బాలీవుడ్ లో ప్రస్తుత సూపర్ స్టార్లలో ఒకరు అక్షయ్ కుమార్. అక్కడ భారీ రెమ్యూనిరేషన్ ను పొందే హీరోల జాబితాలో కూడా అక్షయ్ పేరు ముందు వరసలో ఉంటుంది. మరి భారీ రెమ్యూనిరేషన్ పొందే హీరోల బడ్జెట్ భారీ స్థాయిలో ఉంటుంది. మరి ఆ భారీ తనానికి తగ్గట్టుగా సినిమా హిట్ అయితే దక్కే లాభాలెన్నో కానీ, ఫ్లాప్ అయితే నష్టాలు మాత్రం అంతే భారీగా ఉంటాయి.
ఇలాంటి క్రమంలో అక్షయ్ కుమార్ ఫ్లాప్ సినిమాల వల్ల సుమారు వెయ్యి కోట్ల రూపాయల మొత్తం ఆవిరయ్యిందంటే ఆశ్చర్యం కలగకమానదు. ఆ డబ్బంతా ఒకే వ్యక్తిది కాకపోవచ్చు. కొంతమంది నిర్మాతలదీ కాకపోవచ్చు. ఇప్పుడున్న మార్కెట్ విధానం ప్రకారం.. డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు.
ఒక పెద్ద హీరో సినిమా పోయిందంటే, నిర్మాతకు పోయేది పెద్దగా లేదు. ఏరియా కొద్దీ డిస్ట్రిబ్యూటర్లు తలా కొంత పోగొట్టుకుంటూ ఉంటారు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టుగా.. భారీ బడ్జెట్ సినిమాల నష్టం ఒకరి మీద కాకుండా, చాలా మంది చేతుల్లోంచి పోతోంది కాబట్టి కనపడదు!
అక్షయ్ కుమార్ విషయానికి ఇస్తే.. ఇతడి ఇటీవలి సినిమాలే ఏకంగా నాలుగు వందల కోట్ల రూపాయల నష్టాలను మిగిల్చాయట. సమ్రాట్ పృథ్విరాజ్ వాటా 140 కోట్లు అయితే, రామ్ సేతు వాటా 70 కోట్లట! ఇవిగాక.. ఇతడి కెరీర్ లో ఈ మధ్య మరిన్ని ఫ్లాపులున్నాయి. రక్షాబంధన్, బచ్చన్ పాండే, తషాన్, రౌడీ రాథోడ్, కంబక్త్ ఇష్క్ వంటి రీమేక్స్ తో సూపర్ ఫ్లాప్ లను కొట్టాడు అక్షయ్. ఇవిగాక.. ఇతడి కెరీర్ లో మరి కొన్ని ఫ్లాప్ సినిమాల నష్టాలను కలిపితే.. మొత్తం విలువ వెయ్యి కోట్ల పై మాటేనట!
అయితే.. ఇదే సమయంలో సూపర్ హిట్స్ కు కూడా లోటు లేదు. ఒక్కోసారి చాలా తక్కువ బడ్జెట్ తో అక్షయ్ సినిమాలు రెడీ అయిపోతాయి. అలాంటి సినిమాలు వచ్చినప్పుడు లాభాలు. అందుకే అక్షయ్ స్టార్ హీరో. ఇప్పటి వరకూ కెరీర్ లో వంద సినిమాల వరకూ చేసిన ఈ హీరో కెరీర్ లో 60 శాతం ఫ్లాపులున్నాయి. మిగతావి బ్రేక్ ఈవెన్ నుంచి లాభాల వరకూ వెళ్లిన సినిమాలు.