'ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తీశాం..' అంటూ పదేళ్ల కిందటి వరకూ దర్శకులు చెప్పేవారు. స్టార్ హీరోల సినిమాలు విడుదలైనప్పుడు ఇది కామన్ స్టేట్ మెంట్. అయితే ఆ తర్వాత దర్శకుల మాట మారింది. 'ఒక ఫ్యాన్ గా మన హీరోని ఎలా చూడాలనుకుంటానో.. అలానే ఈ సినిమా తీశా..' అనడం మొదలైంది! ఇదెప్పుడైతే మొదలైందో.. అప్పటి నుంచి మరీ నాసికరకమైన, లేకి సినిమాలు రావడం తీవ్ర స్థాయికి చేరింది!
దర్శకుడు హీరోకి ఫ్యాన్ కావడం నేరమేమీ కాదు. అయితే … దర్శకుడు హీరో కన్నా, సినిమాకు ఫ్యాన్ అయితే మంచి సినిమాలు వస్తాయి! లేకపోతే.. పరిస్థితి టాలీవుడ్లో వస్తున్న నూటికి 98 శాతం ఫెయిల్యూర్ పెద్ద సినిమాల్లా ఉంటుంది!
ప్రస్తుతం తెరపై ఉన్న బ్రో సినిమా విషయంలో వినిపిస్తున్న మాట.. ఫ్యాన్స్ కోసం పవన్ కల్యాణ్ పాత సినిమా పాటలన్నింటినీ ఇందులో వాడారనేది. మరి ఎలాగూ రీరిలీజ్ లు, తెరలు చింపడం, థియేటర్లు ధ్వంసం చేయడం జరుగుతోంది కదా, ఇక మళ్లీ ఫస్ట్ రిలీజ్ సినిమాలోనూ అదే వ్యథ ఎందుకు? ఇదంతా ఫ్యాన్స్ ను ఆనంద పరచడానికి అనుకుంటే.. సినిమాను కేవలం ఫ్యాన్స్ కోసం తీసినట్టా!
అయితే హీరోలకు ఫ్యాన్స్ అయిపోయి, హీరో ఇమేజ్ ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని, హీరో ఫ్యాన్స్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని సినిమా రచన చేసే రచయితలు, దర్శకులు… తక్షణం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే.. అదెంత పెద్ద హీరో సినిమా అయినా కేవలం ఫ్యాన్స్ చూస్తే హిట్ కాదు. ఫ్యాన్స్ నచ్చితే.. హిట్ అనిపించుకోదు. ఫ్యాన్స్ కోసమే సినిమా అనుకుంటే.. వారి వాటా వసూళ్లు ఏ సినిమా విషయంలో అయినా పదో శాతం కూడా ఉండవు. ఫ్యాన్స్ థియేటర్లో చేసే హంగామా అంతే కామన్ ఆడియన్స్ కు డిస్ట్రబెన్సే తప్ప… వీళ్లు ఏ సినిమానూ హిట్ చేయలేరు.
కాబట్టి.. ఫ్యాన్స్ అనే భ్రమలు వీడి, తాము సినిమా తీస్తున్నాం.. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి అని టాలీవుడ్ దర్శకరత్నాలు, రచయితలు గుర్తించాల్సి ఉంది. ఇలాంటి ఫ్యాన్స్ హంగామా, బిల్డప్పులు, హైప్ అంతా కొన్ని రోజులే. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల పరిస్థితి ఇందుకు తార్కాణం.
లింగా, కబాలి.. వంటి సినిమాలు వచ్చినప్పుడు జరిగిన హడావుడి ఎలాంటిదో ఎవ్వరూ మరిచిపోలేరు. మరి ఇప్పుడూ.. రజనీ సినిమా వస్తోందంటే, పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు. తెలుగునాట అయితే.. లింగా, కబాలి వంటి సినిమాల విడుదల ముందు వ్యవహారం పీక్స్ లో ఉండేది.. మరి రజనీ నటించిన గత నాలుగైదు సినిమాలు ఎప్పుడొచ్చాయి? వాటి పేర్లేమిటో గుర్తున్నందెంతమందికి! కనీసం రజనీ రాబోయే సినిమా పట్టించుకునే నాథుడెవరు? రజనీ ఇమేజ్ మీద, ఫ్యాన్స్.. వంకరగా మెట్లను దించి, దించి.. ఆయన సినిమా మార్కెట్ ను సదరు దర్శకులు దారుణంగా దించేశారు.
మరి రీమేక్స్, రీమిక్స్ చేస్తూ పవన్ కల్యాణ్ ను కూడా అదే బాటే పట్టించడంలో ఆయన చుట్టూ ఉన్న వారు గట్టిగా కృషి చేస్తున్నారు. ఒక్కటైతే నిజం.. ఫ్యాన్స్ కు మాత్రమే నచ్చి హిట్టైన సినిమా, ఫ్యాన్స్ మాత్రమే ఓటేసి గెలిచిన నాయకుడు చరిత్రలో లేడు!