నమ్మి సర్వస్వం అర్పించిన పాపానికి ప్రాణాల్నే మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఎన్నో కలలతో పల్లె నుంచి నగరానికి వచ్చింది. కలలను సాకారం చేసుకునే క్రమంలో ఒక్కో మెట్టు ఎక్కుతున్న క్రమంలో ప్రియుడి వంచనకు గురయ్యానని తెలిసి ప్రాణాలపై విరక్తి చెందింది. చివరికి బలవన్మరణం చెందింది. కన్నడ నటి చందన (29) జీవితం విషాదాంతం కావడం ప్రతి ఒక్కర్నీ కలచి వేస్తోంది. ఆమె మరణానికి దారి తీసిన కారణాలను తెలుసుకుందాం.
కర్నాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లా బేలూరుకు చెందిన చందనకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. తాను నటిగా రాణించాలనేది ఆమె తపన. దీంతో ఎన్నో కలలు కంటూ అక్కడి నుంచి బెంగళూరుకు వచ్చింది. ఆమె ప్రయత్నాలు నెమ్మదిగా సత్ఫలితాలను ఇవ్వడం ప్రారంభించాయి. కన్నడ బుల్లితెరపై నటించే అవకాశాలను దక్కించుకుంది. బుల్లితెరతో పాటు పాటు పలు ప్రకటనలు, సినిమాలో చిన్నచిన్న పాత్రల్లో ఆమె తళుక్కుమని మెరిసింది.
ఒక ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేసే దినేశ్ ఆమెకు పరిచయం అయ్యాడు. అది ప్రేమకు దారి తీసింది. ఐదేళ్ల పాటు ఇద్దరూ చెట్టపట్టాలేసుకుని తిరిగారు. దినేశ్‌కు ఆమె సర్వస్వం అర్పించింది. తనను పెళ్లి చేసుకోవాలని కొంతకాలంగా ప్రియుడిపై ఆమె ఒత్తిడి చేస్తోంది. అయితే అతను ససేమిరా అంటున్నట్టు తెలిసింది. దీంతో చందన నేరుగా దినేశ్ కుటుంబసభ్యుల వద్దకెళ్లి పెళ్లి విషయాన్ని ప్రస్తావించింది. ఆమెను వాళ్లు అవమానించి పంపారు.
దీంతో మోసపోయినట్టు ఆమె గ్రహించింది. జీవితం అంధకారమైందని భావించింది. మోసపోయిన బతుకుపై విరక్తి చెంది సోమవారం తన నివాసంలో పురుగుల మందు తాగింది. ఆ వీడియోను ప్రియునికి వాట్సప్ చేసింది. ఆ వీడియోలో దినేశ్ తనను మోసగించడంపై అనేక ఆరోపణలు చేసింది. తనకు దినేశ్ చేసిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరుమున్నీరైంది. వీడియోను చూడగానే భయంతో ఆమె వద్దకు దినేశ్ చేరుకున్నాడు. ఆమెను ఆస్పత్రికి తరలించి పరారయ్యాడు.
పురుగుల మందు ఎక్కువ మోతాదులో తాగడంతో ఆమె ప్రాణాలు వదిలింది. తన డబ్బుతో పాటు కెరీర్‌ను దినేశ్‌కు అర్పిస్తే మోసం చేశాడని చందనం చెప్పడం ప్రతి ఒక్కర్నీ కలచివేస్తోంది. మరో అమ్మాయిని ఇలా మోసం చేయవద్దని ఆమె ఆ వీడియోలో వేడుకుంది. కాగా దినేశ్ గతంలో కూడా అమ్మాయిలను లోబరుచుకుని మోసం చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. సెల్ఫీ వీడియో ఆధారంగా దినేశ్ కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.