ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. 37 యేళ్ల వయసున్న బ్రాడ్.. టెస్టు క్రికెట్ లో తన ఆఖరి బంతికి వికెట్ తీసి, ఇంగ్లండ్ కు మధురమైన విజయాన్ని ఇచ్చాడు. రిటైర్మెంట్ ప్రకటించిన ప్లేయర్ కు ఆఖరి బంతికి వికెట్ దక్కడం జీవితంలో నిలిచిపోయే మధురానుభూతి అనడంలో ఆశ్చర్యం లేదు. అందులోనూ ఈ సారి యాషెస్ లో సీరిస్ ఆరంభంలో ఇంగ్లండ్ ప్రదర్శన అంతంత మాత్రం. గెలిచే మ్యాచ్ వానకు పోయింది. ఎట్టకేలకూ సీరిస్ ను 2-2తో సమం చేసి ఇంగ్లండ్ ఊరట పొందింది. బ్రాడ్ ఆఖరి బంతికి తీసిన వికెట్ ఇలా ఇంగ్లండ్ కు చాలా ప్రత్యేకం.
37 యేళ్ల వయసు వరకూ ఒక ఫాస్ట్ బౌలర్ కెరీర్ ను కొనసాగించడం అంటే మాటలేమీ కాదు. 30 దాటగానే ఫాస్ట్ బౌలర్ల కెరీర్ కు రోజులు లెక్క బెట్టుకోవడమే. 32 వచ్చాయంటే.. ఇక ఎప్పుడెప్పుడు రిటైర్మెంట్ అనే చర్చ మొదలవుతుంది. ఈ రోజుల్లో 30 లోపు వయసున్న ఫాస్ట్ బౌలర్లే.. నిరంతరం గాయాల బారిన పడుతూ, ఒక మ్యాచ్ ఆడితే రెండో మ్యాచ్ కు అందుబాటులో ఉండటం కష్టం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు ప్రత్యేకంగా నిలుస్తూ వచ్చారు. వారిలో ఒకరు అండర్సన్ కాగా, రెండో బౌలర్ స్టువర్ట్ బ్రాడ్. ఈ ఇద్దరు ఇంగ్లిష్ ఫాస్ట్ బౌలర్లు… వయసుకు సవాలు విసిరినట్టే!
167 టెస్టులు ఆడిన స్టువర్ట్ బ్రాడ్.. 604 వికెట్లు తీశాడు. టెస్టుల్లో ఇతడి అత్యధిక స్కోరు 169! వన్డేలు, టీ20లు మాత్రం పరిమిత స్థాయిలోనే ఆడాడు బ్రాడ్. అండర్సన్ గణాంకాలు కూడా ఒక రకంగా ఇలానే ఉంటాయి.
ఇక ఈ జూనియర్ బ్రాడ్ భారతీయులకు ఒక ఓవర్ ద్వారా గుర్తుండిపోతాడు. 2007 టీ20 ప్రపంచకప్ లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియన్ బ్యాటర్ యువరాజ్ సింగ్ బ్రాడ్ వేసిన ఓవర్లో ఆరు బంతులనూ సిక్సర్లుగా మలిచాడు! క్రికెట్ లో పెను సంచలన ఓవర్ అది. వేరే బ్యాట్స్ మెన్ కూడా ఇలా ఆరు బంతులనూ సిక్సులుగా కొట్టిన వారున్నా.. బ్రాడ్ వర్సెస్ యువరాజ్ ఓవర్ కు ఉన్నంత గ్లామర్ మరోదానికి లేదు!
అంతర్జాతీయ క్రికెట్ లో అలాంటి ఓవర్ ఒకటి వేశాడంటే.. ఆ బౌలర్ మానసిక పరిస్థితి ఆ తర్వాత చాలా దెబ్బతింటుంది. అది కూడా బ్రాడ్ తన 22వ యేట అలాంటి ఓవర్ వేశాడు. ఆ వయసులో అతడి పరిస్థితి ఊహించడం కష్టం ఏమీ కాదు. ఆ రోజు మ్యాచ్ ముగిశాకా.. ఆ మ్యాచ్ కు రిఫరీగా వ్యవహరించిన స్టువర్ట్ బ్రాడ్ తండ్రి క్రిస్ బ్రాడ్ వెళ్లి యువరాజ్ ను కలిశాడట.
తన కొడుకు కెరీర్ నే నాశనం చేశావన్నట్టుగా.. యువరాజ్ తో వ్యాఖ్యానించాడట ఆ మాజీ ఇంగ్లండ్ క్రికెటర్. అయితే ఆ ఆరు సిక్సర్ల ప్రభావం నుంచి బ్రాడ్ బయటపడ్డాడు. టెస్టుల్లో ఆరు వందలకు పైగా వికెట్లను సాధించి.. కెరీర్ కు వీడ్కోలు పలికాడిప్పుడు!