -2 రానే వస్తోంది. వినాయకచవితికి ఆ సినిమాను విడుదల చేయనున్నారట. హారర్ సినిమాలను క్యాష్ చేసుకుంటున్న రాఘవ లారెన్స్ చంద్రముఖి -2కి హీరో. ఇప్పటికే చంద్రముఖి సీక్వెల్స్ అంటూ కన్నడ, తెలుగులో రెండో పార్ట్ తీసిన వాసునే ఇప్పుడు మళ్లీ చంద్రముఖి సీక్వెల్ కు దర్శకత్వం వహిస్తున్నాడు. మరి దాదాపు 18 యేళ్ల కిందట వచ్చిన చంద్రముఖి ఇమేజ్ ను ఈ సినిమా ఏ మేరకు ఓపెనింగ్స్ గా క్యాష్ చేసుకుంటుందో!