కోటి విద్యలు కూటి కోసమే అంటారు. ముందు బతుకుదెరువు చూసుకుంటే…తర్వాత ఎన్ని వేషాలైనా వేయవచ్చు. కరోనా మహమ్మారి ఓడలను బండ్లు చేస్తోంది. బండ్లను మాత్రం ఓడలు చేసే పరిస్థితి లేదు. తాజాగా ఓ సీరియల్ నటికి కరోనా దీనస్థితి తీసుకొచ్చింది. ఉపాధి కోసం చివరికి రాఖీలు అమ్ముకునే దయనీయ స్థితిలోకి కరోనా నెట్టేసింది.
బుల్లితెర, వెండితెరలను నమ్ముకున్న కళాకారులకు షూటింగ్‌లు లేక ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. లాక్‌డౌన్ స్టార్ట్ అయిన మొదట్లో ఓ నటుడు కుటుంబాన్ని పోషించుకునేందుకు పండ్లు అమ్ముతూ వార్తలకెక్కడాన్ని చూశాం. గతంలో అతను అదే వ్యాపారం చేస్తూ చిత్రపరిశ్రమలోకి వచ్చాడు. కానీ చిత్ర పరిశ్రమను కరోనా మహమ్మారి కుదేలు చేయడంతో చివరికి మునుపటి వృత్తినే నమ్ముకోవాల్సి వచ్చిందని అతను ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
తాజాగా ‘సాథ్ నిభానా సాథియా’ సీరియల్ (కోడలా కోడలా కొడుకు పెళ్లామా)తో పాపులారిటీ సంపాదించుకున్న విద్యా విత్లానీ కూడా ఉపాధి కోసం రాఖీల అమ్మకం చేపట్టారు. ఈ నటి చివరిగా 'హమారి బహు సిల్క్' సీరియల్‌లో నటించారు. కరోనా విపత్తో లేక ఇతరేతర కారణాలో తెలియదు కానీ, చివరిగా నటించిన సీరియల్‌కు సంబంధించి నిర్మాతలు ఒక్క పైసా రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదు. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో ఎంతో ఆవేదనతో చెప్పుకొచ్చారు. తనకు లక్షల రూపాయలు రావాల్సి ఉందన్నారు. ఏడాది అవుతున్నా ఒక్క పైసా చెల్లించలేదని, అలాగే తాను దాచుకున్న డబ్బు మొత్తం ఖర్చులకు కరిగిపోయిందన్నారు.
ఈ నేపథ్యంలో కుటుంబ పోషణకు ఏదో ఒకటి చేయాల్సి వస్తోందన్నారు. తనకు రాఖీలు చేసే విద్యలో ప్రావీణ్యం ఉందన్నారు. దీంతో వివిధ డిజైన్లలో ఆకర్షణీయంగా రాఖీలు తయారు చేస్తూ ఆన్‌లైన్‌లో అమ్ముకుంటూ కొంత డబ్బు సంపాదిస్తున్నట్టు ఆమె తెలిపారు.
తన భర్త విపుల్ కూడా నటుడేనని, కరోనా వల్ల అతనికి కూడా పనిలేకుండా పోయిందన్నారు. ఇలా దేశ వ్యాప్తంగా అన్ని భాషల బుల్లి, వెండితెర పరిశ్రమల్లో షూటింగ్‌లు లేకపోవడంతో పాటు నటించిన వాటికి రెమ్యునరేషన్‌కు నోచుకోక చిన్నచిన్న ఆర్టిస్టుల కష్టాలు అన్నీఇన్నీ కావు.